కువైట్‌లో చిక్కుకున్న ఏపీ మహిళ - రక్షించాలంటూ ఆడియో విడుదల
కువైట్ చిక్కుకున్న ఏలూరు జిల్లాకు చెందిన మహిళ - పాస్‌పోర్టు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న అక్కడి యజమానులు - అక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆడియో రికార్డింగ్ చేసి విడుదల

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 8:27 PM IST
AP Woman Stucked in Kuwait : తన కుటుంబం, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఎన్నో కళలు కనింది ఆ మహిళ. వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆశపడి అందరిని వదిలి కువైట్‌కు వెళ్లింది. అక్కడికి వెళితే కడుపు నిండా తిండి లేదు, కంటినిండా కునుకు లేదు. నా అనే వారు లేకపోవడంతో నిత్యం నరకం చూపించారు ఆమె యజమానులు. ఏడాదిన్నర క్రితం ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నించినా ఇంటి యజమానులు నిరాకరించారు.
పాస్‌పోర్టు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. చివరికి ఆమెపై దొంగతనం నేరం మోపి జైలుకు పంపించారు. కోర్టు నిర్దోషిగా విడుదల చేసినా సొంతూరుకు రాలేక అష్టకష్టాలు పడుతోంది. ప్రస్తుతం ఆ దేశపు అంబాసిలో తలదాచుకుంది. కన్న బిడ్డలను, పుట్టిన ఊరిని గుర్తుకు తెచ్చుకొని కుమిలిపోతోంది. చివరి ప్రయత్నంగా దేవుడిపై భారం వేసి తన బాధను ఆడియో రికార్డింగ్ చేసి కుటుంబ సభ్యులకు పంపించింది. ఇంతకి ఆ మహిళ ఎవరు? ఆమెకు ఎందుకు పాస్‌పోర్టు ఇవ్వడం లేదో ఈ కథనంలో తెలుసుకుందాం.
దొంగతనం నేరం మోపి జైలుకు : ఏలూరు జిల్లా కలిదిండి ఇందిరా కాలనీకి చెందిన బండి ప్రశాంతి రెండేళ్ల కిందట పని కోసం కువైట్‌కు వెళ్లింది. సుమారు ఏడాదిన్నర క్రితం ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నించగా అక్కడి ఇంటి యజమానులు నిరాకరించారు. పాస్‌పోర్టు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. ఆమె మాత్రం స్వదేశానికి వెళ్లాల్సిందే అని పట్టు పట్టటంతో చివరికి ఆమెపై దొంగతనం నేరం మోపి జైలుకు పంపించారు. అక్కడి కోర్టు పూర్తిస్థాయి విచారణ చేసి ఆమెను నిర్దోషిగా విడుదల చేశారు.
అంబాసిలో తలదాచుకున్న మహిళ : అయితే పాస్‌పోర్టు లేకపోవడంతో కువైట్లో ఉన్న ప్రశాంతి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఆ దేశపు అంబాసిలో తలదాచుకుంది. పాస్‌పోర్టు లేకపోవడంతో స్వదేశానికి పంపేందుకు అక్కడ అధికారులు సహకరించడం లేదు. దీనిపై అక్కడ ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆడియో రికార్డింగ్ చేసి కుటుంబ సభ్యులకు పంపించింది. ఈ క్రమంలో ఆమె భర్త వెంకన్న సామాజిక మాధ్యమాల వేదికగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ స్పందించి ఆమె భార్యను ఇంటికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. ఇద్దరు చిన్నపిల్లలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తన భార్యను స్వదేశానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు.
"బతుకుతెరువు కోసం నా భార్య బండి ప్రశాంతి రెండేళ్ల కిందట కువైట్‌కు వెళ్లింది. మా ఇంట్లో కుటుంబసభ్యులు చనిపోయినా అక్కడి యజమానులు మాత్రం ఆమెను ఇంటికి పంపించలేదు. అగ్రిమెంట్ ఉందని అది పూర్తయ్యే వరకు ఎక్కడికీ వెళ్లనియం అని కఠినంగా చెబుతున్నారు. నా భార్య స్వదేశానికి రావాల్సిందే అని పట్టు పట్టటంతో చివరికి ఆమెపై దొంగతనం నేరం మోపి జైలుకు పంపించారు. అక్కడి కోర్టు విచారణ చేసిన నా భార్యను నిర్దోషిగా విడుదల చేశారు. కానీ అక్కడి యజమానులు పాస్‌పోర్టు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆ దేశపు అంబసిలో నా భార్య తలదాచుకుంది. ప్రభుత్వం స్పందించి నా భార్యను ఇంటికి తీసుకు రావాల్సిందిగా వేడుకుంటున్నా." - వెంకన్న, ప్రశాంతి భర్త
మంత్రి నారా లోకేశ్ సాయం - గల్ఫ్‌లో చిక్కుకున్న మహిళ క్షేమంగా ఇంటికి
యాసిడ్ దాడి చేసి పిచ్చాసుపత్రిలో చేర్పించి - కువైట్‌లో తెలుగు మహిళపై దాష్టీకం

