ETV Bharat / bharat

క్యాన్సర్​పై 'ఐరన్​మ్యాన్' IPS విజయం.. స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్​లోనూ..

author img

By

Published : Nov 14, 2022, 5:51 PM IST

గొప్ప పట్టుదలతో క్యాన్సర్​ను ఓడించారు ఓ ఐపీఎస్ అధికారి. అనంతరం ఫిట్​నెస్​లో తాను 'ఐరన్​మ్యాన్' అని నిరూపించుకున్నారు. అత్యంత కఠినమైన ట్రయాథ్లాన్ రేసును పూర్తి చేశారు.

goa-ips-officer-nidhin-valsan
goa-ips-officer-nidhin-valsan

ఉక్కు సంకల్పం, ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంలా నిలుస్తున్నారు గోవాకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, క్యాన్సర్ మహమ్మారి కబలించేందుకు ప్రయత్నించినా.. తన పోరాట పటిమతో జీవిత యుద్ధాన్ని గెలిచారు. అత్యంత కఠినమైన పరుగుపందెంగా భావించే 'ఐరన్​మ్యాన్ ట్రయాథ్లాన్ రేసు'ను పూర్తి చేసి అందరి మనసులు దోచుకున్నారు.

గోవాకు చెందిన నిధిన్ వాల్సన్(36) 2012 బ్యాచ్​కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా పనిచేస్తున్నారు. గోవాలో చర్చనీయాంశంగా మారిన ల్యాండ్ కబ్జా కేసును ఈయనే విచారిస్తున్నారు. గతేడాది ఈయనకు నాన్-హాడ్కిన్ లింఫోమా అనే వ్యాధి వచ్చింది. ఇది రక్తనాళాలకు వచ్చే క్యాన్సర్. అయితే, ఈ రోగం వచ్చిందని వాల్సన్ ఎప్పుడూ కుంగిపోలేదు. సరైన వైద్యం తీసుకుంటూ.. క్యాన్సర్​పై పోరాడారు. వ్యాధిపై మానసికంగా యుద్ధం చేశారు. దీంతో భయంకర క్యాన్సర్ తలొగ్గింది. వాల్సన్ పట్టుదల ముందు సాగిలపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయనకు క్యాన్సర్ పూర్తిగా నయమైంది. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని వాల్సన్ చెబుతున్నారు.

goa-ips-officer-nidhin-valsan
రేసు పూర్తి చేసిన నిధిన్ వాల్సన్

ఈ క్రమంలోనే పనాజీలో ఆదివారం నిర్వహించిన ఐరన్​మ్యాన్ రేసులో పాల్గొన్నారు వాల్సన్. స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్ పోటీలు కలిపి ఉండే రేసు ఇది. చాలా ఫిట్​గా ఉంటే తప్ప దీన్ని పూర్తి చేయడం కష్టం. అలాంటిది వాల్సన్.. 8 గంటల 3 నిమిషాల 53 సెకన్లలో రేసును పూర్తి చేశారు. పోటీలో తొలి స్థానంలో నిలవకపోయినా.. రేసును విజయవంతంగా పూర్తి చేసి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. "క్యాన్సర్ అనేది జయించలేని వ్యాధి కాదు. ఈ రేసు పూర్తి చేయడం ద్వారా ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పవచ్చని భావించా. క్యాన్సర్​ వచ్చిందని తెలియగానే.. దానిపై పోరాడా. ఎప్పుడూ నిరాశపడలేదు" అని వాల్సన్ చెప్పుకొచ్చారు.

goa-ips-officer-nidhin-valsan
ఐపీఎస్ అధికారి నిధిన్ వాల్సన్

ఈ ఐరన్​మ్యాన్ ట్రయాథ్లాన్ రేసులో 1,450 మంది పాల్గొన్నారు. రేసులో భాగంగా 1.9 కిలోమీటర్ల మేర సముద్రంలో ఈత కొట్టాలి. 90 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలి. 21 కిలోమీటర్లు పరుగెత్తాలి. ఐఐటీ బాంబే అలుమ్నీ నిహాల్ బైగ్ ఈ రేసులో విజయం సాధించారు. డిఫెండింగ్ ఛాంపియన్, భారత ఆర్మీలో పనిచేస్తున్న బిస్వోర్జిత్ సైఖోమ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.