ETV Bharat / state

వైసీపీ పాలనలో అటకెక్కిన పట్టణాభివృద్ధి - ప్రగతి పనులను పట్టించుకోని జగన్​ - NO DEVELOPMENT IN YSRCP REGIME

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 9:37 AM IST

YCP Government Not complete Urban Development Works: వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయాయి. పట్టణాల్లో వృద్ధి చెందుతున్న జనాభాకు వారి అవసరాలు సైతం మౌలిక వసతుల కల్పనలో జగన్‌ సర్కారు శ్రద్ధ చూపలేదు. టీడీపీ హయాంలో చేపట్టిన పనులు పూర్తి చేయకుండా నిలిపేసిన జగన్​ ఇప్పుడు సిద్ధం అంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు.

YCP Government Not complete Urban Development Works
YCP Government Not complete Urban Development Works

వైసీపీ పాలనలో అటకెక్కిన పట్టణాభివృద్ధి- ప్రగతి పనులను పట్టించుకోని జగన్​

YCP Government Not Complete Urban Development Works: సీఎం జగన్‌ చెప్పింది చేయరు. చేయాల్సింది అసలే పూర్తి చేయరు. పట్టణాలను ప్రగతిబాట పట్టించానని, అద్భుతాలు సృష్టించానని బాకాలు ఊదడం మానరు. ప్రజలను మాయమాటలతో ఏమార్చడంలో మహా నేర్పరి. తానిచ్చిన హామీలను నెరవేర్చకున్నా, ప్రజల తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా, ఇరుకు రోడ్లను విస్తరించకున్నా, టీడీపీ హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా, లేశమాత్రమైనా జంకు లేకుండా మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు.

ఇంకా సంవత్సరం కాలేదా మంత్రి గారు? విజయవాడలో అసంపూర్ణంగా పార్క్ పనులు

వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయి. పట్టణాల్లో వృద్ధి చెందుతున్న జనాభాకు అనుగుణంగా వారి అవసరాలు సైతం అంతకంతకూ పెరుగుతున్నా మౌలిక వసతుల కల్పనలో జగన్‌ సర్కారు శ్రద్ధ చూపలేదు. సీఎం స్వయంగా ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. అదే సమయంలో టీడీపీ హయాంలో ప్రారంభించిన ప్రగతి పనులకూ నిధులు ఇవ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేసి రాజకీయ పైశాచిక ఆనందం పొందారు. తాను అధికారంలోకి వచ్చాక ప్రారంభించిన అరకొర పనులకూ బిల్లులు చెల్లించకుండా పట్టణాభివృద్ధికి పాడెకట్టారు. ఇంతకంటే బాధ్యతారాహిత్యం ఇంకేం ఉంటుంది. పైగా అభివృద్ధి నమూనాకు ఆద్యుడినంటూ ఇప్పుడు వాడవాడలో డప్పు కొంటుకుంటున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ నగరం అదోగతిపాలైంది. ఎక్కడ చూసినా గుంతలు, గోతులు తప్పితే నిర్మాణాలు చేపట్టలేదు. రూ. 150 కోట్లు అభివృద్ది పనులకు కేటాయిస్తానని చెప్పి రూ. 33 కోట్లు మాత్రమే ఇవ్వడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. వీధిలైట్లు కూడా సరిగ్గా పని చేయట్లేదు. రహదారులపై గుంతలు కూడా వైసీపీ ప్రభుత్వం పూడ్చింది లేదు. కేంద్రం నిధులిస్తే వాటిని జగన్​ సర్కార్​ దుర్వినియోగం చేశారు. - నగర ప్రజలు

నగరాలు, పట్టణాల్లో అసంపూర్తిగా నిలిచిన పనులతో ప్రజలు పడుతున్న అవస్థలు జగన్‌కు కనిపించడం లేదా? అస్మదీయులకు పదవులు కట్టబెట్టడంలో సొంత మనుషులైన గుత్తేదారులకు అడ్డగోలుగా బిల్లులు చెల్లించడంలో చూపించిన శ్రద్ధలో పది శాతం కనబరిచినా పట్టణాల్లో పెండింగ్‌ పనులు పూర్తయ్యేవి. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చేవి. ఆయన ఉదాసీనత కారణంగా ప్రజలు అల్లాడుతున్నారు.

నాడు-నేడు పనుల్లో నాణ్యతా లోపం- పాఠశాలల్లో విద్యార్థుల ఇక్కట్లు - Nadu Nedu Work Incomplete

విజయవాడ నగర పరిధిలోని నియోజకవర్గాల్లో సిమెంట్‌ రోడ్లు, రిటైనింగ్‌ కాలువలు, భూగర్భ మురుగు నీటి వ్యవస్థలతో కలిపి మొత్తం 152 పనులను చేపట్టడానికి స్థానిక ఎమ్మెల్యేలు నిధులు ఇవ్వాలని సీఎం జగన్‌కు విన్నవించారు. దాంతో 2021లో ఒకసారి రూ.100 కోట్లు, మరోసారి రూ.50 కోట్ల 96 లక్షలు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కానీ చేసిన పనులకు రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఫలితంగా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగి చాలావరకు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్నింటికి తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేషన్‌ సాధారణ నిధుల పద్దు నుంచి రూ. 20 కోట్ల వరకు విడుదల చేశారు. బిల్లులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో మిగిలిన పనులను ప్రారంభించేందుకు గుత్తేదారులు సాహసించలేదు.

గుంటూరులో యూజీడీ పనుల కోసం 200 కోట్ల రూపాయలు ఇస్తామని సీఎం జగన్‌ ఇచ్చిన హామీ నీటి మీద రాతగా మిగిలిపోయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చేపట్టిన పనులు అప్పట్లోనే 60 శాతం మేర పూర్తయ్యాయి. వైసీపీ సర్కారు వచ్చాక మిగిలిన పనులను పూర్తి చేయాలని స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు విన్నవించగా నిధులిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చి మాట తప్పారు. ఫలితంగా నగరంలోని శంకర్‌ విలాస్‌ వంతెన విస్తరణ, శ్యామలానగర్‌- నందివెలుగు రోడ్డులో రైలు మార్గంపై వంతెనల పనులు నిలిచిపోయాయి. ఐదు సంవత్సరాలలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో నగరాభివృద్ధిపై సమీక్ష నిర్వహించినా ఫలితం శూన్యం. వర్షాకాలంలో మూడు వంతెనల కింద మురుగునీరు, వర్షపు నీరు కలిసి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దాంతో వాహనాలన్నీ శంకర్‌ విలాస్‌ వంతెన మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది.

ఓ వైపు కట్టడాలు - మరోవైపు పగుళ్లు - పేరేచర్లలో జగనన్న కాలనీ లబ్ధిదారుల ఆవేదన

కర్నూలు జిల్లా ఆదోనిలోని బంగారు బజార్‌ రోడ్డు, పండిట్‌ నెహ్రూ రోడ్డు, తానాజీ , మున్సిపల్‌ రోడ్డు వంటి పది ప్రధాన రహదారుల విస్తరణకు అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు 2022లో విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జగన్‌ రూ.50 కోట్లు ఇస్తామని ప్రకటించి తర్వాత గాలికి వదిలేశారు. ఆయా పనులను చేపట్టడానికి తాజా అంచనాల ప్రకారం రూ.150 కోట్లు అవసరమవుతాయి. కాకినాడలో వివిధ సామాజిక వర్గాల కోసం టీడీపీ హయాంలో ప్రారంభించిన భవనాల పనులకు జగన్‌ నిధులివ్వని కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. డెయిరీ ఫాంలో ప్రైవేట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్ల అసోసియేన్‌ భవనం పనులు శ్లాబ్‌ వరకు వచ్చాక ఆగిపోయాయి. నాయీ బ్రాహ్మణుల భవన నిర్మాణం పునాదుల దశలో నిలిచిపోయింది. కన్నయ్యకాపునగర్‌లో బ్రాహ్మణ సామాజిక భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. గౌడ వర్గానికి రెవెన్యూ కాలనీలో స్థలం కేటాయించి శంకుస్థాపన చేసినా పనులు మొదలుపెట్టలేదు.

నాడు, నేడు పనుల్లో ప్రభుత్వ జాప్యం- శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం

బాపట్లలోని రాజీవ్‌గాంధీ హిందూ శ్మశానవాటికలో టీడీపీ హయాంలో కోటి యాభై లక్షల రూపాయలతో ప్రారంభించిన గ్యాస్‌ ఆధారిత దహన వాటిక పనులు జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలోనే రూ. 60 లక్షలకుపైగా వెచ్చించారు. వైసీపీ సర్కారు వచ్చాక పెండింగ్‌ బిల్లులు చెల్లించని కారణంగా గుత్తేదారులు పనులు నిలిపేశారు. పట్టణంలోని ఉప్పరపాలెంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు పనులు గత ప్రభుత్వ హయాంలోనే 80 శాతం పూర్తయినా నీటిని నింపే పైపులు అనుసంధానించలేదు. చీలురోడ్డు నుంచి ఏబీఎం కాంపౌండ్‌ వరకు రహదారి విస్తరణ పనులు వైసీపీ ప్రభుత్వమే ప్రారంభించినా నిధులు ఇవ్వకుండా అసంపూర్తిగా నిలిపేసింది.

అనంతపురం జిల్లా గుంతకల్లులో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితుల కోసం రూ. 63 లక్షల రూపాయల అంచనాతో అంబేడ్కర్‌ సామాజిక భవన నిర్మాణం ప్రారంభించారు. రూ. 28 లక్షలు ఖర్చయ్యాక వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ జగన్‌ ఆయా బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో పనులు నిలిచిపోయాయి. ఇదే పట్టణంలోని ఎస్సీ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 2018లో రూ.2 కోట్లతో ప్రారంభించిన ఇండోర్‌ స్టేడియం పనులు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పైకప్పు దశలో నిలిచిపోయాయి.

పూర్తి కాని పనులు - అయినా ఆగని ప్రారంభోత్సవాలు - సీఎం బాటలోనే మంత్రులు

చిత్తూరు జిల్లాలో రోజూ పది మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేసే ప్లాంటుకు రూ. 35 లక్షలతో మరమ్మతులు చేసేందుకు అనేక సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారుల నుంచి స్పందన లేదు. ఇదే నగరంలోని కొండమిట్టలో 11 వందల లీటర్ల నీటి సామర్థ్యమున్న ట్యాంకుకు రూ. 26 లక్షలతో మరమ్మతులకు ఏకంగా తొమ్మిదిసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారుల్లో ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాలేదు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్టాండు ఎదురు మలుపు నుంచి ఓవర్‌ బ్రిడ్జి వరకు ప్రధాన కాలువ పనులకు కోటి రూపాయలతో టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదు. జాతీయ రహదారుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో రూ. 75 లక్షలతో కల్వర్టు నిర్మించినా ప్రధాన కాలువ సరిగా లేకపోవడంతో మురుగు ముందుకు పారడంలేదు. చదలవాడ కృష్ణమూర్తి దుకాణం సముదాయం ఎదుట మరో ప్రధాన మురుగు కాలువ పనులకు రూ. 35 లక్షలతో టెండర్లు పిలిచినా ఇప్పటికీ మొదలు కాలేదు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు చేయడానికి గుత్తేదారులు ఆసక్తి చూపట్లేదు.

విజయనగరం జిల్లా బొబ్బిలిలో భైరవసాగరం గట్టు వద్ద 6 వార్డులకు సంబంధించిన శ్మశానవాటిక అభివృద్ధి పనులను అసంపూర్తిగా నిలిపివేశారు. రాణిమల్లమ్మదేవి పార్కు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణాన్ని బిల్లులు అందని కారణంగా గుత్తేదారులు మధ్యలోనే నిలిపేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పైవంతెన సమీపంలో శిథిలావస్థకు చేరిన తాగునీటి రిజర్వాయర్‌ స్థానంలో కొత్తది నిర్మించడానికి మూడు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసినా పనులు పునాదుల దశ దాటలేదు. దీని నిర్మాణానికి మొదట 13వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి కోటి యాభై లక్షలు కేటాయించినా సాంకేతిక సమస్యలతో పనులు ప్రారంభం కాలేదు. తర్వాత సాధారణ నిధుల నుంచి రూ. 3కోట్ల 20లక్షలు ఖర్చు చేయాలన్న పాలకవర్గం తీర్మానంపై పనులకు శంకుస్థాపన చేయగా మూడేళ్ల నుంచి 15 శాతం కూడా పూర్తి కాలేదు

'ఎన్నికల కోడ్ ఎఫెక్ట్' - ఐదేళ్లుగా ఊరించి హడావుడిగా ప్రారంభిస్తున్న వైసీపీ నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.