ETV Bharat / bharat

ఉక్రెయిన్​లో భారత పౌరుల పడిగాపులు- 20 వేలమందికిపైగా..!

author img

By

Published : Feb 24, 2022, 6:45 PM IST

Indian students in Ukraine: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధానికి దిగిన క్రమంలో ఆ దేశంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆ దేశ గగనతలాన్ని మూసివేసిన క్రమంలో వేలాది మంది భారత పౌరులు, విద్యార్థులు చిక్కుకున్నారు. దీంతో వారిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషిస్తోంది. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని, మూడో అడ్వైజరీని జారీ చేసింది అక్కడి భారత రాయబార కార్యాలయం. మరోవైపు.. కేంద్రంపై కాంగ్రెస్​ విమర్శలు గుప్పించింది.

Indian students, people in Ukriane
భారత పౌరుల తరలింపుపై ఆందోళన

Indian students in Ukraine: ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య చేపట్టిన నేపథ్యంలో ఆ దేశం గగనతలాన్ని మూసివేసింది. దీంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వేల సంఖ్యలో భారతీయులు ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో వందల సంఖ్యలో భారత పౌరులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఈ ఉదయం దిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా ప్రత్యేక విమానం వెనక్కి వచ్చిన తరుణంలో ఇతర మార్గాల్లో వారిని తీసుకువచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.

వీడియో కాల్​లో సాయం కోరుతున్న భారత విద్యార్థులు

ఉక్రెయిన్‌లో ఉన్న వేల మంది భారతీయులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వీలైనంత త్వరగా తరలించే ప్రయత్నాలను భారత్‌ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రష్యన్‌ భాష తెలిసిన అధికారులను ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయానికి పంపించింది. దీనితోపాటు ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకూ వీరిని పంపించే పనిలో నిమగ్నమైనట్లు భారత విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు జరుపుతుండడం వల్ల ఇతర నగరాల నుంచి అక్కడికి వెళ్లవద్దంటూ భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలు జారీచేసింది.

రాయబార కార్యాలయానికి భారీగా విద్యార్థులు..

ఉక్రెయిన్‌లో పరిస్థితులు దిగజారుతున్న వేళ ఆ దేశంలో ఉన్న భారత విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కీవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి భారీగా తరలివచ్చిన విద్యార్థులు తమకు వసతి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం నుంచి రాయబార కార్యాలయం ముందే గడ్డకట్టే చలిలో నిలబడి ఉన్నామని.. కనీసం తమకు కూర్చునే సదుపాయం కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన అధికారులు.. విద్యార్థులే హోటల్‌లలో వసతి ఏర్పాటు చేసుకోవాలని చెప్పినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి: ఉక్రెయిన్​లో భారత రాయబారి

ఉక్రెయిన్​లోని భారత పౌరులు, విద్యార్థులు పరిస్థితులను ప్రశాంతంగా, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు ఆ దేశంలోని భారత రాయబారి పార్థ సత్పతి. ప్రస్తుతం పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా, అనిశ్చితితో ఉన్నాయన్నారు. దీంతో తీవ్ర గందరగోళం ఏర్పడినట్లు చెప్పారు. ఈ పరిస్థితులకు ఓ పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు విద్యాశాంగ శాఖ, ఎంబసీ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉక్రెయిన్​లో 20వేల మంది భారతీయులు, అందులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు.

భారత పౌరులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు: రాజ్​నాథ్​

ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారత పౌరులు, విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. భారత్​ ఎప్పుడు శాంతిని కోరుకుంటుందని, ఎలాంటి పరిస్థితులు యుద్ధానికి దారితీయకూడదన్నారు.

భారతీయుల తరలింపుపై కాంగ్రెస్​ ప్రశ్నలు..

ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన 20వేల మంది పౌరులు, విద్యార్థులను తీసుకొచ్చేందు సరైన సమయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్​. ఉక్రెయిన్​లోని పౌరులు భయంతో అభద్రతా భావంతో ఉన్నారని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై.. వారి భద్రతను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ముఖం చాటేసిందని, ఇప్పటికీ నిశబ్దంగా ఉండిపోవటం మోదీ ప్రభుత్వం అలవాటని విమర్శించారు.

మూడో అడ్వైజరీ..

ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారతీయులకు మూడో అడ్వైజరీ జారీ చేసింది అక్కడి భారత రాయబార కార్యాలయం. భారత పౌరులు బాంబు షెల్టర్లలో తలదాచుకోవాలని సూచించింది. ముఖ్యంగా సైరన్లు, బాంబు హెచ్చరికలు వినిపిస్తే.. సమీప ప్రాంతాల్లోని బాంబు షెల్టర్లలోకి వెళ్లాలని పేర్కొంది.

ఇదీ చూడండి: రష్యాపై ఈయూ కఠిన ఆంక్షలు.. దౌత్య సంబంధాలకు ఉక్రెయిన్​ స్వస్తి!

'ఇప్పటికే ఆలస్యమైంది.. ఎలాగైనా యుద్ధాన్ని ఆపండి'

ఉక్రెయిన్​లో బాంబుల మోత.. బెలారస్ నుంచి చొరబడ్డ రష్యా సైన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.