ETV Bharat / politics

'ప్రశ్నించే నాయకుడు ఏపీలో లేరు - ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుందాం'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 9:02 PM IST

Revanth Reddy YS Sharmila Comments in Congress Meeting: ఆంధ్రప్రదేశ్​కు అన్యాయం జరుగుతున్నా పాలకులు దిల్లీలో నోరెత్తడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో కాంగ్రెస్ న్యాయసాధన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు దగా చేసే ప్రభుత్వాలను గద్దె దించాలని రేవంత్ పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్​పై జగన్ కుట్ర పన్నుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. తన ప్రాణాలు అడ్డువేసైనా సరే స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటానని చెప్పారు.

Revanth_Reddy_YS_Sharmila_Comments_in_Congress_Meeting
Revanth_Reddy_YS_Sharmila_Comments_in_Congress_Meeting

Revanth Reddy YS Sharmila Comments in Congress Meeting: ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘విశాఖలో కాంగ్రెస్‌ నిర్వహించిన ‘న్యాయసాధన సభ’లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రసంగించారు.

ప్రశ్నించే నాయకుడు లేరు: విశాఖ స్టీల్‌ప్లాంట్ రక్షణకు వైఎస్ బిడ్డ నడుం బిగించారని, ఉక్కు సంకల్పంతో షర్మిల ఈ సభ పెట్టారని రేవంత్ పేర్కొన్నారు. ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుంటామని, తెలుగువారి హక్కులు కాపాడుకునేందుకు అంతా ఏకమవుతామని స్పష్టం చేశారు. వైఎస్‌ సంకల్పం నిలబెట్టేవారే వైఎస్ వారసులు అవుతారని, ఆయన ఆశయాలు మరిచిపోయినవారు వారసులు ఎలా అవుతారని రేవంత్ ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులు ఉంటేనే పాలకులు మన మాట వింటారన్న రేవంత్, ప్రశ్నించే నాయకుడు లేకపోవడం వలనే ఏపీని మోదీ పట్టించుకోలేదని విమర్శించారు.

ఏపీ ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టారు: పదేళ్లు పూర్తవుతున్నా ఏపీకి రాజధాని లేదని, పోలవరం పూర్తవలేదని, ఏపీ ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టారని రేవంత్ ధ్వజమెత్తారు. గత పాలకులు దిల్లీ నాయకులను గట్టిగా అడిగి సాధించుకునేవారని, డిమాండ్ చేసి కావాల్సింది సాధించే నాయకత్వం ఇప్పుడు లేదని అన్నారు.

'ప్రశ్నించే నాయకుడు ఏపీలో లేరు - ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుందాం'

ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే టైమ్ చెప్పండి- బీఆర్​ఎస్​కు ఐదో మనిషి కూడా మిగలడు: రేవంత్ రెడ్డి

వైఎస్‌ వైఎస్‌ చేసిన కృషే కారణం: ఎంతో పోరాటం చేసి 2004లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని, అప్పట్లో యూపీఏ వచ్చేందుకు ఆయన చేసిన కృషే కారణమని కొనియాడారు. రైతులను ఆదుకునేందుకు వైఎస్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్న రేవంత్, ఆనాడు రైతుల కరెంట్ బిల్లుల బకాయిలను రద్దు చేశారని గుర్తు చేశారు. వైఎస్ సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీ తెచ్చి పేదలను ఆదుకున్నారని, పేద పిల్లలు కూడా ఎదగాలనే ఫీజు రియంబర్స్‌మెంట్‌ను తెచ్చారని, రైతులు అన్నిరకాలుగా బాగుపడాలనే జలయజ్ఞం చేపట్టారని తెలిపారు.

రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసి ఉండాలి: ఏ కష్టం వచ్చినా తెలుగువారంతా ఒకరికి ఒకరు తోడుండాలని రేవంత్ పిలుపునిచ్చారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా మనమంతా కలిసి ఉండాలన్నారు. ఏపీ ప్రజలకు కావాల్సింది పాలకులు కాదని, ప్రశ్నించే గొంతుకలని పేర్కొన్నారు. వెన్నెముక లేని నాయకత్వం ఏపీ సమస్యలను పరిష్కరించదన్న రేవంత్, ఆంధ్రప్రదేశ్​ ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పి షర్మిల ఇక్కడకు వచ్చారని తెలిపారు.

ఏపీలో పోరాటం ఎంత కష్టమో షర్మిలకు తెలుసు: ఏపీ హక్కులను సాధిస్తా అని చెప్పి షర్మిల ఇక్కడకు వచ్చారని, ఎవరో వచ్చి విశాఖ ఉక్కును అమ్ముకుంటుంటే ఊరుకోబోమని ఆమె చెప్పారన్నారు. అదానీ కోసం ప్రధాని స్టీల్‌ప్లాంట్‌ను తెగనమ్ముతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పోరాటం ఎంత కష్టమో షర్మిలకు తెలుసని అన్నారు. రాహుల్‌ను ప్రధాని చేయడమే తన లక్ష్యమని వైఎస్ ఎప్పుడూ చెప్పేవారని రేవంత్ పేర్కొన్నారు.

కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత నాది : రేవంత్ రెడ్డి

వైఎస్‌ఆర్‌ అంటేనే వై షర్మిలా రెడ్డి: సెక్యులర్ రాష్ట్రాన్ని కమ్యునల్‌ ఫోర్స్‌కు అప్పగిస్తారా అంటూ రేవంత్ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ అంటేనే వై షర్మిలా రెడ్డి అని, ఎన్ని కష్టాలు వచ్చినా వైఎస్ ఏనాడు బీజేపీతో అంటకాగలేదని గుర్తు చేశారు. ఏపీ ప్రజలు ప్రపంచ దేశాల్లో తమ సత్తా చాటుతున్నారన్న రేవంత్, ఇక్కడి విశాఖ నగరం సింగపూర్‌లా ఉంటుందని కొనియాడారు. ఏపీ ప్రజల తరఫున నిలబడే వ్యక్తి షర్మిల అని, ఆమెకు అండగా నిలబడాలని రేవంత్ పిలుపునిచ్చారు.

మళ్లీ ఎన్నికల ప్రచారానికి వస్తా: చట్టసభలకు కాంగ్రెస్ సభ్యులను పంపాలని, 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు కాంగ్రెస్‌ ఇస్తే, షర్మిల పోరాటం చేస్తుందని, ఎవరు వచ్చి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను తీసుకుంటారో చూద్దామని తేల్చి చెప్పారు. తెలంగాణలో మోదీని ఓడించామని, కేడీని పడగొట్టినామని అన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ బలోపేతం అవుతుందని ఈ సభ చూశాక తనకు నమ్మకం కలుగుతుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. షర్మిల ఆంధ్రప్రదేశ్‌ సీఎం అవుతుందని పేర్కొన్నారు. ఏ కష్టం వచ్చినా షర్మిలకు అండగా నిలబడతానన్న రేవంత్, ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా ఉండాలని, మళ్లీ ఎన్నికల ప్రచారానికి వస్తానని స్పష్టం చేశారు.

అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు: షర్మిల

YS Sharmila Comments: విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ కుట్ర పన్నుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. తమ ప్రాణాలు అడ్డువేసైనా సరే స్టీల్ ప్లాంట్​ను కాపాడుకుంటామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పుడు పిలిచినా వచ్చి పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా గురించి మోదీని ఏనాడైనా జగన్ గట్టిగా ప్రశ్నించారా అని షర్మిల నిలదీశారు.

తీర్మానం చేసి చేతులు దులిపేసుకున్నారు: గంగవరం పోర్టును అదానీకి అప్పగించారని, అనేక కుట్రలు పన్ని జింక్‌ పరిశ్రమను దెబ్బకొట్టారని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను క్రమంగా నష్టాల్లోకి తీసుకెళ్లారని, స్టీల్‌ప్లాంట్‌లో పనిచేసే 30 వేలమంది కార్మికులు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి అధికార, ప్రతిపక్ష నేతలు మాట్లాడరా అని షర్మిల ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై జగన్‌ ఎందుకు ఉద్యమం చేయలేదని, తీర్మానం చేసి చేతులు దులిపేసుకున్నారని ధ్వజమెత్తారు.

మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు: మన రాష్ట్రాన్ని పరిపాలించేది బీజేపీనే అని, హోదా, పోలవరం, రాజధాని గురించి కేంద్రాన్ని ఎవరూ అడగరని మండిపడ్డారు. పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ఏపీకి ఏదైనా ఇచ్చిందా అని ప్రశ్నించిన షర్మిల, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరుగుతున్నా ఏమీ పట్టించుకోరని విమర్శించారు.

తల్లిలాంటి రాష్ట్రానికి జగన్​ వెన్నుపోటు - ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలి : షర్మిల

రక్షించాలని అడిగేందుకే దిల్లీ వెళ్తున్నారు: పదేళ్లుగా రాష్ట్రాన్ని ఏ నాయకుడూ పట్టించుకోలేదన్న షర్మిల, ఏపీకి హోదా ఇస్తామని మోదీ మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో గతంలో జగన్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని, మోదీని ఏనాడైనా గట్టిగా ప్రశ్నించారా అని నిలదీశారు. చిన్నాన్నను చంపిన వారిని రక్షించాలని అడిగేందుకే దిల్లీ వెళ్తున్నారని విమర్శించారు.

ప్రాణాలు అడ్డువేసైనా సరే స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం: ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. మొదటి సంతకం ప్రత్యేక హోదాపై పెడతామని రాహుల్ మాటిచ్చారన్న షర్మిల, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పదేళ్లపాటు హోదా ఇస్తారని అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను కాంగ్రెస్ ఎప్పటికీ ఒప్పుకోదని, తమ ప్రాణాలు అడ్డువేసైనా సరే స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని షర్మిల స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గురించి ఎప్పుడు పిలిచినా వస్తానని, పోరాడతానని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకు తన పోరాటం ఆగదని అన్నారు.

సిద్ధం సభలకు జగన్‌ రూ.600 కోట్లు ఖర్చు పెట్టారని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఒక ఊరి అభ్యర్థులను మరో ఊరికి మార్చడం ఎప్పుడూ చూడలేదని, అభ్యర్థులను బదిలీ చేయడం వైసీపీలోనే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. సంపూర్ణ మద్యనిషేధం అన్నారని, ఎక్కడైనా జరిగిందా అని నిలదీశారు. ఏపీలో ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని అన్నారు.

సిద్దం సభలకు రూ 600 కోట్లు- ఉద్యోగాలు ఇవ్వలేకపోయి, ప్రజాధనాన్ని దోచేస్తున్నారు: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.