ETV Bharat / state

అంతా జగన్నాటకం - ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం అవే పాత అబద్ధాలు!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 10:30 AM IST

YSRCP Government Lies: 'వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు పెద్దలు'! కానీ జగన్‌ సర్కార్‌ లెక్కలేనన్ని అబద్ధాలు ఆడైనా రాష్ట్రాన్ని దోచేయడమే పనిగా పెట్టుకుంది. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాల్లేవని నిల్వ కేంద్రాల్లో ఉన్నదే విక్రయిస్తున్నట్లు హైకోర్టుకు చెప్పింది. కళ్ల ముందు ఆక్రమాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా మొండివాదనే వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు ఆక్షేపించి, ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించింది. అయినా వినకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఇసుక తవ్వకాలు ఆగలేదు.

YSRCP_Government_Lies
YSRCP_Government_Lies

YSRCP Government Lies : వైఎస్సార్సీపీ ప్రభుత్వ అక్రమాలకు, అబద్ధాలకు అడ్డేలేకుండా పోతోంది. హైకోర్టు, ఎన్జీటీలో ఇసుక అక్రమ తవ్వకాలపై కేసులు విచారణకు వచ్చిన ప్రతిసారీ స్టాక్ పాయింట్ల (Stock Points)లో ఇసుకనే విక్రయిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. గత ఏడాది ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని 110 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ గనులశాఖను, అప్పటి ఇసుక గుత్తేదారు జేపీ సంస్థను ఆదేశించింది. అప్పటికే స్టాక్ పాయింట్లలో ఇసుక ఉంటే.. దాన్నే విక్రయించాలంది.

Illegal Sand Mining in Andhra Pradesh : రాష్ట్రమంతా కలిపి 50 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు గనులశాఖ అధికారులు అప్పట్లో చెప్పారు. ఇది మూడు, నాలుగు నెలలకే సరిపోతుంది. కానీ రాష్ట్రంలో అనేక నిల్వ కేంద్రాల్లో ఇసుక నిల్వలు అలాగే ఉన్నాయి. నదుల్లో అక్రమంగా తవ్వి విక్రయిస్తున్నారు. పేరుకు నిల్వకేంద్రాల నుంచి విక్రయిస్తున్నట్లు వే బిల్లులు జారీ చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల టన్నుల ఇసుక విక్రయించి ఉంటారు.

"కేంద్ర అధికారులకు కనిపించిన ఇసుక అక్రమ తవ్వకాలు - కలెక్టర్లకు కనిపించడం లేదా?"

ఇసుక దోపిడీ, అక్రమ తవ్వకాలపై గత ఏడాది ఆగస్టు 25న టీడీపీ అధినేత చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విలేకరుల సమావేశంలో వివరించారు. దీనిపై గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఆగస్టు 31న విలేకర్లకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పూడిక తీసిన ఇసుకనే విక్రయిస్తున్నామని, ఎక్కడా ఓపెన్ రీచ్లో ఇసుక తవ్వకాలు లేవని చెప్పారు. కానీ అన్నిచోట్లా తవ్వకాలు కొనసాగుతునే ఉన్నాయి. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని గత ఏడాది మే 2తో జేపీ సంస్థకు గడువు ముగిశాక రీచ్లలో ఇసుక తవ్వకాల్లేవని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ డిసెంబరు 6న హైకోర్టులో చెప్పారు. అంతకుముందు తవ్వి, నిల్వచేసిన ఇసుకే తరలిస్తున్నామన్నారు. కానీ ఇప్పటికీ ఎక్కడా ఇసుక తవ్వకాలు ఆగలేదు.

పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేయొద్దని, అలా చేస్తే కలెక్టర్లు, గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు బుధవారం స్పష్టంగా చెప్పింది. అయితే గురువారం కూడా ఇసుక తవ్వకాలు యథావిధిగా సాగాయి. హైకోర్టునూ లెక్క చేయకుండా దర్జాగా తవ్వకాలు కొనసాగించి విక్రయాలు చేశారు. కృష్ణా జిల్లాలో రొయ్యూరు, శ్రీకాకుళం, లంకపల్లి, చోడవరం, యనమలకుదురు వద్ద ఇసుక తవ్వకాలు కొనసాగాయి.

ఎన్టీఆర్ జిల్లా గనిఆత్కూరు, కంచెలలో ఇసుక తవ్వ కాలు జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా అమరావతి మండలం మల్లాది, అచ్చంపేట మండలం కేవీపాలెంలో గురువారం యథావిధిగా తవ్వకాలు చేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పెదలంక ఇసుక రీచ్లో గనులశాఖ, సెట్ అధికారులు మొక్కుబడిగా దాడులు చేశారు. ఇసుక తవ్వుతున్న మూడు యంత్రాలను సీజ్చేశారు. 15 లారీలను వదిలేశారు.

కలెక్టర్ల చాటు మాటున ఇసుక తవ్వకాల్లో అక్రమాలు!

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో జొన్నాడ, గోపాలపురం, ఓబుల్లంక, కపిలేశ్వరపురం తదితర రీచ్‌ల్లో గురువారం తవ్వకాలు కొనసాగించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని అరణి యార్‌ నదిలో సుబ్బనాయుడు కండ్రిగ వద్ద, ఏర్పేడు మండలం స్వర్ణముఖి నదిలో, చంద్రగిరి మండలం రెడ్డి వారిపల్లె, కొటాల, శానంభట్ల, శివగిరిలో ఇసుక తవ్వు తూనే ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని సిద్ధవటం, నందలూరు, నందిమండలం పరిధిలో దర్జాగా ఇసుక తవ్వకాలు కొనసాగించారు.

శ్రీకాకుళం జిల్లా పరిధిలోని వంశధార, నాగావళి నదుల్లో కల్లెపల్లి, ముద్దాడపేట, తోటాడ, అంబళ్లవలస, బూరగాం, బట్టేరు, చేనులవలస, చెవ్వాకుల పేట, పర్లాం, దొంపాక, రామకృష్ణాపురం, అంగూరు, పురుషోత్తపురం, యరగాం, మడపాం రీచ్‌ల్లో పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి.

హైకోర్టు చెప్పినా అధికార పార్టీ నేతలు దర్జాగా ఇసుక తవ్వుతూనే ఉన్నారు. వీటిని అడ్డుకోవాల్సిన కలెక్టర్లు, గనులశాఖ, ఎస్ఈబీ, పీసీబీ అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని చోద్యం చూస్తున్నారు. ఎన్జీటీ ఆదేశాలతో తప్పనిసరై ఇటీవల కలెక్టర్లు మొక్కుబడిగా ఇసుక తవ్వకాలు లేని ఒకటి, రెండు రీచ్‌ల్లో పరిశీలించి సరిట్టారు. వాస్తవంగా తవ్వకాలు జరిగే రీచ్‌లలో అధికారులు దాడులు చేసి, అడ్డుకోవాలని కూడా కలెక్టర్లు అదేశించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు వాస్తవమే: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.