ETV Bharat / state

మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారేలా ప్రోత్సాహం - యూనిట్ల విస్తరణ, స్థాపనకు చేయూత

స్వయం సహాయక సంఘాల్లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు - కేంద్ర పథకాల ద్వారా రుణాలు

Government Support to Women as Entrepreneurs
Government Support to Women as Entrepreneurs (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 24, 2025 at 8:39 PM IST

2 Min Read
Choose ETV Bharat

Government Support to Women as Entrepreneurs : ప్రతి కుటుంబంలో ఓ మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి వారికి అవసరమైన సహాయ, సహకారాలు అందించి ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది. కొత్తగా పరిశ్రమ ఏర్పాటు, ఇప్పటికే ఏర్పాటు చేస్తే విస్తరణకు ఆర్థిక సహకారం అందిస్తోంది. స్వయం సహాయక సంఘాల్లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంది. డ్వాక్రా రుణాలతోపాటు కేంద్ర పథకాలైన పీఎంఎఫ్‌ఎంఈ, పీఎంఈజీపీల ద్వారా రుణాలు అందించి ప్రోత్సహిస్తోంది.

రూ.10 లక్షల వరకూ రుణం : రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (PMFME) పథకం ద్వారా సూక్ష్మ, చిన్న తరహా ఆహార శుద్ధి (ప్రాసెసింగ్) సంస్థలకు ఆర్థిక, సాంకేతిక, వ్యాపార మద్దతు ఇస్తోంది. వీటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం చొప్పున నిధులు సమకూరుస్తాయి. ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద 35% (గరిష్ఠంగా రూ.10 లక్షలు) సబ్సిడీపై రుణం అందజేస్తుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ పథకాల ద్వారా పదిమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రుణం తీసుకుని తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. త్వరలో మరో 14 యూనిట్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు డీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు.

Government Support to Women as Entrepreneurs
Government Support to Women as Entrepreneurs (EENADU)

చాక్లెట్ల తయారీ యూనిట్‌ : ఉండి మండలం మహదేవపట్నం గ్రామానికి చెందిన కె.నవ్యశ్రీ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలు. గతంలో బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాన్ని ఇంటి అవసరాలకు వినియోగించుకునే వారు. డీఆర్‌డీఏ అధికారుల ప్రోత్సాహంతో చాక్లెట్‌ తయారీ యూనిట్‌ ప్రారంభించారు. ప్రస్తుతం మార్కెటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈనెల 25, 26 తేదీల్లో దిల్లీలో జరిగే వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా ప్రోగ్రాంలో డీఆర్‌డీఏ తరపున చాక్లెట్‌ స్టాల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు నవ్యశ్రీ తెలిపారు.

Government Support to Women as Entrepreneurs
Government Support to Women as Entrepreneurs (EENADU)

రోటీ మేకింగ్‌ యూనిట్‌ : తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన జి.రమ్యసుధ మూడున్నరేళ్ల క్రితం డ్వాక్రా రుణంతో రోటీ మేకింగ్‌ యూనిట్‌ స్థాపించారు. యూనిట్‌లో తయారు చేసిన పుల్కాలు, చపాతీ, పూరీలను ప్యాకెట్ల రూపంలో తణుకు పట్టణం, గ్రామీణ మండలాల్లో మార్కెటింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం యూనిట్‌ను విస్తరణ కోసం పీఎంఈజీపీలో రూ.10 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

Government Support to Women as Entrepreneurs
Government Support to Women as Entrepreneurs (EENADU)

సోయా పన్నీర్‌ యూనిట్‌ : తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనుకి చెందిన కట్టా శ్రీదేవి ఇటీవల సోయా పన్నీర్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే సోయా పన్నీర్‌ను చాలా మంది కొనుగోలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం పరిసరాల్లో మార్కెటింగ్‌ చేస్తున్నామని, శుభకార్యాలకు ఆర్డర్లపై సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

35 శాతం రాయితీ : " కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎంఎఫ్‌ఎంఈ, పీఎంఈజీపీ పథకాల ద్వారా యూనిట్లు స్థాపించాలనుకునే వారికి డీఆర్‌డీఏ ద్వారా ప్రోత్సాహం అందిస్తాం. ఈ పథకాల కింద రుణం తీసుకున్న వారికి 35 శాతం రాయితీ ఉంటుంది. యూనిట్‌ ఆధారంగా రూ.10 లక్షల వరకూ రుణం ఇచ్చే అవకాశం ఉంది" అని డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ఎస్‌.వేణుగోపాల్‌ తెలిపారు.

పాతకాలపు రుచులు - నూతన ఉపాధి అవకాశాలు

సొంత వ్యాపారానికి పెట్టుబడి కావాలా? మహిళల కోసం టాప్-6 గవర్నమెంట్ స్కీమ్స్ ఇవే!