నేడు తెలంగాణ భవన్‌కు కేసీఆర్ - ఘనస్వాగతం పలికేందుకు శ్రేణుల ఏర్పాట్లు

author img

By ETV Bharat Telangana Desk

Published : Feb 6, 2024, 10:26 AM IST

Kcr

KCR To Telangana Bhavan Today : భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌కు రానున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంత జిల్లాల నాయకులతో సమావేశం కానున్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయంలో పోరాటానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్, నల్గొండ వేదికగా కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ అంశంతో పాటు లోక్‌సభ ఎన్నికలు, బడ్జెట్ సమావేశాల విషయమై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

KCR To Telangana Bhavan Today : మూడు నెలల విరామం తర్వాత భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ (KCR) హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు ఈరోజు రానున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు నేతల చేరికల సందర్భంగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కిందపడడంతో తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. కోలుకున్న ఆయన ఎమ్మెల్యేగా కూడా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా నేడు తెలంగాణ భవన్‌కు రానున్నారు.

EX CM KCR Address BRS Cadre Today : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఔట్ లెట్ల అప్పగింత అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. తెలంగాణలో సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయని, జల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇక్కట్లు వస్తాయని అంటోంది. కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు అప్పగించలేదని చెబుతోంది. కానీ ఇప్పుడు సర్కార్ అనాలోచిత వైఖరి వల్ల కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆక్షేపిస్తోంది.

కాంగ్రెస్​ 420 హామీలు చూసి జనం మోసపోయారు - చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది : కేటీఆర్

KCR Meeting With BRS Leaders Today : ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో కృష్ణా జలాల (Handover of Projects to Krishna Board) పరిరక్షణ సభ నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన మొదటి బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ఇందుకు సంబంధించి గులాబీ పార్టీ ఇవాళ తెలంగాణ భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలైనా ఉమ్మడి జిల్లాలు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలు హాజరు కానున్నారు. సీనియర్ నేతలు, మండల స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, మాజీలను ఆహ్వానించారు. వారితో భేటీ కానున్న పార్టీ అధినేత కేసీఆర్ తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పోరాటం, ప్రభుత్వంపై ఒత్తిడి సహా తదితరాలపై చర్చించనున్నారు.

కృష్ణా నదీ జలాల వాడకంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది : జగదీశ్​ రెడ్డి

ఇదే సమయంలో గురువారం నుంచి జరగనున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై కూడా నేతలకు కేసీఆర్ సూచనలు చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొమ్మిదిన్నరేళ్ల పాటు పార్టీ అధ్యక్షునితో పాటు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ భవన్‌కు వచ్చిన ఆయన ఇపుడు ప్రతిపక్షనేత హోదాలో మొదటి సారి వస్తున్నారు. కొంత విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి వస్తున్న అధినేతకు స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.

ప్రాజెక్టులపై దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చేందుకు మేం రెడీ - అసెంబ్లీ ఎప్పుడు పెడతారో చెప్పండి : హరీశ్​రావు

ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనం - కాంగ్రెస్​ సర్కార్​పై బీఆర్​ఎస్ నేతల ధ్వజం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.