స్థానిక ఎన్నికల్లోనూ 100 శాతం స్ట్రైక్‌రేట్ సాధించాలి: పవన్ కల్యాణ్
పిఠాపురంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ముఖ్యనేతలతో పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వంద శాతం స్ట్రైక్‌రేట్ సాధించాలని జనసేన నేతలకు ఆయన సూచించారు.

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 22, 2026 at 7:26 AM IST
Pawan Kalyan Pithapuram Tour : సాధారణ ఎన్నికల్లానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 100 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించేలా పార్టీ నాయకులంతా కలిసి పనిచేయాలని ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. చేరికలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలపై చర్చించారు.
కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 32 మందితో కార్యనిర్వాహక దళ్ పేరిట కమిటీని నియమించినట్లు నేతలకు చెప్పి వారిని పరిచయం చేశారు. ప్రతి నియోజకవర్గానికీ ఈ కమిటీ వెళ్లి అక్కడ పార్టీ బలబలాలు, కొత్తవారు పార్టీలో చేరడానికి అడ్డంకులు ఏమైనా ఉన్నాయా తదితర అంశాలను పరిశీలిస్తారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలతోనూ మాట్లాడి సమస్యలేమైనా ఉంటే పరిష్కరించుకోవాలన్నారు. 21 రోజుల తర్వాత ఈ కమిటీతో మళ్లీ మాట్లాడతానన్నారు.
పాత, కొత్త ఇద్దరికీ అవకాశాలు: వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేయడానికి పాతవారితో పాటు కొత్త నాయకులకూ అవకాశాలు ఉంటాయన్నారు. దీని కోసం పర్సంటేజీ విధానం అమలు చేద్దామని సూచించారు. కొత్త, పాత వారి మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ నేతల మీదే ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఘనమైన సీట్లలోనే పోటీ చేద్దామని సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉండేలా చూడాలని జిల్లా నేతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు.
పీఠికాపురం నగర వనాన్ని ప్రారంభం: కాకినాడ జిల్లా పిఠాపురంలో రూ.1.83 కోట్లతో అటవీశాఖ అభివృద్ధి చేసిన పీఠికాపురం నగర వనాన్ని డిప్యూటీ పవన్ కల్యాణ్ సోమవారం ప్రారంభించారు. తన నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సుమారు రూ.1500 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
గతంలో డంపింగ్ యార్డుగా ఉన్న 5.60 ఎకరాల ప్రాంతాన్ని పిఠాపురం పట్టణ ప్రజలకు ఉపయోగపడే ఆకర్షణీయమైన హరిత ప్రదేశంగా పీఠికాపురం వనాన్ని తీర్చిదిద్దడం పచ్చదనం సాధనలో మరో ముందడుగుగా పవన్ పేర్కొన్నారు. మొక్కనాటి, శిలాఫలకాన్ని ఆవిష్కరించి నగర వనాన్ని ప్రారంభించారు. ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఎంపీ తంగెళ్ల ఉదయశ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు చినరాజప్ప, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణ, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మలరామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పాడా పీడీ శివరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫక్రుద్దీన్‌పాలెంలో మైసమ్మ చెరువును ఆనుకుని అభివృద్ధి చేసిన పార్కును చిన్నారులతో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.6 కోట్లతో అభివృద్ధి చేసిన మరో 11 చెరువులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఇక్కడే ఆవిష్కరించారు.
మరోవైపు భుజం నొప్పికి చికిత్స కోసం కేరళం వెళ్లి వచ్చిన తర్వాత తొలిసారి కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్ పిఠాపురం మండలం ఫక్రుద్దీన్‌పాలెంలోని ఇళ్లకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకున్నారు. మైసమ్మతల్లి గుడిలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. బారికేడ్ల నుంచి దూరంగా చూస్తున్న ప్రజల వద్దకు వెళ్లి వారిని పలకరించి వినతులు స్వీకరించారు. తణుకు నుంచి మనవడితో వచ్చిన ఓ వృద్ధురాలు పవన్‌ను కలిసి తన ఇల్లు, జీవనాధారమైన బడ్డీని ఆక్రమించుకున్నారని తెలుపగా సమస్యను పరిష్కరించే బాధ్యతను పాడా పీడీకి అప్పగించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలోకి వెళ్లి అక్కడ కార్మికులను పలకరించారు.
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటన - ప్రారంభోత్సవాలతో బిజీబిజీ
కొండలు, గుట్టలు దాటిన జనసేన వీర మహిళ - గిరిజనులకు పవన్ కల్యాణ్ మార్క్ సాయం!

