ETV Bharat / sports

గుజరాత్ అదరహో- గిల్, సుదర్శన్ సెంచరీలు- ఆ రికార్డు సమం! - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 9:26 PM IST

GT vs CSK IPL 2024: అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో చెన్నైపై గుజరాత్ పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్​లో గుజరాత్ ఓపెనర్లు గిల్, సుదర్శన్ సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా గుజరాత్ ప్రత్యర్థి చెన్నై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

GT vs CSK IPL 2024
GT vs CSK IPL 2024 (Source: Associated Press)

GT vs CSK IPL 2024: 2024 ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​తో మ్యాచ్​లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. ఓపెనర్లు శుభ్​మన్ గిల్ (104 పరుగులు, 55 బంతుల్లో; 5x4, 7x6), సాయి సుదర్శన్ (103 పరుగులు, 51బంతుల్లో; 9x4, 6x6) శతకాలతో చెలరేగారు. చెన్నై బౌలర్లను ఈ యువ ఓపెనర్లు ఊచకోత కోశారు. బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. వీరి దెబ్బకు గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 231-3 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్​పాండే 2 వికెట్లు దక్కించుకున్నాడు.

ఆ రికార్డు సమం: ఈ మ్యాచ్​లో ఓపెనర్లు ఇద్దరు కలిసి తొలి వికెట్​కు 17.2 ఓవర్లలో 210 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో ఐపీఎల్​లో అత్యధిక భాగస్వామ్యం లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (210 పరుగులు*) రికార్డును సమం చేశారు. 2022 ఐపీఎల్​లో డికాక్, రాహుల్ కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టుపై అజేయంగా 210 పరుగులు జోడించారు. కాగా, తాజాగా ​గిల్, సుదర్శన్ ఆ రికార్డును సమం చేశారు.

ఐపీఎల్​లో 100వ సెంచరీ: ఈ మ్యాచ్​లో గిల్ శతకంతో ఐపీఎల్​లో 100వ సెంచరీ నమోదైంది. వెంటనే సాయి సుదర్శన్​ కూడా 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. దీంతో ఇప్పటివరకు ఐపీఎల్​లో 101 సెంచరీలు నమోదయ్యాయి. కాగా, ఐపీఎల్​లో గిల్​కు ఇది 4వ శతకం. ఈ లిస్ట్​లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో అందరి కంటే ముందున్నాడు.

వారెవ్వా శార్దూల్: పరుగుల వరద పారిన ఈ ఇన్నింగ్స్​లో చెన్నై బౌలర్ శార్దూల్ ఠాకూర్ గుజరాత్​ను అద్భుతంగా కట్టడి చేశాడు. తన పూర్తి కోటా 4 ఓవర్లలో వికెట్ లేకపోయినా 6.20 ఎకనమీతో కేవలం 25 పరుగులే ఇచ్చుకున్నాడు. చెన్నై బౌలర్లలో తక్కువ ఎకనమీతో పరుగులిచ్చిన బౌలర్ శార్దూలే.

సాయి సుదర్శన్@ 1000: ఈ మ్యాచ్​లో సాయి సుదర్శన ఓ ఘనత అందుకున్నాడు. ఐపీఎల్​లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సుదర్శన్ ఈ ఘనత అందుకోవడానికి 25 ఇన్నింగ్స్​ తీసుకున్నాడు. ఈ క్రమంలో తక్కువ ఇన్నింగ్స్​ల్లో ఈ మార్క్ అందుకున్న మూడో బ్యాటర్​గా నిలిచాడు. ఈ లిస్ట్​లో షాన్ మార్ష్ అందరికంటే ముందున్నాడు. మార్ష్ 21 ఇన్నింగ్స్​ల్లోనే ఈ ఫీట్ సాధించాడు.

ఐపీఎల్​లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్లు.

  • షాన్ మార్ష్- 21 ఇన్నింగ్స్
  • లెండిల్ సిమ్మన్స్- 23 ఇన్నింగ్స్
  • మ్యాథ్యూ హెడెన్- 25 ఇన్నింగ్స్
  • సాయి సుదర్శన్- 25 ఇన్నింగ్స్
  • జానీ బెయిర్​స్టో- 26 ఇన్నింగ్స్

ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటే జట్టుకు అదనపు బలం వచ్చినట్లే :శుభ్‌మన్ గిల్ - Shubman Gill Impact Player Rule

తెవాటియా, గిల్​ మెరుపులు - మ్యాచ్​ విన్నర్​గా గుజరాత్​ - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.