ETV Bharat / state

కొండలకు 'కన్నా'లు వేసే 'బాబు' - వసూళ్లలో రా'రాజు' - కాదంటే గన్ను గురిపెట్టి - YSRCP LEADER IRREGULARITIES

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 10:24 AM IST

YSRCP_LEADER_IRREGULARITIES
YSRCP_LEADER_IRREGULARITIES

YSRCP LEADER IRREGULARITIES ANAKAPALLI DISTRICT: ఆయన కొండలకు 'కన్నా'లు వేసే 'బాబు'. అప్పనంగా భూములు దోపిడీ చేయడంలో రాజు! అనుమతి కొంత, గ్రావెల్‌ తవ్వేసేదేమో అంతా. సెజ్‌లోని పరిశ్రమల యజమానులను బెంబేలెత్తించడం. ఇష్టానుసారం వసూళ్లకు పాల్పడటం ఆ ప్రజాప్రతినిధి నైజం. కాదంటే గన్ను తీసి గురి పెట్టి బెదిరించి, తనకు తానే 'పవర్‌ఫుల్‌' అని ప్రకటించుకుంటారు.

కొండలకు 'కన్నా'లు వేసే ఈ 'బాబు' - వసూళ్లలో రా'రాజు' - కాదంటే గన్ను గురిపెట్టి

YSRCP LEADER IRREGULARITIES ANAKAPALLI DISTRICT: అనకాపల్లికి జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయిన ఆయన. అభివృద్ధి చేస్తానంటూ గెలిచి, ఆ తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి కాకుండా సొంత ఎదుగుదలపైనే దృష్టి నిలిపారు. ఎప్పుడూ వివాదాల్లో ఉంటూ ‘నియోజకవర్గంలో పవర్‌ఫుల్‌’ అంటూ గల్లా ఎగరేస్తుంటారు. 'కన్నా' అని కోరినా 'బాబు' అని బతిమిలాడినా వినేది లేదు. వసూళ్లు ఆపేది లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే బూతుల పురాణం అందుకుంటారు. జిల్లాలో ఈ నాయకుడి దందా ఇంతా అంతా కాదు.

విశాఖ నగరానికి సమీపంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అది. అచ్యుతాపురం సెజ్‌ అక్కడే ఉంది. ఏటికొప్పాక బొమ్మలకు ప్రసిద్ధి. విస్తృత తీర ప్రాంతమూ ఉంది. ఇంతటి కీలక ప్రాంతంలో వివాదాస్పద భూములపై కన్నేసే ఆయన ఎలాగోలా వాటిని సొంతం చేసుకుంటారు. పారిశ్రామికవాడలో మట్టి పోయాలన్నా, ఇటుక పేర్చాలన్నా, ఆఖరికి పరిశ్రమల వ్యర్థాలు అమ్ముకోవాలన్నా సరే ఈయనకు ముడుపులు చెల్లించాల్సిందే. లేకపోతే అడ్డంకులు సృష్టిస్తారు. అయినా దారికి రాకపోతే అనుచరులతో దాడులు చేయిస్తారు. ప్రతిపక్షాలతో కలిసి సొంత పార్టీ నేతలే అఖిలపక్షం ఏర్పాటు చేసి మరీ, ఆయన దందాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

సంబరాల సిత్రాలు - కమీషన్లతో కోట్లు ఆర్జన - ఓ వైపు తమ్ముడు, మరోవైపు అల్లుడు - YSRCP LEADER IRREGULARITIES

లొంగదీసుకోవడంలోనూ ఆయనను మించిన 'రాజు' లేరు: భూములు అన్నా, గ్రావెల్‌ అన్నా ఆ నేతకు ఎంతో ఇష్టం. నియోజకవర్గంలో ఎక్కడ లే అవుట్‌ వేసినా, కొండల తవ్వకాలు జరిగినా అందులో ఈ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లే. అక్రమ లే అవుట్లు వేయించి అమ్ముకోవడం, ఆ భూములు కొనుగోలు చేసిన వారిని వాళ్లే భయపెట్టి తక్కువ ధరకు స్వాధీనం చేసుకుంటారు. ఆయన కన్ను పడితే కొండలు పిండి, భూములు హాంఫట్‌ కావాల్సిందే. అందుకు ఎదురుచెప్పేవారిని నయానో, భయానో లొంగదీసుకోవడంలోనూ ఆయనను మించిన 'రాజు' లేరు. రాంబిల్లి మండలంలో పెదకలవలాపల్లి, వేల్చూరు, పంచదార్ల, కొత్తూరు గ్రామాల్లో కొండలను గుల్లచేసి భారీగా గ్రావెల్‌ను తరలించారు.

సెజ్‌కి ఉండాల్సిన రక్షణ గోడను పగలగొట్టించి మరీ: అక్రమ తవ్వకాలు జరిగాయని నిర్ధారణ చేసిన గనుల శాఖ 14 కోట్ల అపరాధ రుసుం చెల్లించాలని ఆదేశించినా, ఒక్క రూపాయీ చెల్లించలేదు. ఆ ప్రాంతంలో ఎవరు గుత్తేదారులుగా ఉన్నా అవసరమైన గ్రావెల్‌ ఈయనే సరఫరా చేస్తారు. దొప్పెర్ల మండలంలో ‘బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు అవసరమైన గ్రావెల్‌ను ఈయనే తరలించారు. నునపర్తి, నడింపల్లి గ్రామాలతో పాటు పోలవరం ఎడమ కాల్వ గట్టుపై ఉన్న కంకరను సైతం పూర్తిగా దోచుకున్నారు. అచ్యుతాపురం సెజ్‌లో ఓ టైర్ల కంపెనీ కొత్తగా స్థాపించారు. ఆ స్థలాన్ని చదును చేయగా వచ్చిన సుమారు లక్ష క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను విక్రయించి ఈ నేత సొమ్ము చేసుకున్నారు. గ్రావెల్‌ తరలింపునకు వీలుగా సెజ్‌కి ఉండాల్సిన రక్షణ గోడను పగలగొట్టించి మరీ ఈ వ్యాపారం కొనసాగించారు.

ప్రకృతి వనరులపై విధ్వంసకాండ - నియోజకవర్గాన్ని దందాలూరుగా మార్చిన ఎమ్మెల్యే - YSRCP LEADER IRREGULARITIES

ఈ నేతకు వెన్నతో పెట్టిన విద్య: ఎక్కడ ఏ భూమి వివాదం ఉందంటే అక్కడ వాలిపోతారు ఈ నేతకు సంబంధించిన అనుచరులు. ఎవరిని ఎలా భయపెట్టి భూములను సొంతం చేసుకోవచ్చో ఈ నేతకు వెన్నతో పెట్టిన విద్య. అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఇటీవల చనిపోయిన ఒక ప్రతిపక్ష నాయకుడికి మొత్తం 40 ఎకరాల భూమి ఉండేది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను భయపెట్టిన ఈ ప్రజాప్రతినిధి కేవలం నాలుగెకరాలు మాత్రమే ఆయన వద్ద ఉంచి, మిగిలినవి ఎకరా 12 లక్షల చొప్పున కుమారుడి పేరిట రాయించుకున్నారు. గతంలో 22ఏ పరిధిలో ఉండేవన్న కారణం చూపి, ఆవసోమవారంలోని 8 ఎకరాలనూ తక్కువ ధరకే ఆయన నుంచి తీసేసుకున్నారీ నేత.

ప్రస్తుతం ఆ 44 ఎకరాల భూముల విలువ 100 కోట్లకు పైమాటే! అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల భూమినీ ప్రభుత్వానిదంటూ భయపెట్టి తక్కువ ధరకు లాక్కున్నారు. ఇలా ఆ నేత కుమారుడి పేరిట కొనుగోలు చేసిన భూములను ఆనుకొనే మరో 160 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. 22ఏ జాబితాలో ఉన్న వీటిపైనా కన్నేశారు. రాంబిల్లి మండల పరిధిలో పేదలకు ప్రభుత్వం అందించిన వందల ఎకరాల అసైన్‌మెంట్‌ భూములకు సంబంధించి రికార్డుల్లో లబ్ధిదారుల పేర్లు ఉన్నా, సాగులో మాత్రం ఆ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఇందుకు ప్రతిగా ఏటా లబ్ధిదారులకు ఎంతో కొంత ముట్టజెబుతున్నారు.

వెంచర్‌ వేయాలంటే కప్పం కట్టాల్సిందే - రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన స్థాయి నుంచి కోట్లకు - YSRCP Leader Irregularities

ఫ్లైయాష్‌ వ్యర్థాల అమ్మకాలూ ఈ నాయకుడి కనుసన్నల్లోనే: అచ్యుతాపురం సెజ్‌కి ఏ కంపెనీ వచ్చినా, ముందుగా ఈ ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. కంపెనీకి అవసరమైన గ్రావెల్, మట్టి, ఇసుక, గోదాం ఇలా అన్ని అవసరాలనూ ఆయనే సమకూరుస్తారు. ట్రాన్స్‌కో సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులను ఒక మంత్రి అనుచరుడు దక్కించుకోగా, తన రాజ్యంలో ఆయన పెత్తనం ఏమిటంటూ ఏకంగా నిర్మాణ పనులనే అడ్డుకున్నారీ నేత. సెజ్‌లో ప్లైవుడ్‌ తయారు చేసే ఒక పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరించి ఆ ఉత్పత్తులను తన గోదాంలోనే దాచుకోవాలని హుకుం జారీ చేశారు. అసలా గోదామే అక్రమ నిర్మాణమనే ఆరోపణలున్నాయి. అందులో ఆ పరిశ్రమ వారు సరకు దాచుకుని లక్షల్లో అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఫెర్రో పరిశ్రమ నుంచి వచ్చే ఫ్లైయాష్‌ వ్యర్థాల అమ్మకాలూ ఈ నాయకుడి కనుసన్నల్లోనే సాగాలి.

అభివృద్ధి పనులకూ ఈయన అనుచరగణమే: ఇటీవల ఈ బూడిద అమ్మకాల వ్యవహారంలో ఓ మంత్రి అనుచరులకు, నేత అనుచరులకు మధ్య బాహాబాహీ జరిగింది. అచ్యుతాపురం సమీపంలో మాజీ సైనికుడి భూమి తక్కువ రేటుకే కొనుగోలు చేశారు. ఆ భూముల చుట్టూ పంచాయతీ నిధుల నుంచి సీసీ రహదారులు నిర్మించి విలువ పెంచుకున్నారు. ఇప్పుడు అదే భూమిని ఆనుకొని జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ నిర్మాణం జరిగేలా చూశారు. ఆ భూమి విలువను మరింత కొండెక్కించారు. పరిశ్రమల సీఎస్‌ఆర్‌ నిధులను సైతం ఎక్కడ వినియోగించాలో ఈ నాయకుడే చెబుతారు. ఆ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకూ ఈయన అనుచరగణమే గుత్తేదారు అవతారం ఎత్తుతుంది.

నాడు అప్పులతో సతమతం - నేడు సిరులతో కళ కళ! - YSRCP Leader Irregularities

ఆ నేతను నమ్మి పారిశ్రామిక వాడకు భూములిచ్చిన వారు ఇంకా పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నారు. ఆయన మాత్రం కొండకర్ల ఆవను ఆనుకొని భారీ అతిథిగృహం, విశాఖ నగరంలో దేవాదాయ భూములను ఆక్రమించి విశాలమైన ఇంటిని నిర్మించారని చెబుతుంటారు. తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని ఇంటికి వెళ్లి అడిగిన సెజ్‌లోని ఒక గుత్తేదారుడిపై ఏకంగా తుపాకి గురిపెట్టి, చంపుతానని బెదిరించిన ఘనత ఈయనది.

అరాచక 'గ్రంథం'- గోదావరి జిల్లాల్లో పేట్రేగిపోతున్న వైసీపీ నేత - YSRCP Leader Irregularities

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.