ETV Bharat / politics

జగన్‌ హయాంలో అరాచకాలకు అడ్డాగా ఆంధ్రా - విధ్వంసపు పాలనలో మానని గాయాలెన్నో! - YSRCP Govt Anarchies in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 10:49 AM IST

YSRCP Govt Anarchies in AP: జగన్‌ అయిదేళ్ల పాలన వెనుదిరిగి చూస్తే ఏమున్నది గర్వకారణం? ఆయన పాలన మొత్తం ప్రజాపీడన పరాయణత్వం. సామాన్య పౌరుడికీ స్వేచ్ఛ లేదు. సామాజిక మాధ్యమాల్లో స్పందించే వాక్‌ స్వాతంత్య్రం లేదు. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రికీ, ఒక పార్టీ అధినేతగా ఉన్న లక్షల మంది ఆరాధ్య నటుడికీ జనాలను కలవనివ్వని వైఎస్సార్సీపీ పోలీసు గ్యాంగ్‌. సొంత పార్టీ ఎంపీకి అరెస్టు చేసి మరీ ట్రీట్‌మెంట్‌.

YSRCP_Govt_Anarchies_in_AP
YSRCP_Govt_Anarchies_in_AP (ETV Bharat)

YSRCP Govt Anarchies in AP: వైఎస్సార్సీపీ సర్కార్‌లో ఎవరికీ హక్కులు లేవు. ఆఖరికి వృక్షాలు కూడా విలపించేటంతటి కాఠిన్యం ఈ సర్కార్‌ సొంతం. కల్తీ సారా మరణాలు, కొవిడ్‌లో ఆక్సిజన్‌ అందక మృత్యు ఘంటికలు, ప్రాజెక్టుల ధ్వంసం, ప్రకృతి వనరుల విధ్వంసం. ఒక్కటేమిటి ఊరూరూ తల్లడిల్లింది. ప్రతి రంగమూ కునారిల్లింది. ఈ సర్కార్‌ ఘనకార్యం చూసి ప్రతి గుండె ఘోషిస్తోంది. వేలుపై సిరా చుక్క రాసుకుని స్పందించాలని వేచి చూస్తోంది.

ఐదేళ్ల జగన్‌ పాలనలో అరాచకాలెన్నో, విధ్వంసపు పాలనలో మానని గాయాలెన్నో! ప్రశ్నిస్తే దాడులు, ఎదురిస్తే దౌర్జన్యాలు, దళితులపై దమనకాండలు, బ్రిటిషు పాలనను తలదన్నే విధానాలు, శిరోముండనాలు, అక్రమకేసులు, అణచివేత ధోరణి నుంచి వచ్చిన ఆగ్రహ జ్వాలలకు ఆహుతైన దళితులెందరో!

బహిరంగంగా విమర్శించినా, ప్రత్యర్థులు ప్రశ్నించినా, సొంత పార్టీ నేతలు వ్యతిరేకించినా అక్రమ కేసులు బనాయించారు. అధికార మదంతో తొక్కేశారు. ఐదేళ్ల రాక్షస పాలనలో ఆవిరైన ప్రాణాలెన్నో! ఓ డాక్టరు మాస్కు అడగాలన్నా, ఓ యువకుడు మాస్కు పెట్టుకోకున్నా, ఓ టీచరు పుస్తకాలకై అభ్యర్థించినా, ఓ విద్యార్థి మంచి విద్య కోరుకున్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికే స్థితి కల్పించిన ఈ ఐదేళ్ల కర్కశ పాలనలో తల్లడిల్లిన జీవులెందరో.

కుప్పంలో ఇంటికి కిలో బంగారం ఇచ్చినా మీకు ఓటేయరు: చంద్రబాబు - CHANDRABABU speech in chittoor

సలాం కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న వైనం: తన పద్నాలుగేళ్ల కూతురు సల్మా, ఏడేళ్ల కొడుకు దాదా కలందర్‌లతో కలిసి నంద్యాల పట్టణానికి చెందిన అబ్దుల్‌ సలాం, ఆయన భార్య నూర్జహాన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి వచ్చి రైలు కింద తలపెట్టి సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రాన్ని కుదిపేసింది. పోలీసులతో పాటు వైఎస్సార్సీపీ నాయకుల ఒత్తిళ్లు కూడా ఇందులో కీలకాంశమయ్యాయి. సంబంధం లేని దొంగతనం కేసును అంగీకరించాలని పోలీసులు హింసించడమే ఈ దారుణానికి కారణమని సలాం అత్త వెల్లడించారు. సలీం ఆటో నడిపేవారు. అందులో ప్రయాణించిన ఒక వ్యక్తి రూ.70 వేలు పోగొట్టుకున్నారు. ఆ దొంగతనం విషయంలో పోలీసులు సలాంను స్టేషన్‌కు పిలిపించారు. సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ ఒత్తిడి చేయడం వల్లే వారు మరణించారని కేసులు నమోదయ్యాయి.

మాస్కు అడిగితే పిచ్చోడని ముద్ర: కరోనా రోగులకు సేవలు అందించే సిబ్బందికి ఎన్‌-95 మాస్కులు లేవంటూ గళమెత్తడమే నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి వైద్యుడు సుధాకర్‌ చేసిన పాపం. ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తావా? అన్నట్లు దళితుడు అయిన ఆయనను జగన్‌ ప్రభుత్వం ఎన్నో రకాలుగా వేధించింది. విశాఖలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన పట్ల అత్యంత క్రూరంగా, హేయంగా వ్యవహరించారు. ప్రభుత్వం ఆయనపై మానసిక రోగి అని ముద్ర వేసి, విశాఖ మానసిక వైద్య ఆసుపత్రిలో చేర్చింది. చివరికి ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురై గుండెపోటుతో చనిపోయారు.

మాస్కు లేదని దళితుడిని చంపేశారు: మాస్కు పెట్టుకోని నేరానికి 'మరణ' శిక్ష విధించడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఐదేళ్ల జగన్‌ ఆటవిక రాజ్యంలో జరిగిన అనేక దమనకాండ దొంతరల్లో చీరాలకు చెందిన దళిత యువకుడు కిరణ్‌మార్‌ పేజి ఇది. మాస్కు ధరించకపోవడంతో అతడిని పోలీసులు తీవ్ర నేరగాడి మాదిరిగా తలపగిలేలా కొట్టారు. ఆ దెబ్బలకు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.

దాడి చేసిందీ, కేసులు పెట్టిందీ వారే: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరులు రణరంగాన్ని తలపించాయి. సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి అంటూ ఆ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన మాజీ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ మూకలు అడ్డుకున్నాయి. ఫలితంగా జరిగిన ఘర్షణలో టీడీపీ కార్యకర్తలు, పోలీసులు గాయపడ్డారు. వైఎస్సార్సీపీ రివర్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యాయత్నం కేసుపెట్టింది. మరో 245 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.

డీజీపీ కార్యాలయం సాక్షిగా: టీడీపీ ప్రధాన కార్యాలయంపై అల్లరిమూకలు 2021లో చేసిన దాడి అధికారపార్టీ నేరచరిత్రకు ఆనవాలు. డీజీపీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న పార్టీ ఆఫీసు ఇది. అల్లరిమూకలు పదుల సంఖ్యలో టీడీపీ కార్యాలయంపైకి దూసుకొచ్చి భీతావహం సృష్టించారు. 20 నిమిషాల పాటు విశృంఖలంగా అల్లర్లు సృష్టించారు. కారులు ధ్వంసం చేశారు. భవనాన్ని, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. కనిపించిన కార్యాలయ సిబ్బందినీ కొట్టారు. టీడీపీ కార్యకర్తలూ గాయపడ్డారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులకు ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ నాయకులే కొన్ని చోట్ల స్వయంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు.

వైఎస్​ వారసులు ఎవరు? - తేల్చేసిన విజయమ్మ - Vijayamma Support Sharmila

రుయాలో ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ బాధితులు మృతి: తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో 2021 మే లో ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ బాధితులు ప్రాణాలు విడిచారు. అవసరాలకు తగ్గట్లు ఆక్సిజన్‌ సౌకర్యాన్ని కల్పించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైంది. తొలుత 11 మంది మాత్రమే మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కానీ ఆ తరువాత పరిహారం చెల్లింపు సందర్భంగా 23మంది చనిపోయినట్లు తేలింది. శ్రీపెరంబదూరు నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ సకాలంలో తిరుపతి రుయాకు రాలేదు. దీంతో సిలిండర్లలోని ఆక్సిజన్‌ను వాయువు వేగంగా వెళ్లనందున ప్రెజర్‌ తగ్గి పై అంతస్తులో ఉన్న బాధితులకు అందలేదు. రోగులు మంచంపై నుంచి కిందపడి, గిలగిలకొట్టుకున్నారు. మరుగుదొడ్లకు వెళ్లి అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచిన వారూ ఉన్నారు.

తొలిఅడుగే కూల్చివేతతో: ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్ర విధ్వంసానికి తొలి అడుగుగా, ఆయన నిరంకుశ ధోరణికి నిదర్శనంగా నిలిచింది ప్రజావేదిక కూల్చివేత. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే దాన్ని కూల్చి ధ్వంసరచనకు శ్రీకారం చుట్టారు. అధికారిక సమావేశాలు, సమీక్షల కోసం గత టీడీపీ ప్రభుత్వం కృష్ణా నది కరకట్టపై రూ.కోట్ల ప్రజాధనంతో ప్రజావేదికను నిర్మించింది. రాజధాని కట్టాల్సిన జగన్‌ కూల్చివేతతో తన నైజాన్ని చాటారు.

అమరరాజానూ పంపించేశారు: టీడీపీ ఎంపీ అనే ఏకైక కారణం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారన్న కోపంతో గల్లా జయదేవ్‌కి చెందిన అమరరాజా బ్యాటరీ సంస్థపై జగన్‌ ప్రభుత్వం కక్షగట్టింది. అధికారులతో తనిఖీలు చేయించి విద్యుత్‌ సరఫరా నిలిపివేయించింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ పరిశ్రమ మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో చిత్తూరు జిల్లాలో పెట్టాలనుకున్న రూ.9,500 కోట్ల పెట్టుబడిని సంస్థ తెలంగాణకు తరలించింది.

ఉద్యోగులెవరూ జగన్​కు ఓటు వేయలేదు- నేడు పాసుపుస్తకాల నకళ్ళు దహనానికి చంద్రబాబు పిలుపు - cbn on Postal Ballot Voting

దళిత యువకుడికి శిరోముండనం!: వైఎస్సార్సీపీ నాయకులు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని, ఆ సమయంలో అనేక మంది మృత్యువాత పడుతున్నారని దళిత యువకుడు ఇండుగుమిల్లి ప్రసాద్‌ రోడ్డుపై బైఠాయించారు. 2020 జులైలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఆ యువకుడు తెలిపిన నిరసనకు స్థానికులు మద్దతుగా నిలిచారు. ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఇసుక వ్యాపారి కృష్ణమూర్తి రంగప్రవేశం చేయడంతో పోలీసులు ఆ యువకుడిని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దళిత యువకుడు ప్రసాద్‌కు ఎస్‌ఐ శిరోముండనం చేయించి అవమానించారు.

60 ఏళ్ల వృద్ధురాలిపై కక్ష: విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు ప్రమాదంపై 60 ఏళ్ల వృద్ధురాలు పూందోట రంగనాయకమ్మ తన ఫేస్‌బుక్‌ పోస్టులో అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్‌ ప్రభుత్వం కక్ష పూని ఆమెకు సీఐడీ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. దీంతో గుంటూరులో ఉన్న తన హొటల్‌ను కూడా మూసివేసుకోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పచ్చని సీమలో శాంతి భగ్నం!: ప్రశాంతతకు నెలవైన కోనసీమలో ఆరని మంట పెట్టే ప్రయత్నమిది. కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ పేరుపెట్టి జగన్‌ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టారు. అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను కావాలని నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో హింస ప్రజ్వరిల్లింది. ఆ మంట తిరిగి అధికార పార్టీకే అంటుకుని మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇళ్లూ అగ్నికి ఆహుతయ్యాయి. నిరసనకారుల రాళ్ల దాడులతో అమలాపురం అట్టుడికింది.

విపక్షమా అయితే అరెస్టుచెయ్‌!: ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందడమే ఆలస్యం సీబీఐ, ఏసీబీ, సివిల్‌ పోలీసులు ఆఘమేగాల మీద వాలిపోతారు. టీడీపీ అధినేత చంద్రబాబూ ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఆయన్ను హైడ్రామా మధ్య అరెస్టు చేసి, నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో సీఐడీ కార్యాలాయానికి తీసుకొచ్చారు. మాజీ మంత్రి పి.నారాయణను కుమారుడి వర్ధంతిలో పాల్గొనే అవకాశం లేకుండా అరెస్టు చేశారు. మొలల శస్త్ర చికిత్స చేయించుకున్నా, రక్తస్రావం అవుతున్నా కనీస మానవత్వం చూపకుండా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేశారు.

ఇక హత్య కేసు ఆరోపణల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఘర్షణ కేసులో మాజీ ఎమ్మెల్సీ బీ.టెక్‌ రవి, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు రువ్విన కేసులో మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావును పోలీసులు అవే విధానాల్లో అరెస్టు చేశారు. సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజునూ పోలీసులు వదల్లేదు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను అరెస్టులోనూ అదే తీరు!

విశాఖపట్నానికి వీసా కావాలా?: బ్రిటిష్‌ కాలంలో నిర్బంధాలను కళ్లకు కట్టినట్లు అప్పటి బ్రిటిష్‌ చట్టాలను తలదన్నేలా జగన్‌ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల పట్ల నిరంకుశంగా వ్యవహరించింది. వారు స్వేచ్ఛగా కార్యక్రమాలను నిర్వహించడానికి వీలు లేకుండా పోలీసు సైన్యాన్ని పంపి అడ్డుకుంది. జగన్‌ ప్రభుత్వ నిర్బంధాలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన మానుకుని విశాఖ విమానాశ్రయం నుంచి అప్పట్లో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆయన కాన్వాయ్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డగించి వాహనంపై కోడిగుడ్లు, చెప్పులు విసిరి అలజడి సృష్టించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అప్పట్లో విశాఖలో చేపట్టిన 'జనవాణి' కార్యక్రమంలో పాల్గొనడానికి జగన్‌ ప్రభుత్వం అనుమతించలేదు. ఆయనకు సెక్షన్‌ 30 కింద పోలీసులు నోటీసు ఇచ్చి ప్రజల్లోకి వెళ్లకుండా జగన్‌ ప్రభుత్వం అడ్డుకుంది.

గుడివాడలో గోవా క్యాసినో: క్యాసినో సంస్కృతిని గుడివాడకు తీసుకొచ్చిన ఘనత నాటి పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నానిదే. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే గోవా తరహాలో ఆయనకు చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లోనే జూదం, అశ్లీల నృత్యాలు, మందు, విందులు ఏర్పాటు చేయడం సంచలనమైంది. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి అశ్లీల నృత్యాలు చేయించారు. దాదాపు రూ.500 కోట్లు ఈ క్యాసినోలో చేతులు మారినట్లు కొన్ని సంస్థలు అంచనాకు వచ్చాయి.

కల్తీ సా'రక్కసి' కాటు!: జగన్‌ ఐదేళ్ల పాలనలో కల్తీ సారా రక్కసి బీదబిక్కి జనాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ సారా రాకాసి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒక్కసారే 18 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనతోనైనా మేల్కొని తప్పును సరిదిద్దుకోవాల్సిన జగన్‌ అవి అసలు సారా మరణాలే కాదని బుకాయించేందుకు ప్రయత్నించారు. దీనిపై బాధితుల కుటుంబాలు, శాసనసభ భగ్గుమన్నాయి. అబద్ధాలు చెప్పిన సీఎంను సభ నుంచి బయటకు పంపాలని శాసనసభలో ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు.

సొంత ఎంపీనీ వదల్లేదు: జగన్‌ ప్రభుత్వంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలతో అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ అభియోగాలు మోపి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న సమయంలోనే వారు తనపై దాడి చేసి తీవ్రంగా కొట్టారని గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జికి ఫిర్యాదు చేశారు. ఈ అంశం తీవ్ర విషయమైంది. సుప్రీంకోర్టు సైతం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసే క్రమంలో పోలీసు కస్టడీలో ఆయనపై అనుచిత ప్రవర్తనను తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించింది.

మాచర్ల కిరాతకాలు: జగన్‌ పాలనలో మాచర్ల ప్రాంతం ఆటవిక రాజ్యానికి నిదర్శనంగా, ఆంధ్రా చంబల్‌లోయగా పేరు పొందింది. ఈ ఐదేళ్లలో ఇక్కడ సినిమాల్లో చూపించే క్రూరత్వానికి మించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజకీయ ప్రత్యర్థులయితే పట్టపగలే గొంతు కోయడం, విపక్ష పార్టీ జెండా పట్టుకుంటే ఇళ్లు, దుకాణాలు తగలబెట్టడం లాంటి దురాగతాలు వెలుగుచూశాయి. సాక్షాత్తూ ఎస్పీ, డీఐజీ, డీజీపీలే కళ్లప్పగించి చూడాల్సిన పరిస్థితులు దాపురించాయి. వైఎస్సార్సీపీ ముఠాలు 2019లో అక్కడ టీడీపీ మద్దతుదారులను ఊళ్ల నుంచి తరిమికొట్టాయి. హత్యలకు తెగబడ్డాయి.

అధికారంలోకి రాగానే రెండో సంతకం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్​ రద్దుపైనే: చంద్రబాబు - Chandrababu Prajagalam Meeting

కన్నీరు పెడుతున్న స్వర్ణముఖి: ప్రకృతి వనరులను కొల్లగొట్టడం జగన్‌ పాలనలో సర్వసాధారణమైంది. వైఎస్సార్సీపీ నేతలు జరిపే ఇసుక అక్రమ తవ్వకాలతో స్వర్ణముఖి నదీ తీరం కన్నీరు పెడుతోంది. యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపకూడదని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఇచ్చిన ఆదేశాలనూ అధికార పార్టీ నేతలు పట్టించుకోవడంలేదు. ఫలితంగా ఆక్రమణలతో పుణ్య నది స్వరూపమే మారిపోయింది.

సభకు స్థలం ఇస్తే ఇళ్లు కూల్చిన వైనం: గుంటూరు జిల్లా ఇప్పటం రైతులు పవన్‌కల్యాణ్‌ పార్టీ ఆవిర్భావ సభ కోసం తమ భూములు ఇచ్చారు. దీన్ని సహించలేని వైఎస్సార్సీపీ సర్కారు ఆ గ్రామంలో నాలుగు వరుసల రహదారి నాటకం ఆడింది. ఆ వంకతో అధికారులు సభకు భూములు ఇచ్చిన 53 మంది ఇళ్లు, ప్రహరీలను పొక్లెయినర్‌లతో కూల్చేశారు. 600 ఇళ్లు, 2వేల జనాభా ఉన్న గ్రామంలోని రహదారిని 125 అడుగులకు విస్తరణ పేరిట సాగించిన ఈ అరాచకం జగన్‌ రాక్షస పాలనకు నిదర్శనం.

అప్పన్నతో ఆటలు: టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుపై కక్ష సాధింపులకు పాల్పడింది జగన్‌ సర్కారు. సింహాచలం ఆలయ ఛైర్మన్‌గా, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా అనువంశిక ధర్మకర్త అయిన అశోక్‌గజపతిరాజును రాత్రికి రాత్రి ఆ పదవుల నుంచి తొలగించింది. అశోక్‌గజపతిరాజు సోదరుడు, దివంగత ఎంపీ ఆనందగజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజుని పాలకవర్గ సభ్యురాలిగా నియమించారు. ఈ వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ కీలకంగా వ్యవహరించారు. తర్వాత ఛైర్‌పర్సన్‌ హోదాలో సంచయిత తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. అశోక్‌గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించడంతో ఆమె నియామకం చెల్లదంటూ తీర్పు వెలువడింది.

రమేష్‌ ఆస్పత్రికి వేధింపులు!: విజయవాడలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేధించింది. కొవిడ్‌ హయాంలో విమాన ప్రయాణాల ద్వారా వచ్చిన వారిని స్వర్ణప్యాలెస్‌లో ఉంచి ప్రభుత్వం చికిత్స అందించింది. ఇదే స్వర్ణప్యాలెస్‌ యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరించి కొవిడ్‌ బాధితులకు రమేష్‌ ఆసుపత్రి వారు చికిత్స అందిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. పలువురు ప్రాణాలు విడిచిన ఈ దుర్ఘటనలో రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వేధించింది. డాక్టర్‌ రమేష్‌కు వ్యతిరేకంగా వివరాలు చెప్పాలని అధికారులు సంస్థ ఉద్యోగులను ఒత్తిడి చేశారు.

సుబ్బారావు చెంపలు వాయించారు: ఒంగోలుకు చెందిన వరల్డ్‌ ఆర్యవైశ్య మహాసభ ఏపీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌ సుబ్బారావు గుప్తాకు సొంత పార్టీ నేతల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాజీ మంత్రి బాలినేనికి అనుచరుడు. ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీకి నష్టం జరకూడదంటూ సుబ్బారావు గుప్తా సూచనలు చేశారు. దాంతో అదే రోజు రాత్రి బాలినేని అనుచరులు సుబ్బారావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. విషయం తెలుసుకున్న ఆయన గుంటూరులోని ఒక లాడ్జిలో తలదాచుకున్నా అతన్ని వెతికి పట్టుకుని మరీ వేధించారు. బాలినేనికి క్షమాపణ చెప్పాలంటూ ఆయనను మోకాళ్లపై కూర్చోపెట్టి విచక్షణ రహితంగా కొట్టారు.

పులివెందులలో సింగల్ ప్లేయర్​గా ఉండేందుకే వివేకా హత్య- భారతీరెడ్డిపై వైఎస్ సునీత ఆగ్రహం - Viveka daughter Sunitha Interview

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.