మహారాష్ట్రలో దారుణం వెలుగుచూసింది. బీమా సొమ్ముకోసం కొందరు వ్యక్తులు వారి స్నేహితుడిని హత్య చేశారు. మృతుడి పేరుపై ఉన్న రూ.4 కోట్లు బీమా సొమ్మును కాజేయడానికే.. దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అర్జున్ రమేశ్ భలేరావ్ అనే 46 ఏళ్ల ఓ వ్యక్తి నాసిక్‌లోని డియోలలీ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే, అతని పేరు మీద రూ.4 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. దీంతో అతని మిత్రులు రమేశ్‌ను చంపి ఆ సొమ్మును కాజేయాలని ప్లాన్ చేశారు. కానీ.. రమేశ్ కొన్నాళ్లుగా నాసిక్‌లో లేనందున వారికి అవకాశం లేకపోయింది. మూడేళ్ల తర్వాత రమేశ్ నాసిక్ రాగా.. అతని నలుగురు స్నేహితులు మరో మహిళ సహాయంతో రమేశ్‌ను హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా.. రమేశ్ ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు చిత్రీకరించారు. బైక్‌పై ప్రయాణిస్తున్న రమేశ్‌ను.. ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రమేశ్ మరణించిన అనంతరం అతని స్నేహితులు ఆ బీమా సొమ్మును కాజేశారు. ఆ బీమా డబ్బులు పంచుకునే విషయంలో ఐదుగురు నిందితుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో వారిలో ఒకరు మృతుడి సోదరుడికి అది ప్రమాదం కాదని.. హత్య అని చెప్పాడు. దీంతో మృతుడి సోదరుడు డిసెంబర్ 12న.. బీమా సొమ్ము కోసమే రమేశ్‌ను హత్య చేసినట్లు పోలీసులకు తెలియజేశాడు.
ఆ బీమా సొమ్ము మొత్తాన్ని మృతుడి భార్య రజినీ ఉకే పేరుతో.. ఓ మహిళ నకిలీ వివరాలను సమర్పించి ఆ డబ్బును కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. పోలీసులు నిందితురాలు ఆ మహిళతోపాటు.. మృతుడి స్నేహితుడు మంగేశ్ సావర్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు మంగేశ్ నుంచి ఒక గన్‌తోపాటు ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
యువకుడి హత్య..
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. అద్దెకు ఉంటున్న ఓ యువకుడిని.. ఇంటి యజమాని అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని నాలుగు ముక్కలు చేసి గంగా నదిలో పడేశాడు. అక్టోబర్ 6న గాజియాబాద్‌లో ఈ హత్య జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అంకిత్ ఖోకర్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం నుంచి మోదీనగర్‌లోని ఉమేశ్ శర్మ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ప్రస్తుతం అంకిత్ లఖ్‌నవూలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేస్తున్నాడు. అయితే కొన్ని నెలల క్రితం అంకిత్ కుటుంబం వారికి సంబంధించిన కొంత భూమిని విక్రయించారు. భూమి అమ్మగా వచ్చిన మొత్తంలో.. రూ.60 లక్షలను తన యజమాని ఉమేశ్‌కు అప్పుగా ఇచ్చాడు అంకిత్. కొన్నేళ్ల క్రితమే అంకిత్ తల్లిదండ్రులు మరణించారు. అంకిత్‌ను హత్య చేసినా సరే అడిగేవారు.. లేరని ఉమేశ్ గుర్తించాడు.
అయితే ఓ పథకం ప్రకారం అక్టోబర్ 6న అంకిత్‌ను చంపి.. నాలుగు ముక్కలుగా చేసి గంగానదిలో పడేశాడు. అప్పటి నుంచి ఎవరికీ అనుమానం రాకుండా అంకిత్ ఫోన్‌ను నిందితుడు ఉమేశ్ ఉపయోగించేవాడు. అంకిత్ మిత్రుల నుంచి వచ్చే మెసేజ్‌లకు మాత్రమే సమాధానం ఇచ్చి.. ఫోన్‌కాల్స్‌కు స్పందించేవాడు కాదు. దానితో పాటు వారికి పంపే మెసేజ్‌లలో తప్పులు ఉండటాన్ని అతని మిత్రులు గుర్తించి.. డిసెంబర్ 12న అంకిత్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అంకిత్ బ్యాంక్ అకౌంట్ నుంచి భారీ మొత్తం ఉమేశ్‌కు బదిలీ అయినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఉమేశ్‌తో అతడికి సహకరించిన మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకూ పోలీసులకు మృతదేహంలోని శరీరం భాగాలు కనిపించలేదు.