ETV Bharat / state

స్టార్ హోటళ్లకు కిక్ ఇచ్చే న్యూస్ - బార్ల లైసెన్సు ఫీజు భారీగా తగ్గింపు

పర్యాటకం, ఆతిథ్యరంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం

Bar license fee reduction
Bar license fee reduction (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 26, 2025 at 8:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

AP GOVT REDUCED BARS LICENSE FEE: రాష్ట్రంలో త్రీ స్టార్ సహా ఆపై స్థాయి హోటళ్లలో వార్షిక బార్ లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని ప్రభుత్వం భారీగా తగ్గించింది. రూ.66.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు దీన్ని కుదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ హోటల్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తితో పాటు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలను సమీక్షించిన ప్రభుత్వం ఫీజును తగ్గిస్తూ ఆదేశాలిచ్చింది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తగ్గించిన ఫీజులు అమల్లోకి రానున్నాయి.

పర్యాటకంతో పాటు ఆతిథ్యరంగానికి ఊతమిచ్చేలా త్రీస్టార్ హోటళ్లు ఆ పై స్థాయి హోటళ్లలో బార్ల వార్షిక రిజిస్ట్రేషన్ ఛార్జి, లైసెన్సు ఫీజులను తగ్గిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏడాదికి లైసెన్సు ఫీజును రూ.5 లక్షల మేర, నాన్ రిఫండబుల్ ఛార్జీ రూ. 20 లక్షల మేర నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు 2025 సెప్టెంబరు 1 తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులిచ్చారు.

ప్రస్తుతం అమలు చేస్తున్న లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువగా ఉన్నట్టు ఏపీ హోటల్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. దీంతో పాటు పర్యాటకంగా వృద్ధి చేందేందుకు అవకాశాలు, పెట్టుబడి అవకాశాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫుట్​ఫాల్ లాంటి అవకాశాలను అందిపుచ్చుకునేలా భారీగా ఉన్న ఈ ఫీజులను, ఛార్జీలను తగ్గించాలంటూ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.

ఈ ప్రతిపాదనల్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్రప్రభుత్వం వార్షిక లైసెన్సు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను రూ.25 లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు, ఫుట్ ఫాల్ పెరిగేందుకు, రిసార్టులు, హైఎండ్ హోటళ్లకు ప్రోత్సాహం కల్పిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. స్థానిక జనాభాతో సంబంధం లేకుండానే స్టార్ హోటళ్లు ఉన్నచోట ఈ లైసెన్సు ఫీజు, ఛార్జీలు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

స్టార్ హోటళ్లు ఉన్న చోట బార్ లైసెన్సుల జారీకి సంఖ్యాపరంగా ఎలాంటి నియంత్రణా లేదని స్పష్టం చేసింది. 2025 సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అమలు తేదీకి ముందుగా బార్ ఏర్పాటు కోసం ధరఖాస్తు చేస్తే ప్రస్తుతం ఉన్న ఛార్జీలే వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఆగస్టు 31 కాలపరిమితితో గడువు ముగుస్తుందని స్పష్టం చేసింది. ఈమేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

పేరు మీది - షాపులు మావి- లిక్కర్ షాపులు దక్కించుకున్న వ్యాపారులు, నాయకులు