ETV Bharat / state

భారత్‌ నుంచి ఒకే ఒక్కడు - హార్వర్డ్‌ మెచ్చిన తెలుగు తేజం - ప్రపంచవ్యాప్తంగా 16 మందికే ఈ అవకాశం - narisetti akshay AI program

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 9:18 AM IST

Narisetti Akshay Selected for AI Resident Program
Narisetti Akshay Selected for AI Resident Program(ETV BHARAT)

Narisetti Akshay Selected for AI Resident Program: ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ విశ్వ విద్యాలయం, ప్రఖ్యాత మసాచ్యుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (MIT) కలిసి నిర్వహించేదే ఏఐ రెసిడెంట్‌ ప్రోగ్రాం. మానవ భవిష్యత్తు గమనాన్ని మార్చగల ఆవిష్కరణలు చేయడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశం. అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. అలాంటి అరుదైన ఈ ప్రాజెక్టుకి తెలుగు యువకుడు నారిశెట్టి అక్షయ్‌ ఎంపికయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా 16 మందికే ఈ అవకాశం దక్కగా, అందులో భారత్‌ నుంచి ఒకే ఒక్కడిగా అక్షయ్ నిలిచాడు.

Narisetti Akshay Selected for AI Resident Program: మనం ఔనన్నా కాదన్నా భవిష్యత్తులో మానవాళిపై అత్యంత ప్రభావం చూపనుంది కృత్రిమ మేధస్సు (Artificial Intelligence). ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని అందరికన్నా ముందుండాలని తొందరపడుతున్నాయి చాలా దేశాలూ, అదే విధంగా సాంకేతిక సంస్థలు. ఈ పోటీతోనే హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, ఎంఐటీలు (Massachusetts Institute of Technology) ‘వేరబుల్‌ టెక్నాలజీ రెసిడెంట్‌ ప్రోగ్రామ్‌’కి తెర తీశాయి.

దైనందిన జీవితంలో మనుషులు ధరించే గ్యాడ్జెట్లలో కృత్రిమ మేధస్సును జొప్పించి, వాళ్ల ఆలోచనలు, భావోద్వేగాలను సైతం నియంత్రించగలిగేలా సాంకేతికను అభివృద్ధి చేయడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశం. ఇది అమెరికాలోని ఎంఐటీ మీడియా ల్యాబ్‌, హార్వర్డ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌లో 3 నెలలు కొనసాగనుంది. ఎంపికైనవారు తమ తెలివికి పదును పెట్టేలా ఇక్కడ పరిశోధనలు చేయాలి. వీళ్లు తయారు చేసిన వేరబుల్‌ బయో ట్రాకర్‌, న్యూరల్‌ ఇంపల్సెస్‌ చిప్స్‌, బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్ఫేస్​ని వేరబుల్‌ గ్యాడ్జెట్స్‌లో అమర్చుతారు.

ఇవి కాళ్లూ, చేతులు, చూపు, మాట లేని వాళ్లు ధరించినా మెదడులోని ఆలోచనల్ని చదివి ఆ సమాచారాన్ని అందిస్తాయి. ఈ పరిశోధనల్లో సలహాలు ఇచ్చేందుకు, సందేహాలను తీర్చేందుకు 2 విద్యాసంస్థల్లోని సీనియర్‌ పరిశోధకులు, అధ్యాపకులు రెడీ ఉంటారు. గతంలో ఇక్కడ ప్రోగ్రామ్‌ పూర్తి చేసిన వాళ్లకు పరిశోధకులుగా చాలా అవకాశాలు దక్కాయి. మెటా, గూగుల్‌ డీప్‌మైండ్‌లాంటి పెద్ద కంపెనీల్లో భారీ వేతనంతో ముఖ్యమైన స్థాయిల్లో చేరారు. చేసిన ఇన్వెన్షన్స్ ఆధారంగా వందల కోట్ల రూపాయల పెట్టుబడులు దక్కించుకొని అంకుర సంస్థల్ని సైతం ప్రారంభించిన వారు కూడా ఉన్నారు.

'ఆ ఓటమి వల్లే ఇప్పుడు గెలిచాను' : ఫిడే క్యాండిడేట్స్ విజేత గుకేశ్ - Fide Candidates 2024 winner

మొదట్లో సాదాసీదా విద్యార్థిగా: 25 సంవత్సరాలకో ప్రపంచ యవనికపై ప్రతిభ చూపిస్తున్న అక్షయ్‌ మొదట్లో సాదాసీదా విద్యార్థినే. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని రావిపాడు తన సొంతూరు. 9వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ల స్కూల్‌కి ఒక ఎలక్ట్రానిక్‌ పరికరం తీసుకొచ్చి ప్రదర్శించారు. తర్వాత దాన్ని ఇంటికి తీసుకెళ్లి, అందులోని కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్లు, ఇతర పరికరాలు బయటకు తీసి సొంతంగా ప్రయోగాలు చేశాడు. యూట్యూబ్‌లో వెతికి, ఆ పరికరాలతో కొన్ని ప్రాజెక్టులను సైతం తయారు చేశాడు. అలా సైన్స్‌, టెక్నాలజీపై అక్షయ్​కి ఆసక్తి మొదలైంది. తర్వాత చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో (SRM University) చేరడం పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అయింది.

అక్కడ టెక్నికల్‌ క్లబ్స్‌లో అటానమస్‌ వెహికల్స్ గురించి తెలుసుకున్నాడు. మొదటి సెమిస్టర్‌లోనే సీ కోడింగ్‌ వంటివి నేర్చుకున్నాడు. అందరి కంటే భిన్నంగా కంప్యూటర్‌లో తెరపై కాకుండా, మైక్రో కంట్రోలర్ల ద్వారా దీనిని రాశాడు. విద్యార్థిగా తను నేర్చుకున్న ప్రతీదీ ఆన్‌లైన్‌ విద్యాసంస్థ యూడెమీలో (Udemy) బోధించేవాడు. ఈ అమితాసక్తి, టెక్నాలజీపై పట్టుతోనే ఇంజినీరింగ్‌ పూర్తయ్యేసరికి గూగుల్‌, భారత్‌ ఎక్స్‌, జేపీమోర్గాన్‌ సహా 7 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ దక్కించుకున్నాడు. భారత్‌ ఎక్స్‌ ఇంటర్న్‌షిప్‌లో అయితే ఏకంగా నెలకు లక్షన్నర రూపాయల వేతనం అందుకున్నాడు. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక ప్రోగ్రామ్‌కి ఎంపికై, దేశం దృష్టిని అక్షయ్ ఆకర్షించాడు.

ఉద్యోగం మానేసి బెస్ట్‌మార్ట్‌ యాప్‌కు రూపకల్పన - అనతికాలంలోనే 2 తెలుగు రాష్ట్రాలకు విస్తరణ - Bestmart App

ఎంపికయ్యాడిలా: ఈ ప్రోగ్రాంకి ఎంపికవడం తేలికైన విషయం కాదు. ముందు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఎవరైనా ఈ రెసిడెన్స్‌ ప్రోగ్రామ్‌కి రికమెండ్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఔత్సాహికులు గతంలో ఏఐ రంగంలో చేసిన పరిశోధనలు, అనుభవం చూసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అక్షయ్‌ ప్రస్తుతం ‘హ్యాకథాన్‌’ అనే ఓపెన్‌సోర్స్‌ ప్రాజెక్టులో ‘ఫ్రెండ్‌’ అనే ఏఐ రికార్డింగ్‌ పరికరం తయారీలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. దీన్ని పెండెంట్‌లా మెడలో వేలాడదీసుకుంటే, రోజంతా మాట్లాడింది రికార్డు చేసి, విశ్లేషించి యాప్‌ ద్వారా ఫోన్‌కి సమాచారాన్ని చేరవేస్తుంది.

ఆ సమాచారాన్ని కావాల్సిన విధంగా సంక్షిప్తంగా సారాంశం రూపంలో అందిస్తుంది. రోగులతో మాట్లాడే వైద్యులు, బోర్డు మీటింగుల్లో పాల్గొనే సీఈవోల్లాంటి వారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని అక్షయ్‌ తెలిపాడు. ఈ ప్రాజెక్టులో పని చేస్తుండగా హార్వర్డ్‌లో సీనియర్‌ పరిశోధకుడిగా ఉన్న దక్షిణకొరియాకు చెందిన యాన్పుతో అక్షయ్‌కి పరిచయం ఏర్పడింది. ఆయన రెఫరెన్స్‌ ద్వారానే ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యాడు.

ఈ హార్వర్డ్‌ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు రంగంలో ప్రతిభ ఉన్న 8 వేల మంది పోటీ పడ్డారు. బీటెక్‌ మొదటి ఏడాదిలోనే ఆన్‌లైన్‌లో కొన్నిరకాల కాంపొనెంట్స్‌ కొనుగోలు చేసి, వాటికి ఆర్డినో, సెన్సర్లు కలిపి సొంతంగా మొబైల్‌ఫోన్‌ను సైతం అక్షయ్ తయారు చేశాడు. ఈ అనుభవంతో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ రాసి నాలుగు వేల రూపాయలలో ఒక రోబోని తయారు చేశాడు. అది ఇరవై ఎత్తుల్లో, ఐదు సెకన్లలో రూబిక్‌ క్యూబ్స్‌ని సాల్వ్‌ చేసేస్తుంది. అక్షయ్‌ రూబిక్‌ క్యూబ్స్‌ని పది సెకన్లలో సాల్వ్‌ చేయగలడు. బీటెక్‌ పూర్తవగానే ఒక మల్టీనేషనల్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో 90 లక్షల రూపాయల వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రముఖ విద్యాసంస్థ జార్జియాటెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో కంప్యూటర్‌ సైన్స్‌ మాస్టర్స్‌ చేయడానికి అక్షయ్ ప్రవేశం పొందాడు.

ఆసియాక్రీడల్లో అదరగొట్టిన విజయవాడ కుర్రాడు - విలువిద్యలో రజతం సాధించిన ధీరజ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.