ETV Bharat / politics

ఇవాళ తప్పు చేసి రేపు తప్పించుకోగలరా? - ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 12:50 PM IST

High Court fire on AP Police : ఏపీ పోలీసుల వైఖరిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడే పరిస్థితి వస్తే ఇక సామాన్యులకేం రక్షణ ఉంటుందని వ్యాఖ్యానించింది. ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి మారదా? ఇవాళ తప్పులు చేసి భవిష్యత్​లో తప్పించుకోగలరా అని ఆగ్రహించింది.

mla_eluri_sambashivarao
mla_eluri_sambashivarao

High Court fire on AP Police : ఏపీ పోలీసులపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల వైఖరి సరికాదని, చట్టాన్ని అతిక్రమిస్తున్నారని వ్యాఖ్యానించింది. చట్టం ఉందన్న విషయం ఈ రోజు మర్చిపోతే తుదుపరి పరిణామాలపై తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరించింది. ప్రజలు ఎన్నుకొన్న ఎంపీ, ఎమ్మెల్యేలే పోలీసులకు భయపడే పరిస్థితి ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నిస్తూ ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరో ఓ ఉన్నతాధికారిపై చర్యలు తీసుకుంటే తప్ప చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదని హైకోర్టు పేర్కొంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిలు పిటిషన్‌ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

పర్చూరు ఓట్ల తొలగింపుపై స్పందించిన హైకోర్టు - ఫిబ్రవరి 2కు విచారణ వాయిదా

ఏం జరిగిందంటే! ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నోవా అగ్రిటెక్ కంపెనీ నల్లధనాన్ని తెచ్చి గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కంపెనీ మాజీ ఉద్యోగులు బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పర్చూరు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు అనుమతించడంతో ఎమ్మెల్యే ఏలూరితో పాటు కంపెనీ ఉద్యోగులపై కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123, 171-ఇ, ఐపీసీ 120, 155(2)సీఆర్​పీసీ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గ్రానైట్ ఫ్యాక్టరీలో తనిఖీ చేయకుండా విధులకు ఆటంకం కలిగించారని, దాడికి పాల్పడ్డారని గనులు, భూగర్భశాఖ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ మార్టూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్యాక్టరీ యజమాని, ఆయన అనుచరులతో పాటు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదైంది.

వసతిగృహాల్లో నేలపై నిద్రించే పరిస్థితి వస్తే మన పిల్లల్ని చేరుస్తామా? : ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (Yeluri Sambasiva Rao) హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు పోలీసులు అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసులలో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉంటే అరెస్టుకు ఏవిధంగా యత్నిస్తారని పోలీసులను సూటిగా ప్రశ్నించింది. అరెస్ట్ చేయనీయండి అందుకు బాధ్యులు పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించింది. బాధ్యులైన అధికారి అరెస్టుకు తాము అదేశాలిస్తామని స్పష్టం చేసింది. ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదని పేర్కొంది. అరెస్టు భయంతో ఏడేళ్లలోపు జైలు శిక్ష కేసులలో 41ఏ నోటీసు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆందోళన చెందుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వివరాలు సమర్పించేందుకు విచారణను రేపటికి వాయిదా వేసింది.

భార్యాపిల్లలు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోరా - పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

సుప్రీం కోర్టు తీర్పును ఉటంకిస్తూ.. బెయిల్​ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సాంబశివరావు తనను తప్పుడు కేసులో ఇరికించారని, ప్రాథమిక విచారణ కూడా జరపకుండా పోలీసులు నేరుగా తనపై కేసు నమోదు చేశారని తెలిపారు. రాజకీయ కారణాలతో తప్పుడు కేసులు మోపారని, పోలీసులు పెట్టిన సెక్షన్లు అన్నీ ఏడు సంవత్సరాల లోపు జైలు శిక్షకు వీలున్నవని చెప్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ కేసులో 41ఏ నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందన్నారు.

కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదు - కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీది రెండో స్థానం

పోలీసుల సస్పెన్షన్​ కూడా కారణం: తన నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించిన సాంబశివరావు.. ఓట్ల తొలగింపు కోసం గంపగుత్తంగా ఫారం-7 దాఖలు చేసిన విషయాన్ని ఆధారాలతో చూపించారు. ఈ కారణంతో అందుకు బాధ్యులైన పోలీసు అధికారులు సస్పెండ్​కు గురయ్యారు. తనపై కేసుల నమోదుకు ఇది కూడా ఓ కారణని, తనను వేధించడం కోసం పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని తెలిపారు.

కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ - ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.