ETV Bharat / state

మరో జగన్నాటకం- ఈ ఏడాది విద్యుత్ చార్జీలు ఎందుకు పెంచలేదు?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 1:01 PM IST

No Electricity Charges Hike For 2024-25 ఏపీలో విద్యుత్ వినియోగదారులపై జగన్ సర్కార్ కరుణ చూపింది. ఐదేళ్లలో ఏడుసార్లు వేల కోట్ల విద్యుత్‌ చార్జీల భారాన్ని మోపిన వైసీపీ ప్రభుత్వం, ఎన్నికల వేళ ఛార్జీలు పెంచకపోవడంపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల వేళ చార్జీలు పెంచితే తీవ్రవ్యతిరేకత వస్తుందనే భయంతోనే జగన్నాటకానికి తెరతీసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

No_Electricity_Charges_Hike
No_Electricity_Charges_Hike

No Electricity Charges Hike For 2024-25: నాలుగేళ్లు ఎడాపెడా విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చిన జగన్‌ ప్రభుత్వం, ఎన్నికలు ముంచుకొస్తుండటంతో, ఇప్పుడు పేదలపై ప్రేమ కురిపిస్తోంది. విద్యుత్‌ ఛార్జీల భారం వేయకుండా ఉపశమనం కల్పించామంటూ ఉదారత చాటుకుంటోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా ఏదో ఒక పేరుతో వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపింది. ఏప్రిల్‌ వస్తోందంటే చాలు కొత్త విద్యుత్‌ టారిఫ్‌తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి కల్పించింది.

2021 ఏప్రిల్‌ నుంచి విద్యుత్‌ వినియోగంతో సంబంధం లేకుండా కిలోవాట్‌కు 10 రూపాయల వంతున స్థిర ఛార్జీల భారం మోపడంతో మొదలు పెట్టింది. శ్లాబ్‌ల మార్పు, యూనిట్‌ ధర పెంపు ద్వారా 2022 ఏప్రిల్‌ నుంచి భారం మోపడంతో పాటు అదే ఏడాది ఆగస్టు నుంచి ట్రూఅప్, 2023 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకూ ఎఫ్​పీపీసీఏ 1, 2 లను ఒకే బిల్లులో వేసి వినియోగదారులకు షాక్‌లు ఇచ్చింది. ఐదేళ్లలో సుమారు 20 వేల కోట్ల రూపాయల మేర ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపి, వారు స్విచ్‌ వేయాలంటే భయపడే పరిస్థితి కల్పించింది. ఇప్పుడు వచ్చే ఏప్రిల్‌ నుంచి అమలయ్యే కొత్త టారిఫ్‌లో ఎలాంటి ఛార్జీల భారం లేకుండా చేశామని ప్రభుత్వం చెబుతోంది.

ఆలస్యమైన కాలానికి వడ్డీ: వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు ఇచ్చే విద్యుత్‌ సబ్సిడీ చెల్లింపు ఆలస్యమైన కాలానికి వడ్డీ చెల్లించాలన్న రూల్​ను కొత్తగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి అమలయ్యే విద్యుత్‌ టారిఫ్‌ను విజయవాడలో విడుదల చేశారు. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్‌ విధానాల ఆధారంగా డిస్కంలకు రాయితీలు విడుదల చేయడంలో ఆలస్యమైన కాలానికి ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రైల్వేలకు మినహా ఏ ఒక్క కేటగిరీ వినియోగదారులపై ఛార్జీల పెంపు భారం లేకుండా టారిఫ్‌ను రూపొందించినట్లు వివరించారు.

ఐదేళ్లలో ఐదు సార్లు విద్యుత్ చార్జీల పెంపు - పేదలపై ₹4వేల కోట్ల భారం

56 వేల 573 కోట్లు అవసరం: 2024-25 ఆర్థిక సంవత్సరానికి 56 వేల 573 కోట్లు అవసరమని మూడు డిస్కంలు ప్రతిపాదించాయి. ఆ వివరాలను పరిశీలించిన తర్వాత 56 వేల 501 కోట్ల 81 లక్షల రూపాయలకు ఏపీఈఆర్‌సీ అనుమతించింది. డిస్కంల ప్రతిపాదనలకు.. ఏపీఈఆర్‌సీ ఆమోదించిన మొత్తాలకు మధ్య 71 కోట్ల 22 లక్షల రూపాయల వ్యత్యాసం ఉంది. ఈ ప్రకారం వినియోగదారులకు ఇచ్చే టారిఫ్‌ రాయితీలు కాకుండా డిస్కంల ఆదాయ అంతరం 13,624 కోట్ల 67 లక్షలుగా ఉంది.

వినియోగదారులకు ఇచ్చే టారిఫ్‌ రాయితీలు 16 వందల 74 కోట్ల 51 లక్షలు కలిపితే డిస్కంల ఆదాయ తేడా 15 వేల 299 కోట్ల 18 లక్షలకు చేరుతుంది. ఇందులో ఎల్‌టీ కేటగిరి-1 గృహ విద్యుత్‌ వినియోగదారులకు 3 వేల 194 కోట్ల 57 లక్షలు, కేటగిరి-5 ఎల్‌టీ వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందించే ఉచిత విద్యుత్‌ కింద 9 వేల 242 కోట్ల 94 లక్షలు, ఆక్వా, పశుసంవర్థక రంగాలకు 13 వందల 20 కోట్ల 27 లక్షలు, ఇతర వర్గాలకు 12 కోట్ల 6 లక్షలు రాయితీగా అందుతుంది.

ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఎస్సీలకు 634 కోట్లు, ఎస్టీలకు 143 కోట్ల 34 లక్షలు, ఆక్వా రైతులకు 738 కోట్లు, చేనేత, సెలూన్లు, బీపీఎల్‌ పరిధిలోకి వచ్చే రజకులు, స్వర్ణకారులకు కలిపి 14 కోట్లు కలిపి మొత్తం 15 వందల 29 కోట్ల 34 లక్షల రూపాయల రాయితీని ప్రభుత్వం భరిస్తుంది. రాబోయే సంవత్సరానికి మొత్తం 13 వేల 589 కోట్ల 18 లక్షల సబ్సిడీ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల విద్యుత్‌ వినియోగదారులకు ఛార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుత సంవత్సరం 10 వేల 135 కోట్ల 22 లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరించింది.

వేసవి రాక ముందే మొదలైన కరెంటు కష్టాలు - మరోవైపు గిర్రున తిరుగుతున్న స్మార్ట్‌ మీటర్లు

రైల్వేలపై ఛార్జీల భారం: వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏటా ఏదో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఛార్జీల భారాన్ని వేయడం సర్వసాధారణంగా మారింది. వచ్చే ఏడాది రైల్వేలపై ఛార్జీల భారాన్ని ప్రభుత్వం మోపనుంది. రైల్వేలకు యూనిట్‌కు ఐదున్నర రూపాయల నుంచి ఆరున్నరకి పెంచింది. దీనివల్ల సుమారు 100 కోట్లు అదనపు ఆదాయం డిస్కంలకు చేకూరుతుంది.

కొంత మేర ఉపశమనం: సగ్గుబియ్యం తయారీ మిల్లులు, పౌల్ట్రీలకు ఏపీఈఆర్‌సీ కొంత మేర ఉపశమనం కల్పించింది. సగ్గు బియ్యం మిల్లులను సీజనల్‌ పరిశ్రమల విభాగంలో చేర్చి ఆ మేరకు టారిఫ్‌ను వర్తింపజేస్తారు. పౌల్ట్రీకి అనుబంధంగా ఉన్న కార్యాలయం, సిబ్బంది క్వార్టర్లలో వినియోగించే విద్యుత్‌కు కూడా కలిపి ఛార్జీలను వసూలు చేయడం వల్ల వారిపై టారిఫ్‌ భారం ఎక్కువగా ఉంది. ఈ దృష్ట్యా పౌల్ట్రీ క్షేత్రాల్లో వినియోగించే విద్యుత్తులో 5% వరకు కార్యాలయం, క్వార్టర్ల వినియోగంలా పరిగణించి బిల్లింగ్‌ చేసేలా నిర్ణయించారు. అదే విధంగా క్యాప్టివ్‌ విద్యుత్‌ కేంద్రాల్లో స్థానికంగా ఉన్న లోడ్‌ ఆధారంగా గ్రిడ్‌ సపోర్ట్‌ ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు.

గ్రీన్‌ ఎనర్జీ టారిఫ్‌ ప్రీమియంను యూనిట్‌కు 75 పైసల నుంచి ఒక రూపాయికి పెంచాలని డిస్కంలు ఏఆర్‌ఆర్‌లో చేసిన ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించింది. విద్యుత్‌ ఛార్జింగ్‌ కేంద్రాలకు ప్రస్తుతం ఇస్తున్న విద్యుత్‌ సేవా ఖర్చు పెంచాలన్నప్రతిపాదననూ అంగీకరించలేదు. సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌ తయారీ పరిశ్రమ కోసం కొత్తగా హెచ్‌టి-3(సి) ఎనర్జీ ఇంటెన్సివ్‌ ఇండస్ట్రీస్‌లో ప్రత్యేక ఉప కేటగిరి ఏర్పాటు చేసి.. తక్కువ ధరకు విద్యుత్‌ అందించాలన్న డిస్కంల ప్రతిపాదనను మండలి తిరస్కరించింది.

Power Charges Increase In State: విద్యుత్‌ వినియోగదారులపై బాంబు..వైసీపీ పాలనలో ప్రజలపై రూ.వేల కోట్ల విద్యుత్‌ భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.