ETV Bharat / state

కలెక్టర్ల చాటు మాటున ఇసుక తవ్వకాల్లో అక్రమాలు!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 9:03 AM IST

Collectors Inspection in Sand Reaches: ఇసుక తవ్వకాల్లో అక్రమాలు కళ్ల ముందే కనిపిస్తున్నా వాటిని ఆపడం మానేసి కప్పిపుచ్చేందుకే కలెక్టర్లు ప్రయాసకోర్చారు. ఎన్జీటీకి నివేదిక పంపాల్సి ఉండగా తవ్వకాల్లేని ఇసుక రీచ్‌లను ఏరికోరి తనిఖీలు చేశారు. వీటి జాబితానే ఎన్జీటీకి పంపి చేతులు దులిపేసుకున్నారు. భారీగా తవ్వేస్తున్న రీచ్‌లకు ఆమడదూరంలోనే ఉన్నారు. ఈ తనిఖీలను ఖాతరు చేయని ఇసుకాసురులు మళ్లీ యథావిధిగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు.

Collectors_Inspection_in_Sand_Reaches
Collectors_Inspection_in_Sand_Reaches

కలెక్టర్ల చాటు మాటున ఇసుక తవ్వకాల్లో అక్రమాలు!

Collectors Inspection in Sand Reaches : పొరుగున్న ఉన్న తమిళనాడులో ఇసుక అక్రమ తవ్వకాలపై ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. 5 జిల్లాల కలెక్టర్లపై కేసులు నమోదు చేసింది. అక్కడి అధికారులు భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఇసుక దోపిడీ తమిళనాడు కంటే ఎన్నో వందల రెట్లు ఎక్కువ. ఇక్కడ అధికారపార్టీ నేతలకు అడ్డు, అదుపు లేదు. 'ముఖ్యనేత' సోదరుడే తెరవెనుక ఉండి ఇసుక దందా చేస్తున్నారు. 10 నెలలుగా అనుమతులు లేకుండా రాష్ట్రమంతా ఇసుక తవ్వుతున్నా ఒక్క కలెక్టర్‌ కూడా అడ్డుకున్న దాఖలాల్లేవు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇక్కడ రంగంలోకి దిగి విచారణ చేపడితే అత్యధిక జిల్లాల కలెక్టర్లు ఇరుక్కుంటారు. అయినా వీరంతా వైఎస్సార్సీపీకి జీహుజూర్‌ అంటున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (National Green Tribunal) ఆదేశాలతో సోమ, మంగళవారాల్లో కలెక్టర్లు చేపట్టిన ఇసుక రీచ్‌ల పరిశీలనే ఇందుకు నిదర్శనం. నిత్యం ఇసుక తవ్వుతున్న రీచ్‌లను పరిశీలించకుండా, పైనుంచి వచ్చిన జాబితాలోవాటినే మొక్కుబడిగా పరిశీలించి చేతులు దులిపేసుకున్నారు. అసలు తవ్వకాలే లేవంటూ ఎన్జీటీకి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.

రీచ్‌లలో కలెక్టర్ల తనిఖీల హడావుడి - నిలువెత్తు ఇసుకలో 'నిజాలకు పాతర'!

Illegal Sand Mining In AP : కలెక్టర్లు రీచ్‌లను పరిశీలించి, నివేదిక ఇవ్వాలంటూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు వరుసగా 3 రోజులు ఇసుక రీచ్‌లు పరిశీలించారు. అయితే భారీ యంత్రాలతో పెద్ద ఎత్తున ఇసుక తవ్వేసి, వందల లారీల లోడ్లు తరలిస్తున్న రీచ్‌ల జోలికి ఏ కలెక్టరూ వెళ్లలేదు. ఈ తనిఖీలకు రెండు, మూడు రోజుల ముందు గనులశాఖ సంచాలకుని కార్యాలయం నుంచి ఓ ఉన్నతాధికారి, అన్ని జిల్లాల గనులశాఖ అధికారులతో ఫోన్లలో మాట్లాడారు. ఇసుక తవ్వకాలు జరగని రీచ్‌ల వివరాలు తీసుకున్నారు. ఇందులో ఒక్కో జిల్లాలో రెండేసి రీచ్‌ల వివరాలను కలెక్టర్లకు పంపారు. కలెక్టర్లు వాటినే పరిశీలించారు. అందుకే ఎక్కడా తవ్వకాలు లేవని తేల్చేశారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు కనీసం రీచ్‌ల పరిశీలనకూ వెళ్లలేదు. గనులశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఎస్‌ఈబీ, భూగర్భజలశాఖ తదితర జిల్లా అధికారులతో ఓ కమిటీ వేసి, వారితోనే పరిశీలన చేయించి మమ అనిపించారు.

కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలి - అధికారులకు కలెక్టర్​ సూచన

యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు : పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు ఎలా చేస్తున్నారని ఎన్జీటీ కడిగిపారేస్తోంది. తాజాగా ఏపీ హైకోర్టు సైతం తీవ్ర స్థాయిలో మండిపడింది. అయినా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం కూడా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగాయి. పల్నాడు జిల్లా అమరావతి మండలం మల్లాది రీచ్‌లో కలెక్టర్‌ మంగళవారం తనిఖీ చేయగా, బుధవారం అదే రీచ్‌లో మళ్లీ తవ్వకాలు కొనసాగించారు. అదే మండలం వైకుంఠపురం రీచ్‌లోనూ తవ్వకాలు కొనసాగాయి. అచ్చంపేట మండలం కేవీపాలెం, కొత్తపాలెం రీచ్‌లలో పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు జరిగాయి.

అధికారులు కరవు : కృష్ణా, ఉమ్మడి గోదావరి, నెల్లూరు, సీఎం సొంత జిల్లా వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల్లో యథేచ్చగా ఇసుక అక్రమ తవ్వకాలు, వందలాది లారీల్లో రవాణా నిరాటంకంగా సాగుతున్నాయి. అయినా అటు తొంగిచూసే అధికారే లేరు.

జోగి రమేష్ ఇసుక అక్రమ తవ్వకాలను అధికారులు పట్టించుకోవట్లేదు : బోడె ప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.