ETV Bharat / bharat

'ఈశాన్య రాష్ట్రాలను విభజించే కుట్ర.. మేమే వాటిని అడ్డుకుంటున్నాం'

author img

By

Published : Dec 18, 2022, 4:26 PM IST

ఈశాన్య ప్రాంతంలో ఇప్పటివరకు వచ్చిన అడ్డంకులకు ముగింపు పలికి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అవినీతి, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలను నిర్మూలించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఉద్ఘాటించారు.

pm-attends-nec-golden-jubilee-meet-in-shillong
pm narendra modi

అవినీతి, పక్షపాతం, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలను నిర్మూలించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలను విభజించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆయన.. అటువంటి వాటికి చెక్‌ పెడుతున్నామన్నారు. షిల్లాంగ్‌లోని స్టేట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈశాన్య కౌన్సిల్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ.. ఈ ప్రాంత అభివృద్ధికి ఇప్పటివరకు వచ్చిన అడ్డంకులకు రెడ్‌ కార్డ్‌ (ఫిఫా ఫైనల్‌ను ప్రస్తావిస్తూ) చూపించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.6వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు.

pm-attends-nec-golden-jubilee-meet-in-shillong
ఈశాన్య కౌన్సిల్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో మోదీ

50 సార్లు పర్యటన..
ఒకప్పుడు సైనిక ప్రభావం అత్యధికంగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం శాంతిని నెలకొల్పిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఒకప్పుడు హింస, వేర్పాటువాదంతో అట్టుడుకుపోయే ఈ ప్రాంతం ప్రస్తుతం అభివృద్ధివైపు అడుగులు వేస్తోందన్నారు.

గడిచిన ఎనిమిదేళ్లలో తిరుగుబాటు సంఘటనలు 70శాతం.. భద్రతా సిబ్బందిపైనా దాడులు 60శాతం తగ్గాయన్నారు. దీంతో పౌరులు గాయాలపాలయ్యే సంఘటనలు కూడా 89శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. ఇలా గడిచిన ఎనిమిదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 50సార్లు పర్యటించారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని కేంద్ర మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

ఈశాన్య ప్రాంతాలైన అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, మణిపుర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ఎన్‌ఈసీ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తోంది. అయితే, 2023 ఫిబ్రవరిలో త్రిపుర, మేఘాలయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.