ETV Bharat / state

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో పేలిన ఏసీ - ఇద్దరు పసికందులు మృతి

రిమ్స్‌ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో ఏసీ పేలిపోయింది. దీంతో వార్డంతా పొగలు కమ్ముకుని ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులు భయాందోళనలకు గురై తమ పిల్లలను తీసుకొని బయటకు పరుగెత్తారు.

ADILABAD RIMS HOSPITAL
ఏసీ పేలడంతో దట్టమైన పొగ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 22, 2026 at 8:30 AM IST

2 Min Read
Choose ETV Bharat

AC Exploded RIMS Hospital : ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిల్లల వార్డులోని స్పెషల్‌ న్యూయోనేటల్‌ కేర్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ)లోని ఓ ఏసీ పేలిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోగా ఒక్కసారిగా పొగ దట్టంగా అలుముకుంది. ఇంక్యూబేటర్లలో చికిత్స పొందుతున్న 27 మంది పసికందులకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు పసికందులు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. మిగిలిన 23 మంది పసిపిల్లలను యుద్ధ ప్రాతిపదికన ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించటంతో ప్రాణాపాయం తప్పింది. అప్పటికే ఆసుపత్రిలో భయానక వాతావరణం నెలకొంది.

ఏసీ పేలి కలకలం

రిమ్స్‌ పిల్లల వార్డులో 27 మంది పసికందులు చికిత్స పొందుతున్న స్పెషల్‌ న్యూయోనేటల్‌ కేర్‌ యూనిట్​లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా ఏసీ పేలిపోవటం కలకలం సృష్టించింది. ఈ ఘటనతో ఉలిక్కిపడిన సిబ్బంది హాహాకారాలతో భయానక వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుంతో తెలియని గందరగోళానికి దారి తీసింది. ఆ సమయంలో రౌండ్స్‌కు వచ్చిన డైరెక్టర్‌ జైసింగ్‌ విషయం తెలుసుకొని సిబ్బంది సహా అంబులెన్స్‌ డ్రైవర్లతో కలిసి ఎన్‌ఎన్‌సీయూ వెళ్లగా ఊపిరి ఆడనీయకుండా దట్టమైన పొగ అలుముకుంది.

పసికందులను అంబులెన్స్‌లో

వెంటనే అద్దాలను పగులగొట్టి పసికందులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఇచ్చోడకు చెందిన 5 రోజుల చిన్నారి (తండ్రి సలీం) మృత్యువాత పడింది. విషమంగా ఉన్న మరో ముగ్గురు సహా 26 మంది పసికందులను అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించగా, విషమంగా ఉన్న ముగ్గురిలో ఓ చిన్నారి మృతి చెందింది. మిగిలిన 25 మందికి ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది తీసుకున్న జాగ్రత్తలతో ప్రమాదం పిల్లల వార్డుకే పరిమితమైంది.

ఈ ఘటన గురించి తెలుసుకున్న కలెక్టర్‌ రాజార్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్‌ హుటాహుటిన రిమ్స్‌ ఆసుపత్రికి చేరుకున్నారు. దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇద్దరు పసికందులు మరణించినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ఇంక్యూబేటర్లలో ఉన్న పిల్లలను రక్షించటంలో కొంత మంది స్థానికులు చూపిన చొరవతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి మొత్తం అధికారులు, నాయకులు రిమ్స్‌లోనే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రోగులెవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.