మండిపోతున్న నూనె ధరలు.. తగ్గిపోతున్న అమ్మకాలు

author img

By

Published : Apr 27, 2021, 7:23 AM IST

oil prices increasing

వంట నూనెల ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యులు అల్లాడుతున్నారు. అధిక ధరల కారణంగా పొద్దుతిరుగుడు, వేరుసెనగ నూనెల అమ్మకాలు గణనీయంగా తగ్గుతున్నాయి. కాస్త ధర తక్కువుండే రైస్‌బ్రాన్‌, పామాయిల్‌ కొనుగోలుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

వంట నూనెల ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పొద్దుతిరుగుడు, వేరుసెనగ నూనెల అమ్మకాలు గణనీయంగా తగ్గుతున్నాయి. కాస్త ధర తక్కువుండే రైస్‌బ్రాన్‌, పామాయిల్‌ కొనుగోలుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఉక్రెయిన్‌, రష్యా, కజికిస్థాన్‌ తదితర దేశాల నుంచి కృష్ణపట్నం, చెన్నై, కాకినాడ తదితర నౌకాశ్రయాలకు పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతోంది. టోకు ధరలు మండిపోతుండటంతో చిల్లర మార్కెట్లలో పెంచాల్సి వస్తోందని ‘విజయ’ బ్రాండు పేరుతో వంటనూనెలను విక్రయించే ‘రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య’ (ఆయిల్‌ఫెడ్‌) వర్గాలు ‘ఈనాడు’కు తెలిపాయి. ధరలు బాగా పెరుగుతుండటంతో పొద్దుతిరుగుడు, వేరుసెనగ, పామాయిల్‌ నూనెల అమ్మకాలు గత 3 నెలల్లో 1,973 టన్నులు తగ్గిపోయినట్లు ప్రభుత్వానికి సమాఖ్య తాజాగా తెలిపింది.

తగ్గిన దిగుమతులు

అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదలతో పొద్దుతిరుగుడు నూనె దిగుమతులు గణనీయంగా తగ్గాయి. కాకినాడ, కృష్ణపట్నం నౌకాశ్రయాలకు విదేశాల నుంచి వచ్చే పొద్దుతిరుగుడు నూనెనే తెలుగు రాష్ట్రాల టోకు వ్యాపారులు కొంటారు. 2020 మార్చిలో ఈ నౌకాశ్రయాలకు 81,120 టన్నుల నూనె రాగా.. ఈ ఏడాది మార్చిలో 46,930 టన్నులే (42% తక్కువ) వచ్చింది. దేశవ్యాప్తంగా 2020 నవంబరు నుంచి 2021 మార్చి వరకూ (5 నెలల్లో) 9.17 లక్షల టన్నుల నూనె దిగుమతి అయింది. 2019 నవంబరు నుంచి 2020 మార్చి వరకూ 12.64 లక్షల టన్నులు రావడం గమనార్హం. మరోవైపు ధర కాస్త తక్కువగా ఉండటంతో ముడి పామాయిల్‌ దిగుమతులు పెరిగాయని ‘భారత నూనె మిల్లుల సంఘం’ తెలిపింది.

పత్తి నూనె కలిపి కల్తీ

సాధారణ వంటనూనెల ధరలు మండుతుండటంతో వాటిలో కల్తీ బాగా పెరిగింది. కొన్ని చిన్న కంపెనీలు పొద్దుతిరుగుడు నూనె పేరుతో ప్యాకెట్లలో శుద్ధి చేసిన పామాయిల్‌ లేదా పత్తి నూనె నింపి అమ్ముతున్నాయని తమ పరిశీలనలో తేలిందని ఆయిల్‌ఫెడ్‌ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. వినియోగదారులు ప్రముఖ బ్రాండ్ల నూనె ప్యాకెట్లను జాగ్రత్తగా పరిశీలించిన తరవాతే కొనాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో పత్తి గింజలు సులభంగా అధికంగా దొరుకుతుండటంతో.. వాటి నుంచి నూనె తీసి వంట నూనెల్లో కల్తీ చేస్తున్నారని ‘తెలంగాణ పత్తి మిల్లుల సంఘం’ వ్యాపారి ఒకరు వివరించారు. డిమాండు కారణంగా ఏడాది వ్యవధిలోనే పత్తి గింజల నూనె ధర రూ.70 నుంచి 140కి చేరడం గమనార్హం.

ఇదీ చూడండి:

ఆస్పత్రుల్లో హృదయ విదారక దృశ్యాలు..బరువెక్కుతున్న గుండెలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.