ETV Bharat / business

ఒక్కో కరోనా వేరియంట్‌కు ఒక్కో టీకా తీసుకొస్తాం: కృష్ణ ఎల్ల

author img

By

Published : Nov 29, 2022, 8:36 AM IST

కరోనా వైరస్‌ రకాల(కొవిడ్‌ వేరియంట్స్‌) ఆధారంగా పనిచేసే టీకాల ఆవిష్కరణలపై భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ దృష్టి సారించింది. ఈ మేరకు ప్రత్యేకంగా టీకాలు తీసుకొచ్చేందుకు వీలుగా పరిశోధనలు ప్రారంభించింది. కొవిడ్‌పై పోరాటానికి భవిష్యత్తులోనూ తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని సంస్థ వెల్లడించింది.

bharat biotech krishna ella
భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల

భవిష్యత్తు సన్నద్ధతలో భాగంగా వివిధ కరోనా వైరస్‌ రకాల(కొవిడ్‌ వేరియంట్స్‌)పై పనిచేసే టీకాలను ఆవిష్కరించడంపై భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ దృష్టి సారించింది. వైరస్‌ రకాల ఆధారంగా ప్రత్యేకంగా టీకాలు తీసుకొచ్చేందుకు వీలుగా పరిశోధనలు ప్రారంభించినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. ఈ సంస్థ తీసుకొచ్చిన చుక్కల మందు టీకా 'ఇన్‌కొవాక్‌'ను రెండు ప్రాథమిక డోసులుగా, బూస్టర్‌ డోసుగా వినియోగించేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతిచ్చిన విషయం విదితమే.

ఈ సందర్భంగా డాక్టర్‌ కృష్ణ ఎల్ల స్పందిస్తూ.. కొవిడ్‌ టీకాలకు గిరాకీ తగ్గినప్పటికీ పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలను, టీకాల ఆవిష్కరణను నిలుపుదల చేయలేదని తెలిపారు. చుక్కల మందు టీకా ఇందుకు ఓ ఉదాహరణ అని చెప్పారు. కొవిడ్‌పై పోరాటానికి భవిష్యత్తులోనూ తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని, ఇప్పటి వరకూ తాము అభివృద్ధి చేసిన టీకాల సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మున్ముందు ఒక్కో రకమైన కొవిడ్‌ వైరస్‌కు ఒక్కో టీకా తీసుకొస్తామని సోమవారం స్పష్టంచేశారు.

"ఇన్‌కొవాక్‌" ప్రత్యేకతలు..

  • ప్రపంచంలోనే తొలిసారిగా అనుమతి పొందిన చుక్కల మందు కరోనా టీకా ఇదే.
  • దీన్ని ప్రాథమిక డోసులుగానూ, బూస్టర్‌ డోసుగానూ వినియోగించేందుకు అనుమతి లభించింది.
  • ప్రాథమిక డోసుగా వేరే టీకా తీసుకున్నప్పటికీ 'ఇన్‌కొవాక్‌'ను బూస్టర్‌ డోసుగా వినియోగించవచ్చు.
  • దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో 3,100 మంది వాలంటీర్లపై ఈ టీకా ప్రయోగాలు నిర్వహించారు. ప్రాథమిక డోసు కింద వేరే టీకా తీసుకున్న 875 మందికి చుక్కల మందు టీకాను బూస్టర్‌ డోసుగా ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు.
  • ఈ టీకా ఇవ్వడం, నిల్వ, రవాణా ఎంతో సులువని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది.
  • యూఎస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ- సెయింట్‌ లూయీస్‌ భాగస్వామ్యంతో ఈ టీకాను భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసింది.బయోటెక్‌ ఆవిష్కరణలకు ప్రోత్సాహం: మనదేశంలో బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్‌ రాజేష్‌ ఎస్‌.గోఖలే తెలిపారు. ‘ఇన్‌కొవాక్‌’ చుక్కల మందు టీకాను వినూత్నమైన ఆవిష్కరణగా పేర్కొన్నారు. దీనివల్ల కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం లభించిందన్నారు. చుక్కల మందుతో ఎక్కువ మంది ప్రజలకు టీకా అందుబాటులోకి వస్తుందని వాషింగ్టన్‌ యూనివర్సిటీ- సెయింట్‌ లూయీస్‌కు చెందిన డాక్టర్‌ మైఖేల్‌ ఎస్‌. డైమండ్‌ అభిప్రాయపడ్డారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.