ETV Bharat / city

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం

author img

By

Published : Jun 10, 2020, 12:40 PM IST

Updated : Jun 11, 2020, 6:09 AM IST

supreme-court-on-nimmagadda-ramesh-kumar-case
supreme-court-on-nimmagadda-ramesh-kumar-case

12:02 June 10

నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదులకు త్రిసభ్య ధర్మాసనం నోటీసులిచ్చింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు తగవని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది. ఇలాంటి వ్యవహారంలో ఆర్డినెన్స్ ఎలా తీసుకొస్తారని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.


నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. సర్కారు ఆర్డినెన్స్‌ను కొట్టేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. నిమ్మగడ్డ రమేశ్‌ కుమారే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హృషికేష్‌రాయ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, రాకేష్‌ ద్వివేదీ సహా మొత్తం ఆరుగురు న్యాయవాదులు హాజరయ్యారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, పీఎస్‌ నరసింహ, వర్ల రామయ్య తరపున సీనియర్‌ న్యాయవాదులు ఏకే గంగూలీ, న్యాయవాది గుంటూరు ప్రమోద్‌కుమార్‌, భాజపా నేత కామినేని శ్రీనివాస్‌ తరఫున జంధ్యాల రవిశంకర్‌, ఏపీసీసీ నేత మస్తాన్‌ వలీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు హాజరయ్యారు.


ముందుగా వాదనలు ప్రారంభించిన ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన షంషేర్‌సింగ్‌ తీర్పును ఉదహరించారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243కె, 243జడ్‌ఏ ప్రకారం మంత్రిమండలి సహాయం, సలహాను అనుసరించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు ఉంది. కానీ ఎన్నికల కమిషనర్‌ నియామకం పూర్తిగా గవర్నర్‌ వ్యక్తిగత విచక్షణకు లోబడి ఉంటుందని ఈ కేసులో హైకోర్టు తీర్పు చెప్పడం న్యాయబద్ధం కాదు అని వాదించారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. అందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నిరాకరించారు.

తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున మరో సీనియర్‌ అడ్వకేట్‌ రాకేష్‌ ద్వివేదీ వాదనలు వినిపిస్తూ ‘కమిషనర్‌ నియామకం గవర్నర్‌ చేతుల్లో ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదంటూ ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టానికి చేసిన సవరణను, తద్వారా జరిగిన కొత్త కమిషనర్‌ నియామకాన్ని హైకోర్టు కొట్టేసిందన్నారు. అయితే... ఇదివరకు కమిషనర్‌ నియామకం కూడా రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో చేపట్టిందేనని వాదించారు. ప్రస్తుత కమిషనర్‌ నియామకం విషయంలో హైకోర్టు అభిప్రాయాలు సరైనవైతే, గతంలో రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో ఎన్నికల కమిషనర్‌ను నియమించడం కూడా చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. ఈ విషయంలో హైకోర్టు అభిప్రాయం పరస్పర విరుద్ధంగా ఉందని... హైకోర్టు ఉత్తర్వులు కొనసాగితే ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ తన పదవిలో కొనసాగలేరని కోర్టు దృష్టికి తెచ్చారు. ద్వివేది వాదనలను వర్ల రామయ్య తరపు న్యాయవాది గంగూలీ తప్పుబట్టారు. హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం కేవలం ఆర్డినెన్స్‌ ద్వారా సవరించిన సెక్షన్‌ 200 వరకే పరిమితం తప్పితే, పాతదానికి సంబంధించినది కాదన్నారు. ఆ అభిప్రాయంతో హరీష్‌సాల్వే కూడా ఏకీభవించారు. గతంలో రమేశ్‌ కుమార్‌ను నియమించినప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని నిమ్మగడ్డ తరఫున న్యాయవాదులు హరీశ్‌సాల్వే, నరసింహ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. సర్కారు ఉద్దేశాలను ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రభుత్వం వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఆర్డినెన్స్‌ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. 

‘ఆర్డినెన్స్‌ జారీ వెనుక ఎలాంటి ఉద్దేశాలు లేవన్న వాదనలను అంగీకరించం. మీ ఉద్దేశాలు పూర్తి స్వచ్ఛంగా ఉన్నాయని  అనుకోవడానికి లేదు. ఇలాంటి ఆర్డినెన్స్‌ ఎలా జారీ చేస్తారు..? మేం అందరి వాదనలు వింటాం... ప్రస్తుతానికి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోం.- ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే

ఇదీ చదవండి:

'పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం'

Last Updated : Jun 11, 2020, 6:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.