Illegal Construction Demolition In Warangal : వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ప్రభుత్వం హయాంలో యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టిన భవనాలను గుర్తించిన అధికారులు ముందస్తుగా యజమానులకు నోటీసులు జారీచేశారు. నోటీసులకు స్పందించని యజమానులపై ఉక్కుపాదం మోపుతూ అక్రమ నిర్మాణాలను జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాలను కూల్చివేయగా రోడ్డును ఆక్రమించి నిర్మించిన చిన్న, పెద్ద దుకాణాలను సైతం తొలగించారు.
"ఎలాంటి సమాచారం లేకుండా భవనాలు కూలగొడుతున్నారు. మేము బ్యాంకు నుంచి 12 లక్షలు అప్పుతీసుకొని షాపు పెట్టుకున్నాం. ఈ షాపు కూల్చివేతతో అప్పుచేసి వ్యాపారం పెట్టిన మేము రోడ్డున పడ్డాం. మాకు న్యాయం చేయాలి. ప్రభుత్వం స్పందించి ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకోవాలి." - షాపు యజమాని
GWMC Officers Demolish Illegal Construction : బల్దియా అధికారులు తీసుకున్న నిర్ణయంతో కబ్జాదారుల్లో భయం మొదలైంది. భవనాలు అద్దెకు తీసుకుని వ్యాపారాలు చేస్తున్న వర్తకులు తమకు కూల్చివేతపై సమాచారం తెలియదంటున్నారు. భవన యజమానులు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారని తెలిపారు. కూల్చివేతలతో అప్పుచేసి వ్యాపారాలు పెట్టిన తాము రోడ్డున పడ్డామని వాపోతున్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత
వరంగల్ చౌరస్తాలోని ఓ వస్త్ర దుకాణాన్ని బల్దియా సిబ్బంది కూల్చివేశారు. బీఆర్ఎస్ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో దుకాణ సముదాయాలను గుర్తించి తొలగించారు. హనుమకొండ, వరంగల్ ప్రధాన రహదారి ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించి వ్యాపారులను హెచ్చరించారు.
అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం
"చెరువు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన కట్టడాలను కమిషనర్ ఆదేశాల మేరకు తొలగించడం జరిగింది. బీఆర్ఎస్ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో దుకాణ సముదాయాలను గుర్తించి కూల్చివేశాం. కొంత మంది చెరువులు కబ్జా చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దాని వల్ల చాలా నష్టం జరుగుతోంది. అందుకే అలాంటి అక్రమ నిర్మాణాలను తొలగించాం." - అధికారులు
GWMC Officers Demolish Illegal Construction : రంగశాయిపేట శివారు పుల్లయ్యకుంట చెరువును కబ్జా చేసి నూతనంగా ఏర్పాటు చేసిన దుకాణాల తొలగింపు ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ నాయకుల అండదండలతో ఇష్టానుసారంగా నిర్మించిన భవంతులను కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ మహా నగరపాలక కమిషనర్ షేక్ రిజ్వానా భాష ఆదేశాల మేరకు మాత్రమే అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నామని బల్దియా అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ భవనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం శుభ పరిణామమని ఓరుగల్లు వాసులు అంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతున్నారు.
చిక్కుల్లో నటుడు ప్రకాశ్ రాజ్.. అక్రమ నిర్మాణాలపై రైతుల ఆగ్రహం.. భవనాల కూల్చివేతకు డిమాండ్
హరియాణాలో మళ్లీ 'ఆపరేషన్ బుల్డోజర్'.. అనేక షాప్‌లు కూల్చివేత.. దుకాణదారులు పరార్