కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నగరాల్లో ఉన్నవారికి కాస్తోకూస్తో అవసరమైన సరకులు లభిస్తున్నాయి. అయితే ఎక్కడో అడవి ప్రాంతంలో ప్రపంచానికి దూరంగా జీవించే గిరిజనులు నిత్యావసరాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కేరళ పతనంతిట్ట జిల్లా కలెక్టర్, కొన్నీ నియోజకవర్గ ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు.
కైతాంగు పథకంలో భాగంగా..
పతనంతిట్ట జిల్లాలోని అవినిప్పర తండాలో 37 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వారికి కైతాంగు(చేయూత) పథకం ద్వారా సాయం చేయాలనుకున్నారు పతనంతిట్ట జిల్లా కలెక్టర్ పీబీ నూహ్, కొన్నీ నియోజకవర్గ ఎమ్మెల్యే కేయూ జనేశ్కుమార్.
కానీ, పెరియర్ జీవారణ్యంలో 12 కిలోమీటర్ల లోపలున్న అవినిప్పరకు వెళ్లేందుకు మీనాచిల్ నదిని దాటడం తప్ప వేరే మార్గం లేదు. అయినా సరే, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. సామాజిక దూరం పాటించేందుకు వీలుగా అతి తక్కువ మందితో కూడిన బృందంతో కలిసి నడక ప్రారంభించారు. అడవి గుండా 3 కిలోమీటర్ల వరకు, భుజాలపై సరకులు మోసుకెళ్లి గిరిపుత్రులను ఆదుకున్నారు.
ఇదీ చదవండి:ఒక్కొక్కరికి రెండు మాస్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం