ETV Bharat / politics

వైసీపీ ఆరో జాబితాలో మళ్లీ అవే మార్పులు - ఎవరు ఎక్కడకు మారతారో అర్థం కాని పరిస్థితి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 9:25 AM IST

YSRCP Releases 6th List of Candidates: నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల్లో వైసీపీ అధిష్ఠానం రివర్స్‌ చేస్తూనే ఉంది. ఓ జాబితాలో ప్రకటించిన వారు, తర్వాత జాబితాలో మరో స్థానానికి మారిపోతున్నారు. మరికొందరి పేర్లు ఆ తర్వాత వెల్లడించిన జాబితాలో కనిపించని పరిస్థితి. దీంతో ఎవరు ఎక్కడకు మారతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రకటించిన 5 జాబితాల్లో మార్చిన కొందరు సమన్వయకర్తల్లో కొందరిని మళ్లీ మారుస్తూ, కొన్ని సీట్లలో కొత్తవారితో కలిపి మొత్తంమ్మీద 10 మార్పులతో వైసీపీ ఆరో జాబితాను శుక్రవారం ప్రకటించింది.

YSRCP_Releases_6th_List_Candidates
YSRCP_Releases_6th_List_Candidates

వైసీపీ ఆరో జాబితాలో మళ్లీ అవే మార్పులు - ఎవరు ఎక్కడకు మారతారో అర్థం కాని పరిస్థితి

YSRCP Releases 6th List of Candidates: ఇన్‌ఛార్జ్‌ల మార్పుల్లో భాగంగా వైసీపీ ఆరో జాబితాను శుక్రవారం రాత్రి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మేరుగు నాగార్జున విడుదల చేశారు. ఇందులోనూ ఇంతకుముందు మార్చిన వాటిలోనే మళ్లీ మార్పులు చేశారు. చిత్తూరు ఎంపీ విషయంలో వైసీపీ తన నిర్ణయం వెనక్కి తీసుకుంది.

గంగాధరనెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని చిత్తూరు లోక్‌సభ సమన్వయకర్తగా, చిత్తూరు ఎంపీ రెడ్డప్పను గంగాధరనెల్లూరుకు గత నెల 18 మార్చారు. దానిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో శుక్రవారం మళ్లీ రివర్స్‌ చేశారు. వారిద్దరూ తమతమ స్థానాల్లోనే కొనసాగుతారని ప్రకటించారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జనవరి 2న నియమించిన మాచాని వెంకటేష్‌ను తప్పించి, కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరును ప్రకటించారు.

గుంటూరు లోక్‌సభ సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటరమణను నియమించారు. తొలుత ఈ స్థానంలో క్రికెటర్‌ అంబటి రాయుడి పేరుని నిర్ణయించారు. ముఖ్యమంత్రే ఆయనను పార్టీలో చేర్చుకుని గుంటూరు నీదేనని హామీ ఇచ్చారు. తర్వాత కొద్ది రోజులకే మచిలీపట్నం వెళ్లాలని చెప్పడంతో ఆయన ఖంగుతిన్నారు. దీంతో పదిరోజుల్లోనే పార్టీకి రాయుడు గుడ్‌బై చెప్పారు. తర్వాత ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి బంధువు, గత ఎన్నికల్లో గుంటూరు నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని పిలిచి మాట్లాడారు. ఆయన కాదనడంతో ఆరో జాబితాలో ఉమ్మారెడ్డి వెంకటరమణను ఖరారు చేశారు.

లోక్​సభ టికెట్​కు 'సిద్ధం'గా లేని వైఎస్సార్సీపీ నేతలు - ఎవరైనా పోటీ చేసేందుకు 'సిద్ధమా'?

ఈసారి ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును సీఎం జగన్‌ రెండుసార్లు, తర్వాత పార్టీ ముఖ్యనేతలు పిలిచి మాట్లాడారు. ఇప్పుడు ఆయన్ని మార్కాపురానికి మార్చారు. మార్కాపురం ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు బదిలీ చేశారు. గత నెలలోనే మార్కాపురం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి ఖరారు చేసినా, అప్పుడు అధికారికంగా ప్రకటించలేదు.

వైసీపీ ప్రభుత్వంలో, ఆ పార్టీలో అగ్ర ప్రాధాన్యమున్న సామాజికవర్గం నేతలు నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అనిల్‌ను కొనసాగించడానికి వీల్లేదని పట్టుబట్టడంతో ఆయన్ను నరసరావుపేట లోక్‌సభకు మార్చారు. తర్వాత నెల్లూరు నగరానికి ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖరరెడ్డి పేరును తొలుత పరిశీలించారు. కానీ, శుక్రవారం జాబితాలో నెల్లూరు డిప్యూటీ మేయర్‌ ఖలీల్‌ అహ్మద్‌ పేరును ప్రకటించారు.

నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఉన్న జీవీకే రంగరాజును పార్టీ ముఖ్యనేతలు ఎంత బతిమాలినా ఆయన పోటీకి ఒప్పుకోలేదు. దీంతో ఇప్పుడు గూడూరి ఉమాబాలను నియమించారు. భీమవరానికి చెందిన ఆమె అక్కడే మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ పదవికి గతంలో పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీ మహిళా విభాగం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

సమన్వయకర్తల మార్పుల విషయంలోనూ రివర్స్‌ - వైసీపీ అయిదో జాబితాలో మరిన్ని సిత్రాలు

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు మొదట్నుంచి మంత్రి జోగి రమేశ్‌తో వివాదం ఉంది. ఈసారి మైలవరం నుంచి బరిలోకి దిగాలని భావించిన జోగి, అక్కడ రాజకీయ కార్యకలాపాలు సాగించడమే వివాదాలకు కారణమైంది. సయోధ్యకు ముఖ్యనేతలు, సీఎం కార్యదర్శి ప్రయత్నించినా కుదరలేదు.

దీంతో ‘మైలవరంలో మీ ఇష్టం వచ్చినవారిని తెచ్చి పెట్టుకోండి, నేనైతే ఉండనని వసంత అసహనాన్ని వ్యక్తం చేయడంతో ఆయన్ను ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడారు. ‘మైలవరం టికెట్‌ నీదే, ఇకపైన జోగి అక్కడ కలుగజేసుకోరని హామీ ఇచ్చి పంపారు. తర్వాత కూడా పరిస్థితులు మారకపోవడంతో ఎమ్మెల్యే పార్టీకి దూరం జరిగారు. దీంతో ఆయన స్థానంలో మంత్రి జోగి వర్గానికి చెందిన మైలవరం జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.

ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణుల్లో అయోమయం - ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలో అర్థంకాని పరిస్థితి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.