ETV Bharat / business

ఈ పోస్టాఫీస్​ పొదుపు పథకాలు తెలుసా? వడ్డీ రేటు 7% పైనే!

author img

By

Published : Jul 3, 2022, 3:20 PM IST

Post Office Savings Schemes: రిజర్వ్​ బ్యాంకు రెపో రేటును పెంచిన తర్వాత.. ఎస్​బీఐ, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్​ బ్యాంక్​ వంటి ప్రముఖ బ్యాంకులు ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అయినా కూడా మంచి రాబడిని అందించలేకపోతున్నాయని అంటున్నారు నిపుణులు. వీటితో పోలిస్తే.. పోస్టాఫీస్​ పథకాలు కొన్ని లాభదాయకంగా ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో చూడండి.

post office savings schemes which offers interest rate above 7 percent
post office savings schemes which offers interest rate above 7 percent

Post Office Savings Schemes: ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన త‌ర్వాత బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతున్నాయి. ఆర్‌బీఐ రెపోరేటును గ‌త నెల‌(మే)లో 40 బేసిస్ పాయింట్లు పెంచ‌గా, ఈ నెల (జూన్‌)లో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపోరేటు 4.90 శాతానికి చేరింది. ఇందుకు అనుగుణంగానే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్‌, పీఎన్‌బీ, బీఓబీ వంటి ప‌లు బ్యాంకులు ఎఫ్‌డీల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతున్నాయి. దీంతో వినియోగ‌దారులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు ఆక‌ర్షితుల‌వుతున్నారు. అయితే, వ‌డ్డీ రేట్లు పెరిగిన త‌ర్వాత కూడా ఇవి ద్రవ్యోల్బ‌ణాన్ని మించి రాబ‌డిని అందించ‌డంలో విఫ‌లం అవుతున్నాయ‌ని అంటున్నారు నిపుణులు. దీర్ఘ‌కాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌తో పోలిస్తే పోస్టాఫీసు అందించే ఈ మూడు ప‌థ‌కాలు లాభ‌దాయ‌కంగా ఉన్నాయంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)..
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది ప్రభుత్వ హామీతో పదవీ విరమణ ప్రయోజనాలను అందిస్తున్న పథకం. ఈ పథకం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం రూపొందించారు. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పెద్ద‌లు, స్వచ్ఛంద ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన 55 నుంచి 60 ఏళ్ల‌లోపు వ‌య‌సువారు, దేశ రక్షణ సిబ్బందిగా ప‌నిచేసి 50 నుంచి 60 ఏళ్ల వ‌య‌సులో రిటైరైన వారు ఇందులో చేర‌వ‌చ్చు. ఈ పథకంలో రూ. 1000 నుంచి రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఎంతైనా.. ఒకేసారి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. వ్యక్తిగతంగా గానీ, ఉమ్మడిగా గానీ ఖాతాను తెరిచే వీలుంది. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40 శాతం. ఐదేళ్ల కాల‌ప‌రిమితి ఉంటుంది. ఈ ప‌థ‌కంలో వ‌డ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు. ప్ర‌తీ ఆర్థిక సంవ‌త్స‌రం.. ఏప్రిల్‌, జూలై, అక్టోబ‌రు, జ‌న‌వ‌రి నెల‌ల్లో మొద‌టి తేదిన వ‌డ్డీ ఖాతాల‌లో జ‌మ‌వుతుంది. అంతేకాకుండా ఈ ప‌థకంలో పెట్టుబ‌డులు పెట్టిన‌వారు పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల‌తో క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు.

ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (PPF)..
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతా 'ఈఈఈ' ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్న ప‌థ‌కం. 15 సంవత్సరాల సుదీర్ఘ కాల‌ప‌రిమితి ఉండ‌డం వ‌ల్ల‌ దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు అనుకూలంగా ఉంటుంది. ఖాతాలో కనీసం రూ. 500 నుంచి గరిష్ఠంగా ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు జమ చేయొచ్చు. మైనర్ల పేరుపైనా ఖాతా తెరవొచ్చు. ఈ ఖాతాలో ప్రస్తుతం వార్షిక వడ్డీ 7.10 శాతంగా ఉంది. వార్షికంగా కాంపౌండ్ చేస్తారు. ఈ పథకంలో మెచ్యూరిటీ కంటే ముందే పెట్టుబడులు పూర్తిగా ఉపసంహరించుకోలేరు. అయితే, ఖాతా తెరిచిన ఏడో సంవత్సరం నుంచి పాక్షిక విత్డ్రాలను అనుమతిస్తారు. అదేవిధంగా ఖాతా తెరిచిన మూడో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు రుణం తీసుకోవచ్చు. ఈ ఖాతాలో చేసిన డిపాజిట్లపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీపై, మెచ్యూరిటీ మొత్తంపై కూడా పన్ను వర్తించదు.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న (SSY)..
సుకన్య సమృద్ధి యోజన ప్రత్యేకించి ఆడపిల్లల భవిష్యత్ కోసం ప్రవేశపెట్టిన పథకం. 10 ఏళ్లలోపు ఆడపిల్లల పేరుపై ఈ ఖాతా తెరవొచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం వార్షికంగా 7.60 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ ప‌థ‌కంలో ఏడాదికి రూ. 250 నుంచి రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఖాతా తెరిచిన నాటి నుంచి గ‌రిష్టంగా 15 సంవ‌త్స‌రాల పాటు పెట్టుబ‌డులు పెట్టాల్సి ఉంటుంది. ఆడ‌పిల్ల‌కు 21 ఏళ్లు వ‌చ్చిన త‌ర్వాత డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆడిపిల్లల భవిష్యత్ కోసం డిపాజిట్ చేసే వారు, ఈ పథకాన్ని ఎంచుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందొచ్చు.

5 సంవ‌త్స‌రాల కాల‌పరిమితిగ‌ల రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వివిధ బ్యాంకులు అందిస్తున్న వ‌డ్డీ రేట్లు..

post office savings schemes which offers interest rate above 7 percent
ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వివిధ బ్యాంకుల్లో వడ్డీరేట్లు

చివ‌రిగా..
పైన తెలిపిన పోస్టాపీస్ పొదుపు ప‌థ‌కాలు 7 శాతానికి మించి వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తుండ‌గా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై అంత‌కంటే త‌క్కువ వ‌డ్డీని ఇస్తున్నాయి. పెట్టుబ‌డిదారులు త‌మ ల‌క్ష్యానికి అనుగుణంగా త‌గిన పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి. మ‌దుపు చేసేముందు కాల‌ప‌రిమితితో పాటు ఇత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి.

ఇవీ చూడండి: మార్కెట్లు క్రాష్: ఆ ఒక్కటి చూసి షేర్లు కొనొద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్!

మ్యూచువల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్​ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.