EC Permission to TS Govt on Vice Chancellors 2024 : తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు కొత్త ఉపకులపతుల (వైస్ ఛాన్సలర్ల) నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి ఇచ్చింది. పోలింగ్ ముగిసినందువల్ల ఈ ప్రక్రియను చేపట్టవచ్చని పేర్కొంది. ఈసీ నుంచి అనుమతి రావడంతో వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర సర్కార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
TS Vice Chancellors 2024 : అభ్యర్థుల దరఖాస్తులను సెర్చ్ కమిటీలు పరిశీలించి ఒక్కో విశ్వవిద్యాలయానికి ముగ్గురు ప్రొఫెసర్ల చొప్పున పేర్లను ఎంపిక చేసి, ఆమోదం కోసం తెలంగాణ సర్కార్ ద్వారా గవర్నర్‌కు పంపిస్తాయి. గవర్నర్ ఆమోదించిన తర్వాత, ఉపకులపతుల నియామకాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడతాయి. ప్రస్తుత నెలాఖరులోగా కొత్త వైస్ ఛాన్స్‌లర్లను ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి, నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వివరించారు.
తెలంగాణలోని పది యూనివర్సిటీల ఉపకులపతుల పదవీకాలం ఈ నెల 21తో ముగుస్తోంది. దీని కంటే ముందే కొత్త వీసీల నియామకానికి తెలంగాణ సర్కార్ జనవరి నుంచే కసరత్తు చేపట్టింది. అర్హులైన వారి నుంచి అర్జీలను ఆహ్వానించింది. 312 మంది 1,382 దరఖాస్తులు సమర్పించారు. కొందరు ఒకటికి మించి వైస్ ఛాన్స్‌లర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 208 దరఖాస్తులు, ఉస్మానియా యూనివర్సిటీకి 193, శాతవాహనకు 158, మహాత్మా గాంధీకి 157, కాకతీయకు 149, పాలమూరుకు 159, తెలంగాణ వర్సిటీకి 135, జేఎన్‌టీయూహెచ్‌కు 106, తెలుగు వర్సిటీకి 66, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి 51 అర్జీలు వచ్చాయి.
ఈసీ అనుమతి : అర్జీల స్వీకరణ అనంతరం అభ్యర్థుల గురించి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలంగాణ సర్కార్ సమాచారం సేకరించింది. మార్చిలో కోడ్ అమల్లోకి రావడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు ఉపకులపతుల పదవీకాలం మే 21తో ముగుస్తున్నందువల్ల, కొత్తవారి నియామకాలకు అనుమతించాలని కోరుతూ ఈనెల ఆరంభంలో ఈసీకి ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా, తాజాగా అనుమతి ఇచ్చింది.
దేశంలో ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్.. టాప్ కాలేజీల లిస్ట్ ఇదే
సెర్చ్ కమిటీల ఏర్పాటు : దీంతో ఒక్కో విశ్వవిద్యాలయానికి ముగ్గురితో కూడిన సెర్చ్ కమిటీలను తెలంగాణ సర్కార్ నియమించింది. ఈ కమిటీల్లో ప్రభుత్వ, యూజీసీ ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) నామినీలు ఉంటారు. ప్రభుత్వ నామినీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి, మెంబర్ కన్వీనర్‌గా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉండనున్నారు. అర్జీదారుల బయోడేటాలను సెర్చ్ కమిటీలు పరిశీలించి, వైస్ ఛాన్స్‌లర్‌గా నియామకానికి మూడేసి పేర్లు సూచిస్తాయి. వీసీలుగా నియమితులు కావాలంటే కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలి. లేదా పరిశోధన, అకడమిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పదేళ్ల అనుభవం ఉండాలి. ఉపకులపతులను మూడేళ్ల కాలపరిమితికి నియమిస్తారు. ఈ వారంలోనే సెర్చ్ కమిటీ సమావేశాలు నిర్వహించి, వీసీల ఎంపికకు సిఫార్సులు అందించనున్నాయి.
పకడ్బందీగా ఎంపిక ప్రక్రియ : గతంలో తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ తీరు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కొత్త ఉపకులపతుల నియామకాలను పకడ్బందీగా చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. బుధవారం ఆయన ఉన్నత విద్యామండలిలో విలేకరులతో మాట్లాడారు. ఈసారి ఎలాంటి విమర్శలకు తావులేకుండా అర్హులనే ఎంపిక చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వీసీ పదవికి 70 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి ఉంటుందని, ఇప్పటికే ఈ పదవిని రెండు దఫాలు నిర్వహించినవారు మూడోసారి ఎంపికకు అనర్హులవుతారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశంపై ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఈ నెల 21న వీసీల పదవీకాలం ముగుస్తుందని, ఆ తర్వాత ఇంఛార్జ్‌లను నియమిస్తామని బుర్రా వెంకటేశం వివరించారు.
వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీలకూ : తెలంగాణలో విద్యాశాఖ పరిధిలోని 10 యూనివర్సిటీల ఉపకులపతుల నియామకాలకు ఈసీ అనుమతి మంజూరు చేయడంతో వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్ల ఎంపికకూ మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ మూడు వర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. కొత్తవారి నియామకానికి అర్జీల ప్రక్రియ పూర్తయింది. త్వరలో సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేసి, నియామకాలు చేపట్టే వీలుందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి.