ETV Bharat / state

భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసిన వైసీపీ - పక్కాగా క్విడ్‌ ప్రోకో అమలు చేసిన జగన్ సర్కార్ - YSRCP Electoral Bonds Fund

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 7:03 AM IST

YSRCP_Electoral_Bonds_Funds
YSRCP_Electoral_Bonds_Funds

YSRCP Electoral Bonds Fund: హరిత ఇంధన ప్రాజెక్టులతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మారబోతోందని, రైతులకు పెద్దగా ఆదాయం రాని భూముల్లో ఎకరాకు ఏడాదికి 30 వేలు లీజు రూపేణా అందుతుందని చిలక పలుకులు పలికిన జగన్‌, దాని వెనుక పెద్ద చిలక్కొట్టుడు వ్యూహం పన్నారు. తనకు బాగా అచ్చొచ్చిన క్విడ్‌ ప్రోకో వ్యవహారాన్నే విద్యుత్‌ ప్రాజెక్టులకు భూ కేటాయింపులో జగన్‌ అమలు పరిచారు. ప్రతిఫలంగా ఎన్నికల బాండ్ల రూపంలో భారీగా లబ్ధి పొందారు.

భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసిన వైసీపీ - పక్కాగా క్విడ్‌ ప్రోకో అమలు చేసిన జగన్ సర్కార్

YSRCP Electoral Bonds Fund: హరిత ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మారడం ఏమోగానీ వైసీపీ ఆర్థిక ముఖచిత్రం మాత్రం మారింది. ‘ఇద్దరికీ సమ ప్రయోజనం’అనే సూత్రాన్ని అనుసరించే జగన్‌, విద్యుత్‌ ప్రాజెక్టుల కేటాయింపులోనూ పక్కాగా పాటించారు. క్విడ్‌ ప్రోకో విధానాన్ని ఓ ప్రణాళిక ప్రకారం అమలు చేసి భారీగా లబ్ధి పొందారు. వివిధ సంస్థలకు హరిత ఇంధన ప్రాజెక్టులు కేటాయించినందుకు గాను ఎన్నికల బాండ్ల ద్వారా వైసీపీకి భారీగా ప్రతిఫలం దక్కింది. సుప్రీంకోర్టుకు ఎస్​బీఐ అందించిన ఎన్నికల బాండ్ల నంబర్ల ఆధారంగా పరిశీలిస్తే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు అందిన విరాళాల్లో మెజారిటీ వాటా వైసీపీ ఖాతాలోకే వెళ్లాయని తేలింది.

ఆ పార్టీకి 94 కంపెనీల నుంచి విరాళాలు అందితే, అందులో విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలే 26 ఉన్నాయి. వాటి నుంచి 109 కోట్ల 75 లక్షల రూపాయల విరాళాలు పార్టీ ఖాతాలో జమ అయ్యాయి. వివిధ కంపెనీల నుంచి వైసీపీకి మొత్తం 422 కోట్ల 63 లక్షల రూపాయల విరాళాలు వచ్చాయి. అందులో ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ (Future Gaming and Hotel Services) ఒక్క కంపెనీ ద్వారానే అత్యధికంగా 162 కోట్లు అందాయి. అంటే ఫ్యూచర్‌ గేమింగ్‌ సంస్థ ఇచ్చిన విరాళాలను మినహాయించి, ఇతర కంపెనీలు ఇచ్చిన వాటిలో 42.11 శాతం మేర విద్యుత్‌ ప్రాజెక్టులు పొందిన సంస్థలు, కంపెనీల నుంచే వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పార్టీకి అందాయి.

ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వడంలో సెలక్షన్ వద్దు- అప్పట్లోగా మొత్తం సమాచారం అందించాల్సిందే'

ఒక్క యూనిట్‌ కూడా రాష్ట్ర అవసరాలకు అందదు: రాష్ట్రంలో 30 వేల 826 మెగావాట్ల మేర సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. వీటికి కనీసం లక్ష ఎకరాల భూమి అవసరమని అంచనా. వాటి ద్వారా వచ్చే విద్యుత్‌లో ఒక్క యూనిట్‌ కూడా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర అవసరాలకు అందదు. విద్యుత్‌ ఎగుమతి విధానం-2020 (Andhra Pradesh Renewable Energy Export Policy) కింద ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వాటితో డిస్కంలు పీపీఏలు కుదుర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే రాష్ట్రంలోని భూములను వాడుకుంటూ, ఉత్పత్తి చేసే విద్యుత్తు ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది.

మన నెట్‌వర్క్‌ను వాడుకుంటూ ఒక్క యూనిట్‌ విద్యుత్తు కూడా రాష్ట్రానికి ఇవ్వనప్పుడు వేల మెగావాట్ల ప్రాజెక్టులు ఉండీ ఉపయోగం ఏంటనేది ప్రశ్నార్థకం. ఏటా మెగావాట్‌కు లక్ష రూపాయల వంతున గ్రీన్‌ ట్యాక్స్‌ మాత్రమే ప్రభుత్వానికి వస్తుంది. ప్రాజెక్టుల ఏర్పాటుకు లక్ష ఎకరాల భూమి ఇచ్చినందుకు వచ్చే ప్రయోజనం ఇదొక్కటే. ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన కంపెనీలు మాత్రం భారీగా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతాయి. వీటికి లీజు విధానంలో 30 ఏళ్ల పాటు భూములను ప్రభుత్వం ఇవ్వనుంది. దీనికి ప్రతిఫలంగా కంపెనీలు వైసీపీకి ఎన్నికల బాండ్ల రూపంలో సొమ్ములు ఇచ్చాయి. ఇదే అసలైన క్విడ్‌ప్రోకో.

లాటరీ కింగ్​ నుంచి డీఎంకేకు రూ.509కోట్లు- బీజేపీకి బాండ్ల ద్వారా రూ.6,986కోట్లు

గ్రీన్‌కో సంస్థకు కర్నూలు , నంద్యాల జిల్లాల్లో 15 వందల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు జగన్‌ ప్రభుత్వం గత నెలలో అనుమతిచ్చింది. ఆ సంస్థకు ఇప్పటికే కర్నూలు జిల్లాలోని పిన్నాపురం దగ్గర 5వేల 230 మెగావాట్ల పవన, సౌర, పీఎస్పీ ఏర్పాటుకు 4వేల 766 ఎకరాలను సర్కారు కేటాయించింది. ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా 2022 మే 17న సీఎం జగన్‌ పైలాన్‌ ఆవిష్కరించే వరకూ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆ సంస్థ సీఈవో చలమలశెట్టి అనీల్‌ సోదరుడు సునీల్‌ కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. వారి కుటుంబానికి చెందిన గ్రీన్‌కో సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు కలిపి వైసీపీకి 10 కోట్లు బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చాయి.

మేఘా ఇంజినీరింగ్ వైసీపీకి ఇచ్చిన విరాళం: 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టుతో పాటు అనేక పనులు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ వైసీపీకి ఇచ్చిన విరాళం 37 కోట్లు. ఈ సంస్థకు ఇటీవల 12 వేల 264.36 కోట్లతో ప్రతిపాదించిన ఎగువ సీలేరు పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్రాజెక్టును ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ పనులను టెండరు విలువపై 9.87 శాతం అధిక మొత్తాన్ని ఇచ్చింది. దీనివల్ల ఖజానాపై 663 కోట్ల అదనపు భారం పడుతుంది. ఎన్నికల ప్రకటన వెలువడటానికి కొద్ది రోజుల ముందు లెటర్‌ ఆఫ్‌ అవార్డును ప్రభుత్వం ఇచ్చింది. గతంలోనే 5వేల 200 కోట్ల రూపాయల విలువైన మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనులు మేఘాకే ప్రభుత్వం అప్పగించింది.

ప్రాంతీయ పార్టీలకు రూ.5వేల కోట్ల విరాళాలు- బీజేపీ కన్నా రూ.839 కోట్లే తక్కువ!

శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 3వేల 350 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ సంస్థకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వైఎస్సార్ జిల్లా చక్రాయపేటలో 400 మెగావాట్లు, అలాగే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 171.60 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుతిచ్చింది. కర్నూలు జిల్లా జలదుర్గంలో 102.30 మెగావాట్లు, నంద్యాల జిల్లా అవుకు దగ్గర 69.30 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కీలకమైన ఇనుప ఖనిజ లీజులు, ప్రాజెక్టులను జగన్‌ సర్కారు జిందాల్‌కు కట్టబెట్టింది.

సన్నిహిత కంపెనీలు ఒక్క బాండునూ కొనలేదు: జగన్‌కు అత్యంత సన్నిహిత వాటాలున్నాయని ప్రచారం జరుగుతున్న కంపెనీలు కనీసం ఒక్క బాండునూ కొనలేదు. భారీ ప్రాజెక్టులు పొందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్‌ సోలార్, అరబిందో వంటి సంస్థలు కనీసం ఒక్క బాండు కూడా తీసుకోలేదు. కానీ విద్యుత్‌ ప్రాజెక్టులు దక్కించుకున్న చిన్న కంపెనీలు వైసీపీకి తమ వంతుగా బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చి జగన్‌ రుణాన్ని తీర్చుకున్నాయి. వీటిలో ఎక్కువగా దిల్లీ కేంద్రంగా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో నమోదైనవే. వాటికి ప్రాతినిథ్యం వహిస్తున్న కొందరు గ్రీన్‌కో సంస్థలో కూడా డైరెక్టర్లుగా ఉన్నారు.

'ఎలక్టోరల్ బాండ్ల లెక్క ఇదీ!'- సుప్రీంకోర్టులో స్టేట్​ బ్యాంక్ అఫిడవిట్

ఎన్నికల బాండ్ల ద్వారా వైసీపీకి 2019 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 422 కోట్ల 63 లక్షలు విరాళాలుగా రాగా వీటిలో ఏడాదిలోగా వచ్చిన విరాళాలే ఎక్కువ. గత ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 121 కోట్లు అందాయి. అంతకు ముందు అత్యధికంగా 2020 నవంబరు 7వ తేదీన ఒక్క రోజే 89 కోట్ల రూపాయలు అందాయి. 2021 ఏప్రిల్‌ 19న 60 కోట్లు రాగా గత ఏడాది జులై 17న 25 కోట్లు, నవంబరు 17న 20 కోట్లు, డిసెంబరు 2న 34 కోట్లు వివిధ కంపెనీలు, సంస్థల నుంచి విరాళాలుగా వైసీపీకి దక్కాయి.

ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ​- ధారాళంగా రూ.11,671 కోట్ల విరాళాలు- ఏ పార్టీకి ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.