ETV Bharat / business

దేశ జీడీపీ రికార్డు- క్యూ1లో 20.1 శాతం వృద్ధి

author img

By

Published : Aug 31, 2021, 5:47 PM IST

Updated : Aug 31, 2021, 7:18 PM IST

india gdp in q1
భారత జీడీపీ వృద్ధి రేటు

17:45 August 31

దేశ జీడీపీ రికార్డు- క్యూ1లో 20.1 శాతం వృద్ధి

భారత జీడీపీ వృద్ధి రేటు బలంగా పుంజుకుంది. కరోనా రెండో దశ ప్రభావం ఉన్నప్పటికీ.. మెరుగైన వృద్ధిని సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో 20.1 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో దేశ జీడీపీ 24.4 శాతం పతనమైంది.

ఈ ఏడాది కరోనా ముప్పు ఉన్నా.. కొవిడ్ పూర్వ స్థాయి గణాంకాలు సాధ్యమయ్యాయి. తాజా వృద్ధితో దేశ జీడీపీ విలువ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.32,38,020 కోట్లుగా నమోదైంది. ఇది 2019-20 ఏడాది క్యూ1(రూ. 35,66,708 కోట్లు)తో పోలిస్తే కాస్త తక్కువ. 2020-21 క్యూ1లో దేశ జీడీపీ ఏకంగా రూ. 26,95,421 కోట్లకు క్షీణించింది.

ఏ రంగం ఎలా..?

జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం.. దేశ స్థూల విలువ జోడింపు(జీవీఏ) వృద్ధి.. తయారీ రంగంలో 49.6 శాతంగా రికార్డైంది. ఏడాది క్రితం క్యూ1లో ఇది 36 శాతం పడిపోగా.. తాజాగా అంతకుమించి వృద్ధి సాధించడం విశేషం. 

వ్యవసాయ రంగ జీవీఏ వృద్ధి 4.5 శాతం కాగా.. నిర్మాణ రంగ జీవీఏ 68.3 శాతం ఎగబాకింది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, వృత్తి సేవల వృద్ధి 3.7 శాతంగా నమోదైంది. ప్రజా పరిపాలన, రక్షణ, ఇతర సేవల జీవీఏ 5.8 శాతం అధికమైంది. 

కరోనా వైరస్​ విజృంభణ కారణంగా గతేడాది లాక్​డౌన్​ అస్త్రాన్ని ప్రయోగించింది కేంద్రం. అందువల్ల దేశం మొత్తం మూతపడింది. ఫలితంగా వృద్ధి రేట్లు కుంటుపడ్డాయి.

కాగా.. 2021 తొలి త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 7.9శాతంగా ఉంది.

ద్రవ్యోల్బణం లెక్కలు

మరోవైపు, పారిశ్రామిక కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం(retail inflation for industrial workers) స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల.. జులైలో ఈ ద్రవ్యోల్బణం 5.27 శాతంగా నమోదైంది. జూన్​లో ఇది 5.57 శాతం ఉండగా.. గతేడాది జులైలో 5.33 శాతంగా నమోదైంది.

దేశవ్యాప్త పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ జులై నెలలో 1.1 పాయింట్లు పెరిగి.. 122.8కు చేరింది. జూన్ నెలలో ఇది 121.7 పాయింట్లుగా ఉంది. పాలు, పౌల్ట్రీ, మామిడి, క్యారెట్, కాలిఫ్లవర్, ఉల్లి, టమాట, వంట గ్యాస్, వైద్య రుసుం, అలోపతి మందులు, ఆటో/స్కూటర్/బస్సు రేట్లు, పెట్రోల్ తదితర ధరలు పెరగడం ధరల సూచీ ఎగబాకేందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, చేపలు, వంటనూనె, నిమ్మ, దానిమ్మ రేట్లు పడిపోవడం సూచీపై ప్రభావాన్ని తగ్గించింది.

ఆహార ద్రవ్యోల్బణం

ఆహార ద్రవ్యోల్బణం సైతం స్వల్పంగా తగ్గి 4.91 శాతానికి చేరుకుంది. 2021 జూన్​లో ఆహార ద్రవ్యోల్బణం 5.61 శాతం ఉండగా.. గతేడాది జులైలో 6.38 శాతంగా ఉంది.

ఇదీ చదవండి: దుమ్మురేపిన బుల్- తొలిసారి 57వేల మార్కు దాటిన సెన్సెక్స్

Last Updated :Aug 31, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.