ETV Bharat / bharat

భగత్​సింగ్​ను తప్పించాలని.. బాంబు తయారుచేస్తూ 26 ఏళ్లకే..

author img

By

Published : Jul 29, 2022, 6:49 AM IST

'నేను ఎవరికీ కనిపించని ప్రదేశంలో మరణించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నా మరణంపై ఎవరూ కన్నీరు కార్చకూడదు. ఎక్కడా చర్చ జరగకూడదు' అని గొప్పగా ప్రకటించిన ఆ మహావీరుడు బతికింది తక్కువ కాలమే అయినా స్వాతంత్య్రోద్యమ సమయంలో యువతపై చెరగని ముద్రవేశారు. భగత్‌సింగ్‌ను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి బాంబును తయారు చేస్తూ అమరుడయ్యారు. ఆయనే భగవతి చరణ్‌ వోహ్రా.

bhagwati charan vohra biography
భగవతి చరణ్‌ వోహ్రా

ప్రస్తుత పాకిస్థాన్‌లోని లాహోర్‌లో 1903 నవంబరు 15న ఉన్నత కుటుంబంలో భగవతి చరణ్‌ వోహ్రా జన్మించారు. తండ్రి రాయ్‌బహద్దూర్‌ శివచరణ్‌ రైల్వే అధికారి. వోహ్రాకు దుర్గాదేవీతో చిన్న వయసులోనే వివాహమైంది. ఆమె కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేసి, దుర్గాబాయిగా వినుతికెక్కారు. వోహ్రా స్థానిక ఎఫ్‌.సి. కళాశాలలో 1921లో ఇంటర్‌ పాసయ్యారు. బీఏ చదివేందుకు లాలాలజ్‌పత్‌ రాయ్‌ స్థాపించిన నేషనల్‌ కళాశాలలో చేరారు.

నిప్పు రవ్వలతో దోస్తానా..
డిగ్రీ చదువుతున్నప్పుడే భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, యశ్‌పాల్‌లతో స్నేహం కుదిరింది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ విరమించడం వీరెవ్వరికీ నచ్చలేదు. దేశంలోని పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, వ్యవసాయ రంగ సమస్యలపై తరచూ ఆందోళన చెందేవారు. అదే సమయంలో రష్యాలో బోల్ష్‌విక్‌ విప్లవం(1917) సంభవించిన తీరుపై వోహ్రా ముగ్ధుడయ్యారు. మన దేశానికీ సోషలిజంతోనే మేలు జరుగుతుందని నమ్మి, భారత కమ్యూనిస్టు పార్టీతో అనుబంధం పెంచుకున్నారు. ఎం.ఎన్‌.రాయ్‌ రచనలను, మార్క్సిస్టు సాహిత్యాన్ని భారత్‌కు రహస్యంగా తెప్పించి యువతకు చేరవేసేవారు. అయితే కమ్యూనిస్టులు తాను ఊహించినంత దూకుడుగా లేరనే అసంతృప్తితో హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌(హెచ్‌ఆర్‌ఏ)కు దగ్గరయ్యారు.

నవ్‌జవాన్‌ భారత్‌ సభ..
ప్రభావవంతంగా రాయడం, గొప్పగా ప్రసంగించడం, విస్తృతంగా అధ్యయనం చేయడం వోహ్రాకున్న ప్రత్యేకత. దాంతో వివిధ విప్లవ సంస్థలకు భావజాలాన్ని నిర్దేశించారు. భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌లతో కలిసి 1926లో నవ్‌జవాన్‌ భారత్‌ సభ(ఎన్‌బీఎస్‌) అనే విప్లవ సంస్థను స్థాపించారు. దీనికి ప్రచార కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. నేతల మత రాజకీయాలను వోహ్రా నిర్ద్వంద్వంగా విమర్శించేవారు. మత రాజకీయాలను చేస్తున్నారనే కోపంతో 1926లో జరిగిన ఎన్నికల్లో లాలా లజ్‌పత్‌ రాయ్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎన్‌బీఎస్‌, హెచ్‌ఆర్‌ఏలలో సభ్యులుగా చేరేవారు తాము మతాలకు అనుకూలం కాదని, ఇతరుల మతాలను విమర్శించబోమని ప్రతిజ్ఞ చేయాలనే నిబంధన విధించారు. 1927లో జరిగిన ఆంగ్లేయ పోలీసు అధికారి శాండర్స్‌ హత్యకు భగత్‌సింగ్‌, బతుకేశ్వర్‌దత్‌తో కలిసి వోహ్రా ప్రణాళిక రచించారు.

విప్లవపంథాపై అపార నమ్మకం..
దిల్లీలో 1928 సెప్టెంబరులో యువ విప్లవకారులంతా రహస్యంగా సమావేశమై హెర్‌ఆర్‌ఏను పునర్‌వ్యవస్థీకరించి.. హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌(హెర్‌ఎస్‌ఆర్‌ఏ)గా మార్చారు. 'కరపత్రాల ద్వారా ప్రచారం' అనే అంశంపై వోహ్రా ప్రసంగించారు. యువతను ఆకర్షించడానికి విప్లవకారులు ఆంగ్లేయ ప్రభుత్వంపై విస్తృతంగా భౌతికదాడులకు పాల్పడాలని సూచిస్తూ హెచ్‌ఎస్‌ఆర్‌ఏకి మేనిఫెస్టోను రాశారు. దిల్లీ అసెంబ్లీలో బాంబులు విసిరి, స్వచ్ఛందంగా అరెస్టయిన భగత్‌సింగ్‌, భటుకేశ్వర్‌లతోపాటు వోహ్రాపైనా కేసు నమోదైంది. అయితే అప్పటికే ఆయన కోల్‌కతాకు పారిపోయారు.

ఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌తో సంచలనం..
భగత్‌సింగ్‌, బతుకేశ్వర్‌దత్‌లను జైలు నుంచి బయటకు తేవడానికి వోహ్రా తీవ్రంగా ప్రయత్నించారు. ఇందుకు నిధుల సమీకరణకు చంద్రశేఖర్‌ ఆజాద్‌తో కలిసి పంజాబ్‌లోని అహ్మద్‌గఢ్‌లో దోపిడీకి పాల్పడ్డారు. అనంతరం అప్పటి వైస్రాయ్‌ ఇర్విన్‌ ప్రయాణిస్తున్న రైలుపైనా 1929 డిసెంబరు 23న సొంతంగా తయారు చేసిన బాంబును విసరగా.. అది గురితప్పింది. వీరి చర్యను ఖండిస్తూ గాంధీజీ 'ది కల్ట్‌ ఆఫ్‌ బాంబ్‌ (బాంబులతో ఆరాధన)' పేరిట వ్యాసం రాశారు. దీన్ని నిరసిస్తూ 'ది ఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ (బాంబుల వెనుక తాత్వికత)' అని వోహ్రా రాశారు. అందులో ఆంగ్లేయులను వెళ్లగొట్టడానికి విప్లవం రావాల్సిన అవసరాన్ని, అందుకు హింసను ఆయుధంగా చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇది దేశంలో సంచలనం సృష్టించింది.

అనంతరం జైలు గోడలు బద్దలు కొట్టి భగత్‌, బతుకేశ్వర్‌లను బయటకు తీసుకురావాలని వోహ్రా నిర్ణయించుకున్నారు. ఈమేరకు లాహోర్‌లోని రావి నది ఒడ్డున బాంబును పరీక్షిస్తుండగా దురదృష్టవశాత్తు అది చేతిలో పేలడంతో 1930 మే 28న దుర్మరణం పాలయ్యారు. అప్పుడాయన వయసు 26 ఏళ్లు మాత్రమే.

ఇవీ చదవండి: చెలరేగిన అల్లర్లు.. గాంధీయే ఆయుధాలు పట్టమన్న వేళ..

విదేశీ బట్టలు వద్దన్నందుకు లారీతో తొక్కించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.