ETV Bharat / state

విద్యుత్ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు- అన్నదాతకు తలకుమించిన పెట్టుబడులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 7:56 AM IST

Farmers Problems with Electricity Low Voltage: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది అన్నదాతల పరిస్థితి. ఓ సారి తుపాను కారణంగా పంట మొత్తం తుడిచిపెట్టుకుపోతే అప్పులు చేసి మరీ మరోసారి పంటలు వేసిన రైతును ఈ సారి విద్యుత్ సమస్య వేధిస్తోంది.

Farmers_Problems_with_Electricity_Low_Voltage
Farmers_Problems_with_Electricity_Low_Voltage

Farmers Problems with Electricity Low Voltage: ఏలూరు జిల్లాలోని మెట్ట మండలాల్లో విద్యుత్ లో వోల్టేజీ సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తోంది. విద్యుత్ వినియోగం పెరగడంతో పలు మండలాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగడంలేదు. పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్న ప్రభుత్వ హామీ ఎక్కడా అమలు కావడంలేదు. కొన్ని చోట్ల 9 గంటల విద్యుత్​ను కుదించి 6 నుంచి 7 గంటలు మాత్రమే ఇస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

అది కూడా షెడ్యూల్ ప్రకారం కాకుండా విడతల వారీగా ఇస్తుండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. మెట్ట ప్రాంతాల్లో ముఖ్యంగా వేరుశెనగ, మొక్కజొన్నకు క్రమం తప్పుకుండా తడులు ఇవ్వాల్సి ఉండగా లోడ్ రిలీఫ్ (Load relief) పేరుతో విద్యుత్ కోతలు, విద్యుత్​ లో వోల్టేజీ (low Voltage electricity) తో పంటలు పూర్తి స్థాయిలో తడవడంలేదు.

విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్​దే: మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి

పంట కీలక దశలో "లో వోల్టేజీ" సమస్యతో కళ్లముందే ఎండుతున్న పంటలు ఓ వైపు, కాలిపోతున్న మోటార్లను మరోవైపు చూసి రైతులు గుండెలు బరువెక్కుతున్నాయి. వేలకు వేలు పోసి మోటార్లే మరమ్మతు చేయించాలో లేక పంటకు పెట్టుబడులే పెట్టాలో తెలియక కర్షకులు తలలు పట్టుకుంటున్నారు.

జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో సుమారు 44వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఉండగా ప్రస్తుతం ఇక్కడ పొగాకు, మొక్కజొన్న, వేరుశెనగ, మిర్చి, చెరకు పంటలు పెద్ద మొత్తంలో సాగులో ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య విద్యుత్ సరఫరా చేయాల్సి ఉన్నా అలా జరగడంలేదు. 2 నుంచి 3 గంటలు లోడ్ రిలీఫ్ విధించి దాన్ని రాత్రి వేళల్లో భర్తీ చేస్తుండటంతో అది రైతులకు అక్కరకు రావడంలేదు.

పగటిపూటే విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి ఇప్పుడు కోతలు విధించి రాత్రిపూట ఇస్తే పంటలకు నీళ్లెలా పెట్టుకోవాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులుగా నాణ్యమైన విద్యుత్ సరఫరా రావడంలేదని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం మండలాల్లో విద్యుత్ లో వోల్టేజీ సమస్య అధికంగా ఉంది.

సీఎం సొంత జిల్లాలో కరెంట్​ కష్టాలు - ఎండిపోతున్న పంటలు

విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులతో పాలు పోసుకునే దశలో ఉన్న మొక్కజొన్న (Corn crop) పంటకు నీటి ఎద్దటి ఏర్పడుతోంది. కొయ్యలగూడెం మండలంలోని పలు ప్రాంతాల్లో లో వోల్టోజీ సమస్య కారణంగా మొక్కజొన్న పంట ఎండుతోంది. మరోవైపు నిత్యం తడులు అవసరమైన వేరుశెనగ, మిర్చి పంటలను సైతం నీటి సమస్య వేధిసోతంది. విద్యుత్ లో వోల్టేజీ సమస్యతో మోటార్ల నుంచి వచ్చే నీటి ధారకూడా తగ్గిపోయింది.

సాధారణంగా 350 నుంచి 400వోల్టులు రావాల్సిన విద్యుత్ 200 నుంచి 250కి పడిపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయి. దీంతో పాడైన మోటార్లను బయటకు తీయడం వాటి స్థానంలో కొత్తవి లేదా మరమ్మతులు చేసిన వాటిని ఉంచడం తలకు మించిన భారంగా మారుతోంది. పెరిగిన డిమాండ్ కారణంగా విద్యుత్ లో వోల్టేజ్ సమస్య ఎదురవుతోందని వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చితే సమస్య కొంతవరకు తగ్గుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.

చేతికందే దశలో పంటలు - ఎడాపెడా విద్యుత్ కోతలతో ఆందోళనలో అన్నదాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.