Never Do These Works After Sunset : భారతదేశంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానముంది. చాలా మంది వాస్తును విశ్వసిస్తారు. వాస్తు నియమాలను పాటిస్తే అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారు. అయితే కొందరు వాస్తు దోషాల గురించి తెలియక తప్పులు చేస్తుంటారు. ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
చిన్న చిన్ప పొరపాట్లే.. పెద్ద పెద్ద సమస్యలు తెస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనుల గురించి వారు వివరిస్తున్నారు. సాయంత్రం వేళ కొన్ని పనులు చేస్తే.. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. మరి సాయంత్రం వేళ చేయకూడని ఆ పనులేంటో ఈ స్టోరీలో చూద్దాం..
సింక్‌లో గిన్నెలు ఉంచొద్దు: వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. కిచెన్ శుభ్రతపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది. కాబట్టి మనం ఉపయోగించే పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అయితే చాలా మంది రాత్రిపూట లేట్‌గా అన్నం తినడం, వివిధ కారణాల వల్ల తిన్న ప్లేట్లు, గిన్నెలు క్లీన్ చేయకుండా ఉదయాన్నే చేసుకుందాములే అని పడుకుంటారు. కానీ అలా చేయొద్దని అంటున్నారు నిపుణులు. ఒకవేళ రాత్రిపూట గిన్నెలు కడగలేకపోతే వాటిని వంటగదిలో ఉంచొద్దని అంటున్నారు. మురికి గిన్నెలను కిచెన్‌లో ఉంచితే పేదరికం, అప్పులపాలు కావాల్సి వస్తుందని అంటున్నారు.
ఈ వస్తువులు దానం చేయొద్దు: సూర్యాస్తమయం తర్వాత.. పాలు, పసుపు, ఉప్పు, పంచదార, పుల్లని పదార్థాలు దానం చేయకూడదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవడంతో పాటు, జీవితంలో స్థిరపడలేరని అంటున్నారు.
గోళ్లు, జుట్టు కత్తిరించవద్దు: రాత్రిపూట గోళ్లు, వెంట్రుకలు కత్తిరించడం చేయకూడదని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని.. దరిద్రం తాండవం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి రాత్రి పూట ఈ పనులు చేయకుండా ఉండండి.
ఇళ్లు శుభ్రం చేయవద్దు: వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం పూట ఇళ్లు ఊడ్చడాన్ని శుభంగా భావిస్తారు. కానీ సూర్యాస్తమయం తర్వాత చీపురుతో ఇళ్లు శుభ్రం చేయకూడదని అంటున్నారు. అత్యవసరమైతే తప్ప ఈ పనులు చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే.. సాయంత్రం పూట ఇళ్లు ఊడిస్తే లక్ష్మీదేవి ఇళ్లు వదిలి పోతుందని.. కుటుంబ సభ్యులు అనారోగ్యం, దుఖం, అశాంతి సమస్యలు ఎదుర్కొంటారని అంటున్నారు. సూర్యస్తమయం లోపే ఇళ్లు క్లీన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
దుస్తులు ఉతకొద్దు : సాయంత్రం పూట దుస్తులు ఉతకడం లాంటివి చేయకూడదని అంటున్నారు. ఎందుకంటే దుస్తులు తడిగా ఉండటం వల్ల వాటిపై క్రీములు చేరిపోతాయని.. తద్వారా అవి వేసుకున్నప్పుడు అనారోగ్యానికి గురవుతామని అంటున్నారు. అలాకాకుండా ఉదయం ఎండలో బట్టలు ఆరేయడం వల్ల ఆ వేడికి క్రీములు నాశనమవుతాయని అంటున్నారు.
పడుకోవడం: సూర్యాస్తమయం తర్వాత జుట్టును దువ్వుకోవడం లేకుంటే తలస్నానం చేయడం, జుట్టు వీరబోసుకోని పడుకోవడం లాంటివి చేయకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. సాయంత్రం వేళ ప్రతికూల శక్తులు ఉంటాయని అవి మహిళలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి రాత్రి సమయంలో ఈ పనులు చేయొద్దని సూచిస్తున్నారు.