ETV Bharat / business

భారత్‌లో తొలి చిప్‌ ఫ్యాక్టరీ వచ్చేస్తోంది.. రెండేళ్లలో ఉత్పత్తి షురూ!

author img

By

Published : Sep 14, 2022, 7:02 AM IST

దేశంలో తొలి చిప్​ ఫ్యాక్టరీ వచ్చేస్తోంది. వేదాంతా, ఫాక్స్‌కాన్‌ సంస్థలు కలిసి సెమీకండక్టర్‌ ప్లాంటును గుజరాత్‌లో నిర్మించనున్నాయి. రెండేళ్లలో ఈ ప్లాంటులో ఉత్పత్తి మొదలవుతుందని వేదాంతా ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు.

India First Chip Factory
India First Chip Factory

India First Chip Factory : గనుల దిగ్గజం వేదాంతా, తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ కలిసి దేశంలో తొలి సెమీకండక్టర్‌ ప్లాంటును రూ.1.54 లక్షల కోట్లతో గుజరాత్‌లో నిర్మించనున్నారు. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అహ్మదాబాద్‌ జిల్లాలో 1000 ఎకరాల భూమిలో సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌ యూనిట్‌, డిస్‌ప్లే ఫ్యాబ్‌ యూనిట్‌, సెమీకండక్టర్‌ అసెంబ్లింగ్‌-టెస్టింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తారు. ఇందు కోసం వేదాంతా-ఫాక్స్‌కాన్‌లు 60:40 నిష్పత్తిలో ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తాయి. 'రెండేళ్లలో ఈ ప్లాంటులో ఉత్పత్తి మొదలవుతుంద'ని వేదాంతా ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ మంగళవారం తెలిపారు. 'ప్రారంభ దశలో గుజరాత్‌ యూనిట్‌లో నెలకు 40,000 వేఫర్లు (ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌లో వాడతారు); 60,000 ప్యానెళ్లను తయారు చేస్తామ'న్నారు.

పెట్టుబడులు ఇలా..
రూ.94,000 కోట్లు డిస్‌ప్లే తయారీ యూనిట్‌పైన; రూ.60,000 కోట్లు సెమీకండక్టర్‌ తయారీ ప్లాంటుపైన పెట్టుబడులు పెడతారు. కార్లు, మొబైల్‌ ఫోన్లు, ఏటీఎమ్‌ కార్డు దాకా డిజిటల్‌ వినియోగదారు ఉత్పత్తుల్లో సెమీకండక్టర్‌ చిప్‌లు లేదా మైక్రోచిప్‌లే కీలక భాగాలు. భారత సెమీకండక్టర్‌ మార్కెట్‌ విలువ 2021లో 27.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2026 కల్లా ఇది 64 బి. డాలర్లకు చేరుతుందన్న అంచనాలున్నాయి.

కోటి ఉద్యోగాలు లక్ష్యం
దుబాయ్‌కి చెందిన నెక్ట్స్‌ఆర్బిట్‌, ఇజ్రాయిల్‌కు చెందిన టవర్‌ సెమీకండక్టర్లు కలిసి కర్ణాటకలోని మైసూరులో సెమీ కండక్టర్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తాయి. సింగపూర్‌కు చెందిన ఐజీఎస్‌ఎస్‌ వెంచర్‌ తమిళనాడులో యూనిట్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 'ప్రధాని మోదీ నాయకత్వంలో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాం. ఇపుడు ఆ సంఖ్యను కోటికి తీసుకెళ్లాలన్నదే మా లక్ష్యం. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిని ప్రస్తుత 80 బి. డాలర్ల(రూ.6 లక్షల కోట్లు) నుంచి 300 బి. డాలర్ల(రూ.25 లక్షల కోట్ల)కు తీసుకెళ్లడంపై పనిచేస్తున్నామ'ని ఎమ్‌ఓయూ కార్యక్రమంలో ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.

"ఈ అవగాహనా ఒప్పందం వల్ల దేశీయ సెమీకండక్టర్‌ తయారీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రధాన అడుగు పడింది. రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడుల వల్ల ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. ఉద్యోగాలు వస్తాయి. మన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు, అనుబంధ పరిశ్రమలకు భారీ వ్యవస్థ ఏర్పడుతుంది"

- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్

ఇవీ చదవండి: ఇక ఆ ఔషధాలు మరింత చౌక.. కేంద్రం అలా చేయడమే కారణం

'ఆ పని చేస్తే పింక్ స్లిప్​ ఖాయం'.. సాఫ్ట్​వేర్​ ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.