Acid Attack on Telugu Woman in Kuwait: కుటుంబ పోషణ కోసం, వయస్సులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆశపడి అందరిని వదిలి పరాయి దేశానికి వెళ్లింది ఓ మహిళ. పొట్టకూటి కోసం అక్కడికి వెళితే తీరా చెప్పిన దాని కంటే తక్కువ డబ్బులు ఇచ్చారు. దీనిపై ప్రశ్నించినందుకు యజమానులు ఆ మహిళపై విచాక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పిచ్చాసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
యజమానులను ప్రశ్నించినందుకు: పొట్టకూటి కోసం కువైట్ వెళ్లిన ఓ తెలుగు మహిళపై అక్కడి యజమానులు దాడి చేసి పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సిబ్బంది ఫోన్ ద్వారా బాధితురాలి కుటుంబసభ్యులకు తెలపడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా ఈ.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ కోసం 2 నెలల క్రితం కడప జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లారు. ఉద్యోగంలో చేరే ముందు నెలకు 150 దినార్లు వేతనంగా ఇస్తామని చెప్పారు. అయితే తీరా అక్కడకి వెళ్లిన తర్వాత 100 దినార్లే ఇవ్వడంతో ఆమె యజమానులను ప్రశ్నించారు.
యాసిడ్ దాడి చేసి, పిచ్చాసుపత్రిలో చేర్చి: దీంతో ఆగ్రహావేశాలకు గురైన యజమానులు ఆమెపై యాసిడ్ దాడి చేసి, పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఈ దారుణం జరిగి 10 రోజులు అయినట్లు తెలిసింది. ప్రస్తుతం కొద్దిగా కోలుకున్న బాధితురాలు, ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి చెప్పారు. వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో యజమానులపై ఫిర్యాదు చేయించారు. బాధితురాలి పాస్‌పోర్టు ఇంటి యజమానుల దగ్గరే ఉండిపోవడంతో, కేసు వెనక్కి తీసుకుంటేనే ఇస్తామని వారు ఆమెను వేధిస్తున్నట్లు తెలిసింది.
డబ్బులు డిమాండ్ చేస్తున్న ఏజెంట్: ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ మహిళ పిచ్చాసుపత్రిలోనే మగ్గిపోతున్నారు. తన బాధనంతా వీడియో కాల్ ద్వారా తన తమ్ముడికి చెప్పుకున్నారు. ఏజెంట్‌ను సంప్రదిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి బాధితురాలిని స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు.
'కువైట్‌లో మా అమ్మను గదిలో బంధించి కొడుతున్నారు' - రక్షించాలంటూ వీడియో