ETV Bharat / state

చంద్రబాబు అధికారంలోకి రాగానే మహిళల సమస్యలు పరిష్కరిస్తాం: నారా బ్రాహ్మణి - Nara Brahmani meet women workers

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 6:01 PM IST

Nara Brahmani Meet Women Workers: చంద్రబాబు అధికారంలోకి రాగానే మహిళల సమస్యలు పరిష్కరిస్తామని నారా బ్రాహ్మణి హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. యర్రబాలెంలోని సంధ్య స్పైసెస్‌ పరిశ్రమలో మహిళలతో మాట్లాడారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా అక్కడే కేక్‌ కట్‌ చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో మహిళలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

Nara_Brahmani_Meet_Women_Workers
Nara_Brahmani_Meet_Women_Workers

చంద్రబాబు అధికారంలోకి రాగానే మహిళల సమస్యలు పరిష్కరిస్తాం: నారా బ్రాహ్మణి

Nara Brahmani Meet Women Workers: రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా యర్రబాలెం సంధ్య స్పైసెస్‌ కంపెనీని సందర్శించి, పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశం అయ్యారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రోజువారి కూలీ, ఇతర నిత్యావసర ధరలు, కుటుంబ విషయాలను మహిళలను అడిగారు. ఆదాయం పెంపునకు ఎలాంటి మార్గాలు చేపడితే బాగుంటుందని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు హయాంలో తమకు రోజు పని దొరికేదని ఇప్పుడు చాలా కష్టమైపోయింది అన్నారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయి రాజధాని పనులను వేగవంతం చేస్తే తమకు ఉపాధి లభిస్తుందని మహిళలు చెప్పారు. నారా దేవాన్ష్ కంటే చంద్రబాబు యువకుడని బ్రాహ్మణి చెప్పారు. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుని గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరో రెండు నెలల్లో మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారుతాయి: నారా బ్రాహ్మిణి

మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు, లోకేశ్‌ నిరంతరం పరితపిస్తారని బ్రాహ్మణి తెలిపారు. డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, డ్వాక్రా గ్రూపులు ఈ స్థాయికి చేరాయంటే అందుకు చంద్రబాబే కారణమని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్ట మొదటి మహిళా స్పీకర్‌గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చింది చంద్రబాబే అని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులు మహిళ విద్యకు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో ఇటీవల ‘కలలకు రెక్కలు’ అనే కార్యక్రమం ప్రకటించారని అన్నారు. దీని ద్వారా ఎంత పెద్ద చదువుకైనా బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణం లభిస్తుందని చెప్పారు.

ఉమ్మడి ఏపీలో పెద్ద ఎత్తున ఇంజినీరింగ్‌ కళాశాలలు, ప్రొఫెషనల్‌ కోర్సుల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పించారని బ్రాహ్మణి అన్నారు. పేద ప్రజలకు కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకే సూపర్‌-6 పథకాలను ప్రకటించారన్న బ్రాహ్మణి, మహిళల ఆదాయాన్ని పెంచి వారికి ఆర్థికంగా చేయూత అందించాలని నారా లోకేశ్ మంగళగిరిలో స్త్రీశక్తి పథకాన్ని అమలుచేస్తున్నారని తెలిపారు. మంగళగిరి ప్రజల కోసం సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మీరంతా లోకేశ్​ను ఆశీర్వదిస్తే మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందిస్తారని బ్రాహ్మణి తెలిపారు.

ఇది జీవితంలో ఓ మధురమైన ఘట్టం - కొండంత బలాన్నిచ్చింది: లోకేశ్ - Nara Lokesh on Nomination

బ్రాహ్మణితో మహిళలు తమ కష్టాలను పంచుకున్నారు. గతంలో అన్నా క్యాంటీన్‌ ద్వారా రూ.5తో ఆకలి తీరేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక క్యాంటీన్లు ఎత్తేసి తమ పొట్టగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పబ్లిక్‌ టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, రోడ్లన్నీ అధ్వానంగా మారడంతో అవస్థలు పడుతున్నామని అన్నారు. గత ఐదేళ్లుగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, విద్యుత్‌ బిల్లులు రెట్టింపయ్యాయని మహిళలు తెలిపారు.

చాలీ చాలని ఆదాయంతో ఇంటిల్లిపాది పనిచేసినా ఇల్లు గడవడం కష్టంగా ఉందని మహిళలు తెలిపారు. గతంలో రాజధాని పనులు జరిగే సమయంలో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజధాని పనులు నిలిపివేయడం, కౌలు కూడా ఇవ్వకపోవడంతో రైతులు సైతం కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని బ్రాహ్మణి ఎదుట మహిళా కూలీలు వాపోయారు. అందరికీ అండగా నిలిచేందుకే సూపర్‌-6 పథకాలను ప్రకటించారని నారా బ్రాహ్మణి తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి పేదల ఆకలి తీరుస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే, నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని బ్రాహ్మణి భరోసా ఇచ్చారు.

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా - ప్రజల గుండెల్లో స్థానమే నా ఆశయం: చంద్రబాబు - Chandrababu Naidu Meeting women

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.