ETV Bharat / state

వాలంటీర్లపై మరో బాధ్యత - ఓటర్ల కులాలు, పార్టీల వివరాలు సేకరించాలని వైఎస్సార్సీపీ హుకూం!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 7:14 AM IST

Updated : Feb 6, 2024, 7:51 AM IST

YSRCP Leaders Doing Irregularities: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనుకుంటున్న అధికార పార్టీ అందుకోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఫారం-7 ఉపయోగించి విపక్షాల మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్ల చాలాచోట్ల తొలగించారు. ఇప్పుడు గుంటూరులో వాలంటీర్లకు జాబితా ఇచ్చి ఓటర్లు ఏ సామాజిక వర్గం వారో, ఏ పార్టీకి చెందిన వారో తెలుసుకోమని చెప్పింది. ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తున్న వాలంటీర్లను తెలుగుదేశం నేతలు పట్టుకోవడంతో అధికార పార్టీ అక్రమాల గుట్టు బయటపడింది.

YSRCP_Leaders_Doing_Irregularities
YSRCP_Leaders_Doing_Irregularities

వాలంటీర్లపై మరో బాధ్యత - ఓటర్ల కులాలు, పార్టీల వివరాలు సేకరించాలని వైఎస్సార్సీపీ హుకూం!

YSRCP Leaders Doing Irregularities : ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ వాలంటీర్ల ద్వారా ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసేందుకు వైఎస్సార్సీపీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో కొందరు వాలంటీర్లు ఓటర్ల జాబితా పట్టుకుని ఇంటింటికి వెళ్లి వారి సామాజిక వర్గాల వివరాలు సేకరించటం వివాదానికి దారితీసింది. ప్రత్యేక ప్రొఫార్మా ఒకటి సిద్ధం చేసుకుని మరీ వివరాలు సేకరిస్తుండటం చూస్తుంటే ఇదెంతో పకడ్బందీ వ్యవహారమని తెలిసిపోతుంది.

కుట్రలకు తెరలేపారా? : ఓటరు పేరు, కులం, ఉపకులం, ఓటర్ ఐడి కార్డు నంబర్, పోలింగ్ బూత్ వివరాలు, ఫోన్ నంబర్, ఇతర వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు. డివిజన్ నంబర్, సచివాలయం నంబర్, వాలంటీర్ పేరు, క్లస్టర్ వివరాలు కూడా ఆ ఫార్మాట్​లో ఉన్నాయి. ఓటరు ఏ పార్టీ వారో కూడా ఓటర్ల జాబితాలో రాసుకోవటం అనుమానాలకు తావిస్తోంది. వైఎస్సార్సీపీకి ఓటేయకుంటే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని స్థానిక ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఓటర్లను బెదిరించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే తరహాలో ఏదైనా కుట్రలకు తెరలేపారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

మీ ఓటును లేపేసిన అధికారులు - భారీగా బోగస్ ఓటర్లకు చోటు?

వాలంటీర్ల వద్ద ఓటర్ల జాబితా : గుంటూరు నగరంలో వాలంటీర్లు చేస్తున్న సమాచార సేకరణను అడ్డుకుని నిలదీశారు. టీడీపీ వారి ప్రశ్నలకు వాలంటీర్లు నీళ్లు నమిలారు. అసలు వాలంటీర్ల వద్ద ఓటర్ల జాబితా ఎందుకు ఉందన్న దానికి తమ కార్పోరేటర్ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల సంఘం ప్రతి రాజకీయ పార్టీకి ఓటర్ల జాబితా అందజేస్తుంది. దాని ప్రకారం ఏమైనా మార్పులు, చేర్పులకు సంబంధించి రాజకీయ పార్టీలు సూచనలు, అభ్యంతరాలు తెలియజేయవచ్చు. సంబంధిత రాజకీయ పార్టీకి సంబంధించి బూత్ లెవల్ ఏజెంట్లు ఆ పని చేస్తారు. కానీ ఇప్పుడు వాలంటీర్లు ఓటర్ల జాబితాను పట్టుకుని ఇంటింటికీ తిరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విపక్షాలు అభ్యంతరం : ఇటీవల విడుదలైన ఓటర్ల జాబితాలో పాత తప్పులు చాలా వరకూ పునరావృతం అయ్యాయి. అలాగే ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను రెండు, మూడు పోలింగ్ బూత్​లకు మార్చారు. సున్న ఇంటి నంబర్లు, ఫోటో లేకుండా ఓటర్ల జాబితాలో చేర్చటం, ఇతర భాషల్లో పేర్లు ముద్రించటం ఇలా ఎన్నో తప్పులు దొర్లాయి. టీడీపీ బూత్ ఏజెంట్లు వాటిని సరి చేయాలని బూత్ స్థాయి అధికారుల్ని కోరినా సరైన స్పందన లేదు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోకి ఇతర నియోజకవర్గాల నుంచి ఓటర్ల రాక మొదలవటం అనుమానాలకు తావిస్తోంది.

వైసీపీ నేతలకు రెండు ఓట్లు - నంద్యాల ఓటరు జాబితాలో చిత్రవిచిత్రాలు

వీటిలో ఎక్కువగా చిలకలూరిపేట నుంచి తమ ఓట్లు గుంటూరు పశ్చిమకు మార్చాలన్న ప్రతిపాదనలు ఎక్కువగా వస్తున్నాయి. గుంటూరులో లేకపోయినా స్థానికంగా ఏదో ఒక చిరునామా పెట్టి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఆ దరఖాస్తుల్ని అధికారులు పక్కనపెట్టారు. మరణించిన వారి వివరాలు ఇచ్చినా వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తొలగించకుండా వదిలేశారు. ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ఓటర్ల వివరాల సేకరణ పైనా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వాలంటీర్లపై ఒత్తిడి : వాలంటీర్ల ద్వారా ఈ వివరాలన్నీ సేకరించాలని వైఎస్సార్సీపీ అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలకు ఆదేశించినట్లు సమాచారం. ఆ మేరకు ఎవరికి వారు తమ నియోజకవర్గాల పరిధిలో వాలంటీర్లతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రొఫార్మా ద్వారా వివరాలు సేకరించాలని సూచించగా కొందరు వాలంటీర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమను జనం ఇళ్లలోకి రానీయటం లేదని కొందరు వాపోయారు. అయినా సరే వివరాలు తీసుకోవాలని వారిపై ఒత్తిడి తేవటంతో వాలంటీర్లు రంగంలోకి దిగారు. అధికారులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అనుమానమే.

తుది జాబితాలోనూ వైఎస్సార్సీపీ దొంగ ఓట్ల దందా

Last Updated :Feb 6, 2024, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.