ETV Bharat / politics

అక్రమార్జనకు కొత్తబాటలు వేసిన అవినీతి మాంత్రికుడు- టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్నే అడ్డుపెట్టుకుని దందాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 9:32 AM IST

Updated : Mar 5, 2024, 2:44 PM IST

YSRCP_Leader_Irregularities_in_West_Godavari
YSRCP_Leader_Irregularities_in_West_Godavari

YSRCP Leader Irregularities in West Godavari: అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు నాయకులు భూ కబ్జాలు చేస్తుంటారు! ఆ నాయకుడు అలా కాదు! పనిగట్టుకుని భూముల క్రయ విక్రయాలు జరిపిస్తుంటారు. తన అనుచరులతో తక్కువ ధరకు భూములు కొనిపించడం, ఆ తర్వాత వాటినే ప్రభుత్వం ఎక్కువ ధరకు కొనేలా చేయడం, తన చేతికి మట్టి అంటకుండా దిగమింగడం ఆయన స్టైల్‌! టీడీఆర్​ బాండ్లు అడ్డుపెట్టుకుని, కోట్లు కొల్లగొట్టే కొత్త విధానానికి ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌.!

అక్రమార్జనకు కొత్తబాటలు వేసిన అవినీతి మాంత్రికుడు- టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్నే అడ్డుపెట్టుకుని దందాలు

YSRCP Leader Irregularities in West Godavari: అది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతం. చక్కెర పరిశ్రమకు పేట్టింది పేరు. 2019కు ముందే అక్కడ అడుగుపెట్టారాయన. డబ్బులు ఎప్పుడిస్తావంటూ అప్పుల వాళ్లు ఆయన వెంటపడేవారు. వాహనానికి డీజిల్‌ కావాలన్నా ఇతర నాయకులు సాయం చేయాల్సిన దీనస్థితి! అలాంటి వ్యక్తి ఐదేళ్లు తిరిగే సరికి కోట్లు కూడబెట్టారు.!

రహదారుల విస్తరణ కోసం మున్సిపాలిటీలు ఎవరి నుంచైనా స్థలాలు సేకరిస్తే ఆ విలువకు ప్రతిగా టీడీఆర్​(TDR) బాండ్లు జారీ చేస్తాయి. స్థలాలను మాస్టర్‌ ప్లాన్‌ విస్తరణకు సేకరిస్తే 1:4 నిష్పత్తిలో, కమ్యూనిటీ అవసరాల కోసమైతే 1:2 నిష్పత్తిలో బాండ్లు జారీ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి! ఇవే ఆ అవినీతి మాంత్రికుడి అక్రమార్జనకు ఉపాయంగా మారాయి. ఆ పట్టణంలో అవసరంలేకున్నా మున్సిపాలిటీతో ఎక్కడెక్కడో స్థలాలు సేకరింపజేశారు.

మొదట కొన్ని చోట్ల తన బినామీలతో స్థలాలు కొనిపించారు. రిజిస్ట్రేషన్‌ కాకముందే అడ్వాన్సులు ఇచ్చి ఒప్పందాలు చేయించుకున్నారు. బినామీలు కొన్న భూముల పేరిట టీడీఆర్ బాండ్లు జారీ చేయించారు. వాటికి ధర నిర్ణయించడంలోనూ వేలుపెట్టి వందల కోట్లు ఆర్జించారు. ఆ టీడీఆర్​ బాండ్లను విశాఖలోని ఓ ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి, ప్రజాప్రతినిధికి అమ్మించారు. ఈ లావాదేవీల్లో మధ్యవర్తిగా ఉండి కోట్లలో కమిషన్‌ పుచ్చుకున్నారు.

రుషికొండపై హడావుడిగా 'ప్యాలెస్‌' - వినియోగంపై స్పష్టతేదీ జగన్?

ఆ మాంత్రికుడి పట్టణంలో 2012 నుంచి 2019 మధ్య కేవలం 6,400 గజాల స్థల సేకరణకు సంబంధించిన టీడీఆర్ బాండ్లే జారీ అయ్యాయి. 2019 నుంచి 2022 మధ్య ఏకంగా లక్షా 43 వేల గజాల భూమిని సేకరించి బాండ్లు జారీ చేశారు. అంటే ఏ రేంజ్‌లో టీడీఆర్ బాండ్లు వాడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ కొత్తరకం అవినీతి మార్గాలు కనిపెట్టారు.

బాండ్ల జారీ ప్రక్రియలో వ్యవసాయ భూములను గజాల్లో లెక్కకట్టకూడదు. కానీ గజాల రూపంలో లెక్కగట్టారు. పరిహారం చెల్లించే క్రమంలోనూ స్థలాలు సేకరించిన ప్రాంతంలో కాకుండా ఎక్కడో దూరంలో ఉన్న భూముల ధరల్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. గజం 8 వేల నుంచి 9 వేల ధర ఉన్న చోట ఏకంగా గజం 23 వేల 700 వరకు నిర్ణయించారు.

గజం 4 వేలు ఉన్న చోట 13 వేల వరకూ ధర లెక్కగట్టారు. ఇలా అడ్డగోలు ధరలతో ప్రభుత్వ ఖజానాకు 850 కోట్ల రూపాయల మేర గండికొట్టారు. అందర్నీ ఎర్రిపప్పల్ని చేసిన విషయం వెలుగు చూడటంతో టీడీఆర్ బాండ్ల వినియోగాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అధికారులను సస్పెండ్‌ చేసింది. కానీ అసలు సూత్రధారిని వదిలేసింది. ఏసీబీ(ACB) సైతం కుట్రలో వ్యూహకర్తను పట్టించుకోలేదు.

ఈ కుంభకోణంతో పెద్దలకు ఆ మాంత్రికుడు ఎంత సమర్పించుకున్నారో, ఎలా సంతృప్తిపరిచారో తెలియదుగానీ ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో ఆయనకు పెద్ద పదవే దక్కింది. సాధారణంగా పట్టణాల్లో టౌన్‌ ప్లానింగు లోపాలు అడ్డుపెట్టుకుని వసూళ్లు సాగించే అక్రమార్కులుంటారు. కానీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్నే అడ్డుపెట్టుకుని దందాలు చేసుకోవడం ఆ నేత స్టైల్‌.

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ- టెట్, టీఆర్‌టీ పరీక్షల షెడ్యూల్‌ మార్చాలని ఆదేశం

ఆయన ఇలాకాలో ప్రతిదానికీ ఓ రేటుంటుంది! ఆ నాయకుడు 'ఊ' అంటేనే పట్టణ ప్రణాళికా విభాగంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులిస్తారు.! ఆయన్ను ప్రసన్నం చేసుకోకపోతే ఇంటి నిర్మాణానికి అనుమతిపై ఆశలు వదులుకోవాల్సిందే. అన్నీ సవ్యంగా ఉండి 150 గజాల విస్తీర్ణం దాటిన ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయలకుపైగా ముట్టజెప్పాల్సిందే.!

అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కట్టుకోవాలంటే 2 లక్షల రూపాయలు సమర్పించుకోవాలి. ఆ పట్టణంలో ఇటీవల కొత్తగా ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టారు. దానిపై ముచ్చటపడిన మాంత్రికుడు అందులో ఓ ఫ్లోరంతా కావాలని పట్టుబట్టారు. అంత ఇచ్చుకోలేమని యజమాని ప్రాధేయపడ్డారు. చివరకు ఒక ఫ్లాట్‌తో సరిపెట్టుకున్నారు. దాని విలువా తక్కువేమీకాదు.! దాదాపు కోటి రూపాయలపైనే.

జగనన్న ఇళ్ల స్థలాల మాటున కూడా అవినీతి విశ్వరూపం చూపించిన ఘటికుడాయన. అత్తిలి, ఇరగవరం మండలాలతోపాటు మరికొన్ని చోట్ల 'జగనన్న ఇళ్ల స్థలాల' కోసమని రైతుల నుంచి ప్రభుత్వం 336 ఎకరాలు కొనుగోలు చేసింది. ఆ నేత అనుచరులు, అనుకూలంగా ఉండే కొందరు రైతుల భూముల్నే ఇందుకు ఎంపిక చేసుకున్నారు. వాస్తవ ధర కంటే దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ప్రభుత్వంతో కొనిపించి కోట్ల రూపాయలు దిగమింగారు.!

ఇక లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చే సమయంలో ప్రభుత్వం కొంతమొత్తంలో రైతులకు చెల్లిస్తుంది. ఐతే, ప్రభుత్వం చెల్లించే ధర కన్నా ఇక్కడి ధరలు ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం చెల్లించగా మిగిలిన డబ్బును లబ్ధిదారులే భరించాల్సి ఉంటుందని తప్పుడు ప్రచారం చేశారు. అలా 16 గ్రామాల్లో లబ్ధిదారులను నమ్మించి ఒక్కొక్కరితో 30 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయించారు. తర్వాత రైతుల ఖాతాల్లోని అదనపు సొమ్మును స్వాహా చేశారు.

ఎన్నికల అక్రమాలకు అడ్డాగా మారిన తిరుపతి- ముగ్గురు వైసీపీ జగజ్జంత్రీలదే హవా

పదవిని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలోని పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజెన్సీల నుంచి వసూళ్లు చేసుకుంటున్నారు. సోదాలు చేయిస్తానంటూ భయపెట్టి ఈ దందాకు తెగబడుతున్నారు. పోలీస్‌ స్టేషన్లలో పంచాయతీలు, సెటిల్మెంట్లకైతే లెక్కే లేదు. ఠాణాల్లో పంచాయితీలన్నింట్లో ఆ నేతకు వరుసకు సోదరుడయ్యే వ్యక్తిదే ఆధిపత్యం. కేసు పెట్టాలన్నా, ఉపసంహరించాలన్నా ఆయన కనుసైగ చేయాల్సిందే. ఓ పోలీస్‌ అధికారి ఈ నేతకు జేబు మనిషిగా మారాడనే ఆరోపణలున్నాయి.

అయ్యగారికి ఎదురుతిరిగినా, ఆయనకు గిట్టని పనిచేసినా, వ్యతిరేకంగా మాట్లాడినా ఆ అధికారితో అడ్డమైన కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తారు. అప్పటికీ వినకపోతే ఆయన చేతిలో ఉన్న కిరాయి మూకలతో దాడులు చేయిస్తారు. కొన్ని నెలల క్రితం పవన్‌ వారాహియాత్ర సభ విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేని ఆ నేత కిరాయి మూకలతో జనసేన కార్యకర్తలపై దాడి చేయించారు. ద్విచక్రవాహనాలపై వెళ్తున్నవారిపై 'బ్లేడ్‌ బ్యాచ్‌' దాడులకు తెగబడింది.

ఇటీవల నిర్వహించిన వైసీపీ సామాజిక బస్సుయాత్రలో జనాలు సభ నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలను చిత్రీకరించిన మీడియా ప్రతినిధిపైనా ఆ నేత అనుచరులు ప్రతాపం చూపించారు. మీడియా ప్రతినిధి సెల్‌ఫోన్‌ను లాక్కొని వీడియోలు తొలగించారు. గంటపాటు ఓ గదిలో ఉంచి తీవ్రంగా దుర్భాషలాడారు.

Last Updated :Mar 5, 2024, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.