పేరు మీది - షాపులు మావి- లిక్కర్ షాపులు దక్కించుకున్న వ్యాపారులు, నాయకులు
గీత సామాజికవర్గానికి కేటాయించిన మద్యం దుకాణాల్లో సిండికేట్లు - షాపులను దక్కించుకున్న వ్యాపారాలు, ప్రభుత్వ, ప్రతిపక్షాలకు చెందిన నాయకులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 10, 2025 at 11:55 AM IST
SYNDICATES IN LIQUOR SHOPS: గీత సామాజిక వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం మొట్టమొదటిసారి వారికి మద్యం దుకాణాలు కేటాయించింది. వారికి కేటాయించిన మద్యం దుకాణాలను కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి వాటిని సొంతం చేసుకున్నారు. జనాభా రిజర్వేషన్ ప్రాతిపదికన ఎన్టీఆర్ జిల్లాలో 11 షాపులను గీత కార్మికులకు ప్రభుత్వం కేటాయించింది. గొల్లపూడిలోని బీసీ భవన్‌లో గురువారం లాటరీ విధానంలో ఎంతో పారదర్శకంగా వీటిని కేటాయించారు. ఆయా షాపులకు 335 మంది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు.
వారంతా వ్యాపారంలో ఉన్నవారే!: అయితే ఇక్కడే అసలైన మతలబు ఉంది. గీత కార్మికుల పేర్లపై దరఖాస్తులు చేయించిన వారిలో అత్యధిక మంది ఇప్పటికే మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్న వారే ఉన్నారు. మరికొంతమంది ప్రభుత్వ, ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఉన్నారు. వీరందరూ ఒక సిండికేట్‌గా ఏర్పడి ఆయా కులాలకు సంబంధించిన వ్యక్తుల పేరుతో ముందస్తు ఒప్పందాలతో వారితో అప్లై చేయించినట్లు తెలుస్తోంది.
పేరు మాత్రమే మీది: పెట్టుబడి అంతా తామే పెడతామని పేరు మాత్రం మీది అంటూ గీత వర్గాల సభ్యులు, సంఘాలతో దరఖాస్తులు వేయించి షాపులు దక్కించుకున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయానికి తూట్లుపొడిచారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో అప్లికేషన్‌కు 2 లక్షల రూపాయల చొప్పున 11 దుకాణాలకు 335 దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనమని అనుకుంటున్నారు.
లైసెన్స్ ఫీజు తక్కువగా ఉండడంతో ఒక్కో దుకాణానికి సగటున 25కు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం అన్ రిజర్వుడ్ షాపులకు ఆ ప్రాంత జనాభాను బట్టి లైసెన్సు ఫీజు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు వసూలు చేశారు. కానీ గీత వర్గాల షాపులకు మాత్రం రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల మాత్రమే కట్టించుకున్నారు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి గీత కార్మికుల పేరుతో అత్యధిక మంది బినామీలు అప్లికేషన్లు వేసి షాపులను దక్కించుకున్నారు. అధికారులు పారదర్శకంగా దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించినప్పటికీ, ఈ ప్రక్రియలో సిండికేటు సభ్యులు కూడా రావడంతో ప్రభుత్వ ఆశయం నీరుగారి పోయింది.

