ETV Bharat / bharat

పంద్రాగస్టుకు మోదీ కీలక ప్రకటన- వ్యాక్సిన్​పైనేనా?

author img

By

Published : Aug 14, 2020, 5:59 PM IST

ఆగస్ట్‌ 15న దిల్లీలోని ఎర్రకోట నుంచి వరుసగా ఏడోసారి తాను చేసే ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేయబోతున్నారా? ఆ ప్రకటన దేని గురించి? కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్​పై శుభవార్త ప్రకటిస్తారా? లేక ఆత్మనిర్భర్​ భారత్​లో భాగంగా మరిన్ని సంచలన నిర్ణయాల్ని వెల్లడిస్తారా? మోదీ అసలేం చెబుతారు?

PM to address nation from Red Fort
ఆగస్ట్ 15న మోదీ కీలక ప్రకటన.. వ్యాక్సిన్​పైనే!

ఓ వైపు కరోనా మహమ్మారి భారత్​ సహా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. మరోవైపు సరిహద్దు వద్ద చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. ప్రస్తుతం ఈ రెండు సమస్యలపై సుదీర్ఘ యుద్ధం చేస్తోన్న దేశానికి ఓ శుభవార్త వినిపించనుందా? భారత్​కు ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యం లభించిన రోజే.. కరోనా భూతం నుంచి 'వ్యాక్సిన్'​ వార్తతో స్వతంత్రం రానుందా? 74వ స్వాతంత్ర్య వేడుకల్లో ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేయబోతున్న కీలక ప్రకటన ఏంటి?

కొవిడ్​ వ్యాక్సిన్...

కరోనా వ్యాక్సిన్​ కోసం ప్రజలు వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌కు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్‌' టీకాను ఆగస్ట్‌ 15 నాటికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) తెలిపింది. కానీ వ్యాక్సిన్​ లాంచ్​పై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. ఈ విషయంపై ఆగస్ట్​ 15న తన ప్రసంగంలో మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే కరోనాకు తొలి టీకా రిజిస్టర్​ చేసి రష్యా దూకుడు ప్రదర్శించింది. అయితే పుతిన్​ సర్కారు ఇలా చేయడంపై ప్రశంసలకు బదులు, విమర్శలు ఎదురయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకుండానే టీకాను విడుదల చేయడమే ఇందుకు కారణం. ప్రస్తుతం భారత్​లోనూ వ్యాక్సిన్​పై పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తికాకుండానే టీకాపై పూర్తిస్థాయి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపించడంలేదు.

కరోనాపై పోరు...

కరోనా మహమ్మారిపై భారత్​ చేస్తోన్న యుద్ధాన్ని మోదీ ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. అలానే రానున్న రోజుల్లో కరోనాపై పోరులో తీసుకోబోయే చర్యలను ప్రకటించే అవకాశం ఉంది.

ఆత్మనిర్భర్​ భారత్​...

మంచుకొండల్లో నెత్తుటేర్లు పారిస్తూ.. నాలుగున్నర దశాబ్దాల 'ప్రశాంతత'ను భగ్నం చేస్తూ తూర్పు లద్దాఖ్‌లో చైనా చేసిన ఘోరానికి ప్రతీకార జ్వాలతో దేశం రగిలిపోతోంది.

రాత్రి అనూహ్యంగా దొంగదెబ్బ తీసి 20 మంది భారత సైనికుల్ని పొట్టనబెట్టుకున్న చైనాకు భారత పంజా దెబ్బ రుచి చూపించాలని ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ 'ఆత్మనిర్భర్​ భారత్'ను తీసుకువచ్చారు. చైనాతో ఇటు సైనిక, దౌత్య చర్చలు జరుపుతూనే ఆ దేశానికి చెందిన 59 యాప్​లపై నిషేధం వేటు వేసింది భారత్.

రక్షణ రంగంలోనూ కీలక సంస్కరణలకు తెరలేపింది. ఆయుధ సంపత్తి సహా రక్షణ శాఖ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసుకునేలా 2020-2024 మధ్య 101 పరికరాల దిగుమతులపై నిషేధం విధించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల ప్రకటించారు.

ఆగస్ట్​ 15న మోదీ తన ప్రసంగంలో రక్షణ రంగానికి సంబంధించి మరిన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆర్థిక ప్రకటన...

కరోనా దెబ్బకు చతికిలబడిన ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం ఇచ్చేందుకు ప్రధాని కీలక ప్రకటన చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రణాళిక మాటేంటి?

'ఆత్మనిర్భర్​ భారత్'​ లక్ష్య సాధనకు సంబంధించిన ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా ఆవిష్కరిస్తారని ఇప్పటికే వెల్లడించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్.

ఈ మేరకు ఆత్మనిర్భర్​ భారత్​ సహా ఆరోగ్య భారత్​ లక్ష్యంగా మోదీ కీలక ప్రకటన ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎర్రకోట వద్ద శనివారం జరగబోయే స్వాతంత్ర్య వేడుకలకు దౌత్యవేత్తలు, అధికారులు, మీడియా వ్యక్తులు సహా మొత్తం 4 వేల మంది హాజరుకానున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో​ నియమ నిబంధనలను పాటించనున్నారు.

ఇదీ చూడండి: కరోనా కాలంలో సరికొత్తగా పంద్రాగస్టు వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.