ETV Bharat / state

ఏపీకి అమరావతే ఏకైక రాజధాని: రాజ్ నాథ్​సింగ్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 7:46 PM IST

Rajnath Singh key comments on AP capital
Rajnath Singh key comments on AP capital

Rajnath Singh key comments on AP capital: ఏపీ రాజధాని అమరావతిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్​సింగ్ కీలక ప్రకటన చేశారు. పీకి రాజధాని ఏదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కొందరు నేతలు సమావేశంలో ప్రస్తావించగా, రాష్ట్ర పార్టీకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇచ్చిందని తెలిపారు. బీజేపీ సైతం అమరావతినే ఏకైక రాజధానిగా పరిగణలోకి తీసుకుందని, ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

Rajnath Singh Key Comments on AP Capital: రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యాలపై గట్టిగా పోరాటం చేసి నిలువరించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రం నుంచి సాగించే ఉద్యమాలు, ఆందోళనల ద్వారా ప్రజల్లోకి పార్టీ బలంగా వెళ్తుందని కర్తవ్యబోధ చేశారు. ప్రధాని ప్రతినిధిగా ప్రతి ఇంటికి వెళ్లి నరేంద్ర మోదీ తరఫున నమస్కారం చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను వారికి వివరించాలని సూచించారు.

ఏపీలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: విజయవాడలోని జీఆర్టీ గ్రాండ్‌ హోటల్‌లో నిర్వహించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో రక్షణ మంత్రి పాల్గొని దిశా నిర్దేశం చేశారు. త్వరలో భారతదేశం ప్రపంచంలోనే గొప్ప ఆర్ధిక వ్యవస్థగా ఎదగబోతోందని రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు. రక్షణ వ్యవహారాల్లో మనం సాధిస్తోన్న పురోగతి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోనూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, ఇది తనకున్న 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని అన్నారు. బీజేపీ మూల సిద్ధాంతం రాజకీయం ఒక్కటే కాదని ప్రజలకు సేవ కూడా తమ లక్ష్యమని తెలిపారు.

బీజేపీ నేతల ఫిర్యాదు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆయుష్మాన్‌భవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకంగా ప్రచారం చేసుకుంటోందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. మొత్తం నిధులు వారే ఇస్తున్నట్లుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ రాజ్‌నాథ్‌సింగ్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇది సరైందని కాదని రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. తాము ఈ విషయంలో ఆందోళన చేస్తున్నామని, కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లామని - ఫలితంగా కేంద్ర ప్రభుత్వ లోగోను ఇటీవలే ఆరోగ్యశ్రీ కార్డులపై వేస్తున్నారని పురందేశ్వరి తెలిపారు. నిర్భయ కింద కేంద్ర ప్రభుత్వం 138 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేటాయించినా మహిళలు, బాలికల రక్షణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం తగిన మౌలిక వసతులు కల్పించలేదని రాజ్‌నాథ్‌సింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద లబ్ధి చేకూర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు తగిన రీతిలో సహకరించడం లేదని తెలిపారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

అమరావతినే ఏకైక రాజధాని: రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇబ్బందులున్నా, పోరాటాల ద్వారానే ప్రజల్లో నిలుస్తామని రక్షణ మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి రాజధాని ఏదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కొందరు ప్రస్తావించగా, రాష్ట్ర పార్టీకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర పార్టీ సైతం అమరావతినే ఏకైక రాజధానిగా పరిగణలోకి తీసుకున్నందున, ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.