ETV Bharat / spiritual

శనివారం ఈ పరిహారాలు చేస్తే చాలు- శని బాధల నుంచి విముక్తి ఖాయం!

శనివారం ఇలా పరిహారాలు చేస్తే- శని బాధల నుంచి ఉపశమనం తథ్యం!

SHANI DOSHA REMEDIES
SHANI DOSHA REMEDIES (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : March 8, 2025 at 5:31 AM IST

2 Min Read
Choose ETV Bharat

Shani Dosha Remedies : తెలుగు పంచాంగం ప్రకారం శనివారాన్ని స్థిరవారమని కూడా అంటారు. గ్రహాల గమనం వలన ఏలినాటి శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు తలపెట్టిన పనులు ఆలస్యం కావడం, అనారోగ్య సమస్యలు ఏర్పడడం జరుగుతుంటాయి. ఇవన్నీ చెప్పుకోడానికి పెద్ద సమస్యలు కానప్పటికీ, మన నిత్య జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇలాంటప్పుడు శని బాధలు పోగొట్టుకొని సకల శుభాలు పొందాలంటే శనివారం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ కథనంలో చూద్దాం.

శనివారం ప్రత్యేకం
వారంలో ఏడో రోజైన శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం, శనివారం శనిదేవుని ఆరాధనకు ప్రధానమైనదిగా భావిస్తారు. అంతే కాదు, ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామికి, ఆంజనేయస్వామికి ఎంతో ప్రీతికరమైనది అంటారు. ఇంతటి విశిష్టమైన శనివారాన్ని కొందరు చెడు దినంగా భావించి కొత్త పనులను ప్రారంభించరు. ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. శని గ్రహ ప్రభావం వలన కలిగే శని చెడు ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం కొన్ని విశేషమైన కార్యక్రమాలను చేయాలని శాస్త్రం చెబుతోంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శనివారం పాటించాల్సిన నియమాలు

  • శనివారం నాడు నలుపు రంగు దుస్తులు ధరించి నవగ్రహాలున్న ఆలయంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేయిస్తే మంచిది.
  • శనీశ్వరుని వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి, గుడం అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదు.
  • నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వలన శని అనుగ్రహాన్ని పొందవచ్చు.
  • శనివారం వేంకటేశ్వరుని పూజిస్తే శని దేవుని అనుగ్రహం ఉంటుంది. ఈ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి వేంకటేశ్వరుని ఆలయాన్ని సందర్శించి కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే మొక్కులు నెరవేరుతాయి.
  • హిందూ పురాణాల ప్రకారం, శనివారం ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి శని బాధలు ఉండవని అంటారు.
  • శనివారం ఆంజనేయస్వామికి 11 ప్రదక్షిణాలు చేయాలి.
  • హనుమంతునికి శనివారం వడమాల సమర్పిస్తే శని బాధలు తొలగిపోతాయని నమ్మకం.
  • శనివారం ఆంజనేయునికి ఆకుపూజ చేయిస్తే ఎలాంటి కష్టాలు అయినా తొలగిపోతాయి.
  • శనివారం పరమేశ్వరునికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది. ఒక నియమం ప్రకారం 5 శనివారాలు కానీ, 9 శనివారాలు కానీ శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
  • శనివారం శివాలయం ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కింద దీపం పెట్టి, రావి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలంగా పీడిస్తున్న సమస్యలు తొలగిపోతాయని శాస్త్రవచనం.
  • అలాగే శనివారం ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. డబ్బు అప్పుగా తీసుకోకూడదు.
  • శనివారం నూతన వాహనాలు, ఇనుము వస్తువులు, నల్ల నువ్వులు, నూనె, ఉప్పు వంటి పదార్ధాలు కొనరాదని పెద్దలు చెబుతారు.

శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.