ETV Bharat / state

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం - ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య - Three People Commit Suicide

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 9:14 AM IST

Updated : Mar 24, 2024, 7:20 AM IST

Three People Commit Suicide: వైఎస్సార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మూడెకరాల పొలం అమ్ముదామంటే రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించి మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Three_People_Commit_Suicide
Three_People_Commit_Suicide

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం - ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Three People Commit Suicide: వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోకవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. పద్మావతి భర్త సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఘటనాస్థలిలో లభించిన సూసైడ్ నోట్: ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ సైతం లభించింది. మూడెకరాల పొలం అమ్ముదామంటే రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించి మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పొలం శ్రావణి అనే పేరుతో రికార్డుల్లో ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. దీంతో ఏమి చేయలేని స్థితిలో చనిపోతున్నామని కుటుంబసభ్యులు సూసైడ్ నోట్​లో రాశారు.

కర్ణాటకలో విషాదం - ఇద్దరు పిల్లలతో కలిసి మంటల్లో దూకి తల్లి ఆత్మహత్య - Three Were Burned Alive

కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త మాధవరంలో నివాసముంటున్న పాల సుబ్బారావు (47)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె చదువు కోసం హైదరాబాద్ వెళ్లగా, చిన్న కుమార్తె, భార్యతో కలిసి సుబ్బారావు కొత్త మాధవరంలో నివసిస్తున్నారు.

పాల సుబ్బారావుకు ఒంటిమిట్ట మండలం మాధవరంలో 3.10 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి గతంలో ప్రభుత్వం అందించే రైతు భరోసా కూడా సుబ్బారావు ఖాతాలో పడేది. కొద్ది సంవత్సరాల క్రితం తన పేరుతో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు కట్టా శ్రావణి అనే మహిళ పేరుతో ఆన్లైన్లో మార్చారు.

ఈ భూమిని తిరిగి తన పేరుతో మార్చుకోవడానికి పాల సుబ్బారావు రెవిన్యూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం కనిపించలేదు. ఇందుకోసం రెవెన్యూ అధికారులకు ఈయన ముడుపులు ముట్టజెప్పినా కూడా ప్రయోజనం శూన్యం. పొలం అమ్మి పిల్లలకు పెళ్లి చేయడం, అప్పులు తీర్చడం చేయాలనుకుంటే రెవెన్యూ అధికారులు తమ పొలాన్ని వేరొకరి పేరుతో రికార్డులలోకి ఎక్కించారనే మనస్థాపంతోనే తాము చనిపోతున్నట్లు సుబ్బారావు కుటుంబం లేఖలో పేర్కొన్నారు.

కోర్టు బయటే రైతు ఆత్మహత్య - సోదరులతో ఆస్తి తగాదాలే కారణమా ?

తీవ్ర ఆవేదనతో పాల సుబ్బారావు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. భార్య పద్మ, కుమార్తె సైతం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించినట్లు బంధువులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో లభించిన లేఖలో ఈ విషయాలన్నీ పేర్కొన్నారు. ఆ లేఖలో ఎమ్మార్వోకి లంచం ఇచ్చుకోలేక పోతున్నామని కూడా పేర్కొన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడంతో మాధవరంలో విషాదఛాయలు అలముకున్నాయి.

అయితే ఘటనా స్థలంలో తల్లి, కుమార్తె చనిపోయిన దృశ్యాన్ని పరిశీలిస్తే వారి మెడ కింద తాళ్లతో బిగించిన ఆనవాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భర్త సుబ్బారావు వేరే ప్రాంతానికి వెళ్లి రైలు కిందపడి చనిపోవడంపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య - తట్టుకోలేక ప్రియుడి బలవన్మరణం

ఏం సమాధానం చెప్తారు ?: వైకాపా భూబకాసురులతో పోరాడలేక కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరానికి చెందిన సుబ్బారావు, పద్మావతి దంపతులు, వారి కుమార్తె వినయ ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మీ సొంత జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటనకు ఏం సమాధానం చెబుతారు జగన్‌ అని నిలదీశారు. ఎంత క్షోభ ఉంటే ఓ కుటుంబం ఇలా ప్రాణాలు తీసుకుంటుందో మీకు, మీ కబ్జాకోరులకు తెలుసా అని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ప్రశ్నించారు. ‘‘వైకాపా ప్రభుత్వ దాష్టీకానికి చేనేత కుటుంబం బలైందని దుయ్యబట్టారు. రెవెన్యూ సిబ్బంది ద్వారా దస్త్రాల్లో పేర్లు మార్చి వైకాపా నాయకులు చేసిన అధికారిక కబ్జా వారి ఉసురు తీసిందని మండిపడ్డారు. ఈ విషాదం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తోందన్నారు. వారి ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Last Updated : Mar 24, 2024, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.