ETV Bharat / bharat

అప్పు తీర్చేందుకు చిన్నారి అమ్మకం.. డబ్బు కోసం స్నేహితుడిని కిడ్నాప్ చేసి..

author img

By

Published : Nov 12, 2022, 5:58 PM IST

అప్పు తీర్చేందుకు తమ నవజాతశిశువును అమ్మేందుకు సిద్ధమయ్యారు దంపతులు. ఈ హృదయవిదారక ఘటన బిహార్​లో వెలుగుచూసింది. మరోవైపు, డబ్బుల కోసం ఓ వ్యక్తిని అతడి స్నేహితులే కిడ్నాప్ చేశారు. అనంతరం బాధితుడిపై దాడి చేసి అడవిలో పడేశారు. ఈ దారుణం మధ్యప్రదేశ్​లో జరిగింది.

parent sells girl child
చిన్నారిని అమ్మేందుకు సిద్ధమైన తల్లిదండ్రులు

బిహార్‌ జముయీలో హృదయవిదారక ఘటన జరిగింది. అప్పు చెల్లించలేదని పదేళ్ల బాలుడిని తీసుకెళ్లిపోయాడు ఓ వ్యక్తి. బందీగా ఉన్న తమ కొడుకును విడిపించేందుకు బాధితుడి తల్లిదండ్రులు.. 20 రోజుల నవజాతశిశువును రూ.30 వేలకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా జనం గుమిగూడడం వల్ల.. అసలు విషయం బయటపడింది. బిడ్డను కొనేందుకు వచ్చిన మహిళ అక్కడి నుంచి పరారయ్యింది.

నవజాతశిశువు తండ్రి పేరు మెంగు మాంఝీ. అతడు హరియాణాలోని ఓ ఇటుక బట్టీలో పనిచేసేవాడు. ఇటుక బట్టీ కాంట్రాక్టర్ నుంచి అతడు రూ.5 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఏడు నెలలు గడిచినా అప్పు తీర్చలేకపోయాడు. అనంతరం కాంట్రాక్టర్ హరియాణా నుంచి వచ్చి రూ.5వేల బదులు రూ.25 వేలు ఇవ్వాలని మాంఝీని డిమాండ్ చేశాడు. మాంఝీ కుమారుడిని కాంట్రాక్టర్ తీసుకెళ్లిపోయాడు. డబ్బులిచ్చేవరకు మాంఝీ కుమారుడిని వదలని బెదిరించాడు. ఏం చేయాలో అర్థంకాక 20 రోజుల నవజాతశిశువును అమ్మేందుకు సిద్ధపడ్డానని మాంఝీ తెలిపాడు.

డబ్బుల కోసం కిడ్నాప్​..
మధ్యప్రదేశ్​ భోపాల్​లో దారుణం జరిగింది. డబ్బుల కోసం స్నేహితులే ఓ యువకుడిని కిడ్నాప్ చేశారు. బాధితుడి తల్లికి ఫోన్ చేసి రూ.కోటి ఇమ్మని డిమాండ్ చేశారు. ఆమె అంతమొత్తంలో డబ్బులు ఇవ్వలేనని చెప్పడం వల్ల యువకుడిపై దాడి చేసి అడవిలో వదిలేసి పరారయ్యారు ముగ్గురు నిందితులు. అప్పటికే రాహుల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రాహుల్​ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బాధితుడు కటారా హిల్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. అతడు ఐసీఐసీఐ బ్యాంక్​లో ఉద్యోగం చేస్తున్నాడని వెల్లడించారు.

ఫేస్​బుక్​ లైవ్​లో..
బిహార్ సాసారమ్​లో ఓ యువకుడు ఫేస్​బుక్ లైవ్​లో వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను లైవ్​లో చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే.. బాధితుడి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయారు. మృతుడిని దిగ్విజయ్ సింగ్(27)గా పోలీసులు గుర్తించారు. తన ఆత్మహత్యకు భార్య, ఆమె అక్క కారణమని లైవ్​ వీడియోలో తెలిపాడు.

'నా పేరు దిగ్విజయ్ సింగ్​. నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా. దీనికి నా తల్లిదండ్రులు, అన్నదమ్ములు బాధ్యులు కాదు. నా ఆత్మహత్యకు నా భార్య, ఆమె అక్కే కారణం. నా ఆస్తి అంతా మా అమ్మ పేరు మీద ఉంది.. నా కూతురు కూడా మా అమ్మ దగ్గరే ఉంటుంది.'
-దిగ్విజయ్ సింగ్, మృతుడు

పెంపుడు కుక్క హత్య..
మహారాష్ట్ర బీడ్ జిల్లాలో మూగజీవి పట్ల ఓ వ్యక్తి అమానూషంగా ప్రవర్తించాడు. పొరుగింటి పెంపుడు కుక్కను మొరిగిందని దానిపై కాల్పులు జరిపాడు. దీంతో శునకం అక్కడికక్కడే చనిపోయింది. ధరావతి తండా ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిందీ ఘటన. నిందితుడు వికాస్ బన్సోడేపై కేసు నమోదైంది.

ఇవీ చదవండి: ప్రారంభించిన రోజే నీటిలో మునిగిపోయిన రేసింగ్ బోటు

లంచం ఇవ్వలేక కారుణ్య మరణానికి సిద్ధమైన దంపతులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.