EX Minister viveka murder case latest updates: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషిట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలను సీబీఐ తెలిపింది.
''వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారు. వివేకా హత్య కేసు ఆధారాల చెరిపివేతకు గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్ ప్రయత్నించారు. వివేకా హత్య రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్ కుమార్ తన ఇంట్లో నుంచి బయటికెళ్లాడు. వివేకానంద రెడ్డి హత్యకు గురైన స్థలంలోని ఆధారాలను ఉదయ్ చెరిపేశారనేందుకు సాక్ష్యాలు ఉన్నాయి. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డితో కలిసి ఆధారాలను ఉదయ్ చెరిపేశారు. గంగి రెడ్డి, శివశంకర్ రెడ్డితో కలిసి ఆధారాలను ఉదయ్ చెరిపేశారు. విచారణకు ఉదయ్ కుమార్ రెడ్డి సహకరించట్లేదు. పారిపోతాడనే ఉద్దేశంతోనే ఉదయ్‌ను అరెస్టు చేశాం. కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు యత్నించారు. వివేకా హత్య రోజు తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉదయ్ కుమార్ ఉన్నారు. హత్య రోజు తెల్లవారుజామున అవినాష్ ఇంట్లోనే శివశంకర్ రెడ్డి కూడా ఉన్నారు. హత్య తెలియగానే ఆధారాల చెరిపివేతకు అవినాష్ ఇంట్లో ఎదురుచూశారు. అవినాష్‌కు శివప్రకాశ్ రెడ్డి ఫోన్‌చేసి వివేకా చనిపోయినట్లు సమాచారమిచ్చారు. అవినాష్ ఇంట్లో ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు ఉన్నట్లు గుర్తించాం. అవినాష్ ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేక్‌అవుట్ ద్వారా కూడా గుర్తించాం. అవినాష్ రెడ్డి తన ఇంటి నుంచి వివేకా ఇంటికెళ్లినట్లు గూగుల్ టేక్‌అవుట్ ద్వారా గుర్తించాం.'' అని సీబీఐ పలు కీలక విషయాలను వెల్లడించింది.
మరోవైపు వివేకా హత్య కేసుకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు.. ఈ నెల 30లోపు కేసు విచారణ పూర్తి చేయాలని సీబీఐకీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఐ దర్యాప్తులో దూకుడు పెంచింది. శుక్రవారం రోజున వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం సీఆర్‌పీసీ 161 కింద నోటీసులిచ్చి.. ఉదయ్ కుమార్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. ఆ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన మెమోను కుటుంబ సభ్యులతో పాటు పులివెందుల పోలీసులకు అందజేసింది. ఈ క్రమంలో నేడు వివేకా హత్య కేసు విచారణకు ఉదయ్ కుమార్ రెడ్డి సహకరించట్లేదంటూ సీబీఐ పలు సంచలన విషయాలను వెల్లడించింది.
ఇవీ చదవండి