ETV Bharat / state

'మస్తు షేడ్స్​' - ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా - సీఎం అయ్యాక మరోలా - ఎన్నికల వేళ ఇంకోలా - Jagan Election Campaign 2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 11:01 AM IST

Updated : Apr 19, 2024, 12:39 PM IST

Jagan Election Campaign 2024 : జగన్‌ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ఈవెంట్ల మాదిరిగా పక్కా ప్రణాళికతో జరుగుతాయి. ఎవర్ని కలవాలో, ఏం మాట్లాడాలో ముందే స్క్రిప్టు సిద్ధంగా ఉంటుంది. ఇన్నేళ్లూ ప్యాలెస్‌కే పరిమితమైనా ఎన్నికల వేళ జనాలకు కుచ్చు టోపీ పెట్టడానికి ప్రేమ ఒలకబోస్తున్న వైనం మామయ్య మహా నటనకు అద్ధం పడుతున్నాయి. నటనలో తలలు పండిన వారు సైతం ముక్కున వేలేసుకునేలా సీఎం నటనా కౌశలంపై, ప్రీప్లాన్డ్‌ సన్నివేశాలపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌, ట్రోల్స్‌ చక్కర్లు కొడుతున్నాయి.

jagan_election_campaign
jagan_election_campaign

'మస్తు షేడ్స్​' - ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా - సీఎం అయ్యాక మరోలా - ఎన్నికల వేళ ఇంకోలా

Jagan Election Campaign 2024 : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా సీఎం కుర్చీ వచ్చాక మరోలా, ఇప్పుడు ఎన్నికల వేళ ఇంకోలా ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయి సార్‌ మీలో’ అనిపించే నటనా చాతుర్యంతో జగనన్న అందర్ని సంభ్రమాశ్చర్యాలాకు గురి చేస్తున్నారు. సినిమా రంగంపై కన్ను వెయ్యలేదు కానీ తలలు, బుగ్గలు నిమురుతూ, ముద్దులు పెడుతూ ఆస్కార్​ సైతం చిన్నబోయే కౌశలం ఆయనది. అధికారం అయిదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమై, అయిన వారికే మేలు చేసి, ప్రజలకు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచి ఇప్పుడు ఎన్నికల ముంగిట తూ.చ. తప్పకుండా, మడమ తిప్పకుండా ఐప్యాక్‌ స్క్రిప్ట్‌ ప్రకారం రకరకాల హవభావాలను ప్రదర్శిస్తూ ‘ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంటి సార్‌’ అనేలా కరుణ రసాన్ని పారిస్తూ డ్రామాలు చేస్తున్న నట సౌధమే జగన్‌!

సీన్​1 : జగన్‌ కాన్వాయ్‌ ఝుమ్మంటూ వెళ్తుంటే తెల్ల చొక్కాలు వేసుకుని నలుగురు యువకులు రోడ్డు పక్కన మోకాళ్లపై నిలబడి, రెండు చేతులు పైకెత్తి నువ్వే మా దేవుడివి అన్నట్టుగా మొక్కుతుంటారు.

సీన్​2 : జగన్‌ బస్సు వస్తుంటే ఎదురుగా మండుటెండలో వైఎస్సార్సీపీ జెండాతో ఒక మహిళ. ఆమెను చూడగానే బస్సు ఆగుతుంది. ఆ బస్సు మెట్లపై జగన్‌ కూర్చుని ఆమెతో మాట్లాడతారు.

ఇవన్నీ ‘మేమంతా సిద్ధం’ పేరిట జగన్‌ సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటిని చూస్తుంటే అంతా ప్లాన్‌ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకు సైతం అర్థమైపోతుంది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ సన్నివేశాలపై మీమ్స్‌ హోరెత్తుతున్నాయి. రోడ్డు పక్కన మోకాళ్లపై నిలబడి, రెండు చేతులు పైకెత్తి నువ్వే మా దేవుడివనే సన్నివేశం తెలంగాణ ఎన్నికల సమయంలోనూ జరిగిందని నెటిజన్లు వెతికి మరీ గుర్తుచేస్తున్నారు. జగన్‌వన్నీ డ్రామాలేననీ ఆ రెండు ఫొటోల్నీ పక్కపక్కనే పెట్టి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.

అపరిచితుడు 1: మీరా పేదల పక్షపాతి? : ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కాన్వాయ్‌ వస్తుంటుంది అత్యాధునిక వసతులన్నీ ఉన్న, బుల్లెట్‌ ప్రూఫ్‌ ఏసీ బస్సులో ముఖ్యమంత్రి ముందు సీటులో కూర్చుని ఉంటారు. ఇంతలో ఒక యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకొని మరీ. వీరాభిమానంతో ఆ బస్సు పక్కనే పరిగెత్తుతాడు. యథాలాపంగా సీఎం జగన్‌ అటుగా చూస్తార. తనకోసం మండుటెండలో పరుగెత్తుకు వస్తున్న ఆ యువకుడు కనిపించగానే ఆయన మనసు చలిస్తుంది. ఇక అంతే ఒక్క కనుసైగతో బస్సు ఆగిపోతుంది. సీఎం లేచి, వాహనం మెట్లు సగం వరకు దిగుతారు, ఆ మెట్లపైనే కూర్చుంటారు. ఆ యువకుడిని ఆప్యాయంగా దగ్గరకు పిలిచి మాట్లాడతారు. చిరు నవ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగుతారు. ఇది ఇప్పుడు జగన్‌ మామయ్య పండిస్తున్న పేదల పక్షపాతి పాత్ర!

ఐదేళ్లు మోసం చేశారు - ఇప్పుడెలా వస్తున్నారు ? - సీఎం జగన్​ను ప్రశ్నిస్తున్న కాకినాడ ప్రజలు - Jagan Not Fulfil Promises to people

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడక ముందు జగన్‌ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఐప్యాక్‌ స్క్రిప్ట్‌ వేరుగా ఉండేది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని, వైద్యసాయం అవసరమైన కొందర్ని ముందే ఎంపిక చేసి, సీఎం దగ్గరకు తీసుకెళ్లేవారు. ఆయన వారితో మాట్లాడి భరోసా ఇచ్చేవారు. సాయంత్రానికి ఆ జిల్లా కలెక్టర్‌ వారికి చెక్కులు అందజేసేవారు. పక్కా వ్యూహం ప్రకారం నలుగురైదుగురికి సాయం చేసి జగన్‌ది ఎంత సున్నిత హృదయమో చూడండంటూ ఊదరగొట్టేవారు. కష్టాల్లో ఉన్నవారికి కచ్చితంగా ప్రభుత్వ భరోసా అందాల్సిందే. కానీ సమాజంలో అలాంటి అభాగ్యులు చాలా మంది ఉన్నప్పుడు, కొందర్ని మాత్రమే ఎంపిక చేసి, సాయమందించి విస్తృతంగా ప్రచారం చేసుకోవడం కేవలం ప్రజల్ని మభ్యపెట్టడమే! అలాంటి వారిని ఆదుకోవడానికి ప్రత్యేకమైన వ్యవస్థ, యంత్రాంగం నిరంతరం పనిచేయాలి. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి కొన్ని వేల మందికి ఆర్థికసాయం అందేది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రోగాలకూ ఒకటే మందన్నట్లుగా ఆరోగ్యశ్రీని చూపిస్తూ, సీఎంఆర్‌ఎఫ్‌ను పూర్తిగా నీరుగార్చేశారు. ఎన్నికల సమయం కావడంతో సీఎం జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన దగ్గరకు కొందర్ని తీసుకొచ్చి, సాయమందించే వ్యూహాన్ని ఐప్యాక్‌ తెరపైకి తెచ్చింది.

అపరిచితుడు 2: ఉన్నానన్నారు గజినీలా మరచిపోయారు : సీఎం బస్సు పక్కనే పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం! వారిలో స్కూల్‌ యూనిఫాం వేసుకున్న ఒక బాలికను కొందరు భుజాలపైకి ఎత్తుకుంటారు. ‘జగన్‌ మామా’ అని పిలుస్తూ ఆ చిన్నారి చేయి ముందుకు చాచగానే బస్సులోని జగన్‌కు వినిపించి బస్సు మెట్లపై నుంచి ముందుకి వంగి ఆమెతో కరచాలనం చేస్తారు.

ఎండకు కమిలిపోయిన ముఖం చెరిగిన జుత్తు నెరసిన గడ్డం. ఇదీ 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ జగన్‌ కనిపించిన తీరు ఇది. జనంలో ఒకరిగా తిరిగారు, భుజంపై చెయ్యేసి నడిచారు, పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడారు. పేదలు పెట్టిన పెరుగన్నం తిన్నారు. కొబ్బరి బొండాం ఇస్తే తాగారు, చిక్కటి చిరునవ్వులు చిందించారు. ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వినతి పత్రాలు స్వీకరించారు. హామీలూ ఇచ్చారు. ఒకే ఒక్క ఛాన్స్‌ ఇమ్మన్నారు. ప్రజల జీవితాల్నే మార్చేస్తానన్నారు. నేను ఉన్నాను, నేను విన్నానంటూ ఊదరగొట్టారు. జనం అది నిజమని నమ్మారు. ‘దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే ఆ మనిషి ఏం చేయాలి? ఈ రోజు ఎంత డబ్బు సంపాదించాం? రేపు ఎంత సంపాదించాలనే దిక్కుమాలిన ఆలోచనతో పనిచేయాలా? లేక దేవుడు ఇలాంటి అవకాశమిచ్చినప్పుడు అసలు రేపు అన్నదే లేదన్నట్టుగా కష్టపడి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలా? మనం చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే కాంక్ష ఉండాలి. ముఖ్యమంత్రి పదవి అంటే అదీ’ అంటూ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు. ఆ తర్వాత ఐదేళ్లూ గజినీలా చెప్పినవన్నీ మరచిపోయారు. అదంతా నటన అనీ, ఆయనకు అవకాశం ఇస్తే జరిగేది విధ్వంసమేననీ ప్రజలు గ్రహించలేకపోయారు. జనాన్ని అంతగా మంత్రముగ్ధుల్ని చేసేలా నమ్మించారు. జగన్‌లోని అపరిచితుడు!

అపరిచితుడు 3 : పరదాల చాటు గడప దాటితే ఒట్టు : భద్రతా సిబ్బంది సీఎం దగ్గరకు వచ్చేవారిని అడ్డుకుంటుంటారు. వెంటనే జగన్‌ వారిని ముందుకు రానివ్వండంటూ పిలుస్తారు. వారితో ఆప్యాయంగా మాట్లాడతారు. ఆ సమయంలో ఆయన విన్యాసాలు, హావభావాలు నభూతో అనే స్థాయిలో ఉంటాయి.

200 ఇచ్చినా, పెట్రోలు కూపన్లు పంచినా - జగన్‌ యాత్రకు 'సిద్ధం'గా లేని జనం - Memantha Siddham Bus Yatra Failed

2019 ఎన్నికల్లోనూ జగన్‌ ఇలాంటి నటనతోనే రక్తికట్టించారు. అధికారంలోకి రాగానే తనలోని అపరిచితుడు బయటికొచ్చాడు. ‘నేను ఉన్నాను, నేను విన్నాను’ కి ‘నేను మరచిపోయాను’ అన్న పదం చేరింది. అధికార పగ్గాలు చేపట్టింది మొదలు ‘నేను తాడేపల్లి ప్యాలెస్‌ వదిలి బయటకు రాను ఎవరి గోడూ వినను’ అన్నది తన విధానంగా మార్చుకున్నారు. కనీవినీ ఎరగని రీతిలో రాజభవనం వంటి తాడేపల్లి ప్యాలెస్‌కి రక్షణ ఏర్పాట్లు చేశారు. దగ్గర్లో ఉన్న పేదల గుడిసెల్ని ఖాళీ చేయించారు. సామాన్యులెవర్నీ దరిదాపులకు రానివ్వలేదు. అలాగని సీఎం వారి దగ్గరకు వెళ్లారా? అంటే అదీ లేదు. మంత్రులు, వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకే ఆయన దర్శనం దుర్లభం. సీఎం కలవాలనుకున్న వారికే లోపలికి అనుమతించేవారు. ఏదైనా పథకానికి బటన్‌ నొక్కేందుకు జిల్లాలకు వెళ్లినా సీఎం కాన్వాయ్‌కి అల్లంత దూరంలోనే ప్రజల్ని ఆపేసేవారు. సీఎంకి ఎవరూ కనిపించకుండా పరదాలు కట్టేవారు. దగ్గరకు రాకుండా బారికేడ్‌లు పెట్టేవారు. సీఎం ఎక్కడికి వెళితే అక్కడ వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసేయించేవారు. విద్యా సంస్థలకు సెలవులిచ్చేసేవారు. చెట్లనూ కొట్టేసేవారు. ఇంతా చేసి వాహనంలోంచి నమస్కారంతో సరిపెట్టి పలాయనం చిత్తగించేవారు. పోనీ సచివాలయానికైనా వెళ్లేవారా అంటే అదీ లేదు. మూడు నాలుగు నెలలకోసారి మంత్రివర్గ సమావేశానికి హాజరై, అది ముగిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్లిపోయేవారు. ప్రజల్ని కలవడం, వారి బాధలు వినడం, వినతులు స్వీకరించడం ఉండవు.

అంత జరుగుతున్నా స్పందించలేదు : వైఎస్‌.రాజశేఖరరెడ్డి సహా గతంలో ఉన్న ముఖ్యమంత్రులంతా వారి వెసులుబాటుని బట్టి ప్రజల్ని నేరుగా కలిసేందుకు, వారి సమస్యలను వినేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించేవారు. ప్రజా దర్బార్లు నిర్వహించేవారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి అప్పటికప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం ప్రకటించేవారు. సచివాలయమైనా, సీఎం క్యాంప్‌ కార్యాలయమైనా ఫలానా సమయానికి అక్కడికి వెళితే ముఖ్యమంత్రి గానీ, అధికారులు గానీ తమ గోడు వింటారన్న భరోసా అప్పుడు ప్రజల్లో ఉండేది. ప్రజల వినతుల్ని పర్యవేక్షించి, పరిష్కరించే విధానం ఉండేది. ప్రజల నుంచి వినతులు స్వీకరించడమనేది జగన్‌ పాలనలో ఒక ప్రహసనంలా మారింది. వినతులు స్వీకరించే ప్రక్రియ అత్యంత మొక్కుబడిగా సాగింది. పోలీసులు సవాలక్ష ప్రశ్నలు వేశాకే సమస్యలతో వచ్చిన వారిని క్యాంప్‌ ఆఫీసు దగ్గరకు పంపేవారు. అక్కడో అధికారి ఆ వినతులు తీసుకునేవారు. కాకినాడ జిల్లాకు చెందిన ఓ మహిళ నడవలేని స్థితిలో ఉన్న కుమార్తె వైద్యానికి సాయం కావాలని క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గరే ఆత్మహత్యకు యత్నించినా సీఎం స్పందించలేదు. ఎన్నికల ముందు జనంతో మమేకమై జగన్‌ పండిస్తున్న ‘పేదల పక్షపాతి’ పాత్రకు పూర్తి భిన్నమైన పెత్తందారు పాత్ర. జగన్‌ నిజ స్వరూపం, ఆయన నైజానికి అద్దం పట్టే సిసలైన పాత్ర ఇదే!

పేదలపై ప్రేమ ఇదేనా? : ఇప్పుడు జగన్‌ ప్రదర్శిస్తున్న కరుణామయ హృదయం ఈ అయిదేళ్లు ఏమైందో ఇంతకాలం పేదల కష్టాలు ఎందుకు పట్టలేదో, ఇన్నేళ్లూ పరదాల చాటున ప్రజల్లోకి వచ్చిన సీఎంకి, వారిని కలవడానికే ఇష్టపడని వ్యక్తికి ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ జనాలు గుర్తొచ్చారా? అందుకే ఇంత ప్రేమను ఒలకబోస్తున్నారా? అనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. జగన్‌ చిక్కటి చిరునవ్వులు నిజమైనవే అయితే ఎన్నికల ప్రచార సభల పేరుతో ప్రజల్ని ఎందుకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ప్రశ్నలు వేస్తున్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన సభకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ ఒక్క గుంటూరు డిపో నుంచే 200 బస్సులు కేటాయించింది. బస్సుల్లేక వృద్ధులు, రోగులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఒకవైపు ప్రజలను అష్టకష్టాలు పెడుతూ.. మరోవైపు వారిపై ఎక్కడలేని ప్రేమ కురిపించడం జగన్‌ ద్వంద్వ మనస్తత్వానికి అద్దం పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘నవరత్నాల’తో మురిపిస్తామంటూ మాయమాటలు - పింఛన్​ తొలగించి పేదలకు వంచన - Jagan Conditions on Pensions

Last Updated :Apr 19, 2024, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.