'కదిలే టేబుళ్లు' - తిరుమల భక్తులకు క్యూలైన్లలో అన్నప్రసాదాల వితరణకు సరికొత్త విధానం
తిరుమల క్యూలైన్లలో భక్తులకు కదిలే టేబుళ్ల ద్వారా అన్నప్రసాద వితరణ - అన్నప్రసాదాల పంపిణీలో టీటీడీ అధికారుల సరికొత్త ప్రయోగం - రూ.10 లక్షల వ్యయంతో 7 మీటర్ల పొడవుతో వినూత్న యంత్రం రూపకల్పన

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 7, 2026 at 9:11 AM IST
TTD Annaprasadam Moving Table : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు కొత్త వసతులు కల్పిస్తున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాల పంపిణీని మరింత వేగవంతం చేసేందుకు టీటీడీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. విమానాశ్రయాల్లో లగేజీ వచ్చే కన్వేయర్ బెల్ట్ తరహాలో భక్తులకు ప్రసాదాలు అందించేందుకు 'మూవింగ్ టేబుల్స్' (కదిలే టేబుళ్లు) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. పండగలు, వారాంతాలు, సెలవు దినాల్లో ఈ రద్దీ లక్షకు చేరుకుంటుంది. ఆ సమయంలో క్యూకాంప్లెక్స్‌లు, క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. వారికి శ్రీవారి సేవకులు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను చేరవేస్తుంటారు. అయితే, రద్దీ సమయాల్లో క్యూలైన్లలో వేగంగా నడిచే భక్తులకు ప్రసాదాలు అందించడం సేవకులకు కష్టంగా మారుతోంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఓ సరికొత్త ఆలోచన చేశారు. ఇంజినీరింగ్, క్యాటరింగ్ విభాగాల అధికారులతో ప్రత్యేకంగా చర్చించి ఈ 'కదిలే టేబుల్' కు రూపకల్పన చేశారు.
రూ. 10 లక్షల వ్యయం: భక్తులకు సులభంగా, వేగంగా ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఈ మూవింగ్ టేబుల్‌ను ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దాదాపు రూ.10 లక్షల ఖర్చుతో ఈ యంత్రాన్ని రూపొందించారు. దీని పొడవు 7 మీటర్లు ఉంటుంది. అచ్చం కన్వేయర్ బెల్ట్ మాదిరిగా ఇది నిరంతరాయంగా గుండ్రంగా కదులుతూనే ఉంటుంది. ఈ విధానం వల్ల అటు భక్తులకు, ఇటు అన్నప్రసాదాలు పంపిణీ చేసే సేవకులకు ఎంతో సమయం ఆదా కానుంది. పంపిణీలో ఎలాంటి తోపులాటలకు ఆస్కారం ఉండదు.
ఈ కదిలే టేబుల్ పనిచేసే విధానం చాలా సులభంగా ఉంటుంది. క్యూలైన్లలో నడిచే మార్గం పక్కనే ఈ టేబుల్‌ను అమర్చుతారు. ఈ టేబుల్‌పై శ్రీవారి సేవకులు ముందే సిద్ధం చేసిన అన్నప్రసాదాల ప్లేట్లను ఉంచుతారు. అవి నెమ్మదిగా క్యూలైన్‌లో ఉన్న భక్తుల వైపు కదులుతూ వస్తాయి. దీంతో క్యూలైన్‌లో భక్తులు ఆగకుండా, తమ దారిన తాము నడుస్తూనే సులభంగా తమకు కావాల్సిన ప్రసాదాల ప్లేట్లను తీసుకోవచ్చు. టేబుల్‌పై భక్తులు ప్లేట్లు తీసుకున్న వెంటనే ఖాళీ అయిన చోట శ్రీవారి సేవకులు ఎప్పటికప్పుడు కొత్త ప్లేట్లను పెడుతూ ఉంటారు.
రింగ్‌రోడ్డు వద్ద ప్రయోగం సక్సెస్: ఈ కదిలే టేబుళ్ల విధానాన్ని టీటీడీ అధికారులు గత నెలలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. తిరుమలలోని రింగ్‌రోడ్డు వద్ద ఉన్న క్యూలైన్లలో ఈ మూవింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం నూరు శాతం విజయవంతం అయినట్లు అధికారులు గుర్తించారు. భక్తులు చాలా సంతోషంగా, సులభంగా ఈ టేబుల్ పైనుంచి అన్నప్రసాదాలను తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ విధానంతో పంపిణీ మరింత శుభ్రంగా, వేగంగా జరిగిందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
మరిన్ని క్యూలైన్లలోకి విస్తరణ: రింగ్ రోడ్డు వద్ద ప్రయోగం సక్సెస్ కావడంతో టీటీడీ తదుపరి చర్యలకు ఉపక్రమించింది. భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే కీలక ప్రాంతాల్లో ఈ కదిలే టేబుళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, క్యూకాంప్లెక్స్-2 తో పాటు నారాయణగిరి షెడ్లు, ఇతర క్యూలైన్ మార్గాల్లో ఇలాంటివి సుమారు పది టేబుళ్లను ఏర్పాటు చేసేందుకు ఇంజినీరింగ్ విభాగం వేగంగా కసరత్తు చేస్తోంది.
ఇంతకుముందు తయారు చేసిన టేబుల్ పొడవు 7 మీటర్లు ఉండగా, రద్దీకి అనుగుణంగా దాని సైజును మరింత పెంచాలని అధికారులు నిర్ణయించారు. కొత్తగా రాబోయే టేబుళ్ల పొడవును 12 నుంచి 15 మీటర్లకు పెంచేలా ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఇవి పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.
తిరుమల భక్తులకు అలర్ట్ - నకిలీ వెబ్‌సైట్లు, సైబర్ నేరాలపై టీటీడీ కీలక ప్రకటన
టీటీడీ ఎకౌంటింగ్ వ్యవస్థలో సంస్కరణలు - 3 దశాబ్దాల మాన్యువల్ విధానానికి స్వస్తి

