ఏలినాటి శని అంటే భయపడాల్సిన అవసరం లేదు- ఇలా పరిహారాలు చేస్తే దోషాల నుంచి రిలీఫ్!
శనివారం వచ్చిన శని జయంతి రోజు శనిభగవానుని ఎలా ఆరాధించాలి? ఏలినాటి శని అంటే ఏమిటి?

Published : May 16, 2026 at 2:53 AM IST
Shani Jayanti Significance and Remedies : 'ఏలినాటి శని' ఈ పేరు వింటేనే చాలు భయపడి పోవడం సహజం. కానీ ఏలినాటి శని గురించి సమగ్రంగా తెలుసుకుంటే అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పుట్టిన ప్రతి వ్యక్తికీ జీవితంలో ప్రతి 30 ఏళ్లకు ఒకసారి తప్పకుండా వచ్చే దశ ఏలినాటి శనిదశ. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. అయితే కొన్ని పరిహారాలు పాటించడం వలన ఏలినాటి శని జరిగే సమయంలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా శనివారం చేయాల్సిన ఈ పరిహారాలు ఈ ఏడాది శనివారంతో పాటు శని జయంతి కలిసి వచ్చిన విశిష్టమైన రోజు చేయడం ఫలితాలు అధికంగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
ఏలినాటి శని అంటే?
ఏలినాటి శని అంటే వ్యక్తిగత జాతకంలో చంద్ర రాశికి 12, 1, 2 స్థానాల్లో శని సంచరించే 7.5 సంవత్సరాల కాలం. ఈ సమయంలో వృత్తి పరంగా, వ్యక్తిగతంగా, ఆరోగ్య పరంగా, ఆర్థికంగా కష్టనష్టాలు ఉంటాయి. అయితే ఏలినాటి శని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. నిజానికి శని ఆయుఃకారకుడు. అయితే శని మందగమనుడు కాబట్టి తలపెట్టిన పనులు ఆలస్యం అవుతాయేమో కానీ అసలు కాకుండా ఉండవు. నిజానికి పరిశీలించి చూస్తే ఒక వ్యక్తి జీవితంలో వివాహం, ఇల్లు కట్టుకోవడం వంటి శుభ కార్యాలన్నీ శని భగవానుని అనుగ్రహంతోనే నెరవేరుతాయి.
ఏలినాటి శని సమయంలో ఇబ్బందులు తప్పవా?
శని పాపగ్రహం కాబట్టి ఏలినాటి శని జరుగుతున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ధననష్టం, ఉద్యోగం పోవడం, ఆర్థిక సమస్యలు, రుణబాధలు, అనారోగ్య సమస్యలు వంటి బాధల నుంచి ఉపశమనం పొందడానికి శని జయంతి రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
శని జయంతి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ బహుళ అమావాస్యను శని జయంతిగా పరిగణిస్తారు. ఈ ఏడాది మే 16, శనివారం వైశాఖ బహుళ అమావాస్యను శని జయంతిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈసారి శని జయంతి శనివారం రావడం మరింత విశేషమని పండితులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన రోజు శని దోషాల నుంచి విముక్తి కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో చూద్దాం.
శని జన్మ దినోత్సవం రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలి?
వైశాఖ అమావాస్య శని జన్మదినం. అందుకే ఈ రోజును శని అమావాస్య అని కూడా అంటారు. నిజానికి శని న్యాయ దేవుడు. అధర్మ మార్గంలో నడిచే వారిని శిక్షించడంతో పాటు, ధర్మ మార్గంలో నడిచే వారికి సత్ఫలితాలు ప్రసాదిస్తాడు. శని జయంతి రోజు శనీశ్వరుని భయంతో కాకుండా భక్తితో పూజించాలి.
ఇంట్లో పూజ ఇలా!
ఇంట్లో శనీశ్వరుని పూజించేవారు పూజామందిరంలో శనీశ్వరుని చిత్రపటాన్ని ఉంచుకుని నువ్వుల నూనెతో దీపారాధన చేసి 'ఓం శనైశ్చరాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శనీశ్వరునికి ఒక తమలపాకులో బెల్లం, నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజంతా ఉపవాసం పాటించాలి. నల్లని వస్త్రాలు, నువ్వులు వంటివి దానం చేయాలి. కాకులకు, కుక్కలకు, నల్ల చీమలకు ఆహారాన్ని అందించాలి.
ఆలయాల్లో ఇలా!
శని జయంతి రోజు ఆలయాలకు వెళ్లే వారు నవగ్రహాల ఉన్న శివాలయానికి వెళ్లడం శ్రేయస్కరం. శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం, 9 ప్రదక్షిణాలు చేయడం ఉత్తమం. ఆలయంలోని పూజారికి నల్లని వస్త్రాలు, నువ్వులు దక్షిణ తాంబూలాలతో దానం చేయడం మంచిది. అనంతరం శివుని దర్శించుకుని ఇంటికి తిరిగి రావాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండటం మంచిది. ఈ విధంగా శని జయంతి రోజు ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం వలన శని సంబంధిత దోషాలు తొలగుతాయని, శుభాలు చేకూరుతాయని శాస్త్రం చెబుతోంది. అంతే కాదు ఈ రోజు శనిస్తోత్రాలు పఠించినా, సుందరకాండ పారాయణ చేసినా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. రానున్న శని జయంతి రోజు మనం కూడా ఈ పరిహారాలు పాటించి శని భగవానుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శనైశ్చరాయ నమః!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

