ETV Bharat / politics

అనకాపల్లి బెల్లం రుచి చూడబోయేది ఎవరు - ఎంపీ బరిలో పోటాపోటీ - anakapalli lok sabha seat

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 10:25 AM IST

Anakapalli_Lok_Sabha_Seat_Political_War
Anakapalli_Lok_Sabha_Seat_Political_War

Anakapalli Lok Sabha Seat Political War: తొమ్మిది ఓట్ల తేడాతో ఒక పార్లమెంట్ స్థానం ఫలితం నిర్దేశించిన నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే వెంటనే గుర్తుకొచ్చేది అనకాపల్లి. పోలైన లక్షల ఓట్లలో ఇక్కడ ఎంపీగా కేవలం 9 ఓట్ల మెజార్టీతో గెలిచి 1989లో కొణతాల రామకృష్ణ సంచలనం సృష్టించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల కలబోతగా ఉండే ఈ నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పెట్టని కోటగానే ఉంటూ వచ్చింది. గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్సీపీ అభ్యర్ధులే కైవసం చేసుకున్నా, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఈసారి ఫలితాలను తారుమారు చేయటం ఖాయమని విశ్లేషకుల అంచనా. అనకాపల్లి జిల్లాగా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఈసారి ఎవరిని అందలం ఎక్కిస్తాయన్నది అసక్తికరంగా మారింది.

అనకాపల్లి బెల్లం రుచి చూడబోయేది ఎవరు - ఎంపీ బరిలో పోటాపోటీ

Anakapalli Lok Sabha Seat Political War: అనకాపల్లి జిల్లా భౌగోళికంగా 4292 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. రెండు రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి. జిల్లాలో 12.73 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 6.20 లక్షల పురుషులు, 6.53 లక్షల మహిళలు. 1962లో ఏర్పాటైన ఈ పార్లమెంట్ స్ధానానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. తొమ్మిదిసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు తెలుగుదేశం, ఒకసారి వైఎస్సార్సీపీ ఇక్కడ విజయం సాధించింది.

ప్రస్తుతం అనకాపల్లి లోక్ సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ బరిలో ఉన్నారు. ఈయనకు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన సీఎం రమేష్‌, జాతీయ పార్టీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టాలని వ్యూహాత్మకంగానే అనకాపల్లి స్థానాన్ని ఎంచుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేశారు. ఈ జిల్లాలో తన సామాజికవర్గానికి ఉన్న పట్టుతో, రాజకీయ చతురతతో అన్ని నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకొంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సీఎం రమేష్ కోసం ప్రచారం చేశారు. ఇక ప్రస్తుత ఎంపీ డాక్టర్ సత్యవతికి వైఎస్సార్సీపీ ఈసారి టికెట్‌ నిరాకరించింది.

వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడిను బరిలోకి దింపింది. తొలుత ఇక్కడ గుడివాడ అమర్ నాథ్‌ ను రంగంలోకి దింపాలని చూసినా, కూటమి అభ్యర్ధి రాకతో వైఎస్సార్సీపీ తన వ్యూహన్ని మార్చుకోవాల్సి వచ్చింది. మాడుగులలో ఎమ్మెల్యేగా పనిచేసిన ముత్యాల నాయుడు ఈసారి తనను లోక్‌సభకు పంపాలంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కనీస మరమ్మతులు లేని రోడ్లు, నిర్వహణలోపం, విద్య, వైద్య కళాశాల నిర్మాణం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తేవడంలో విఫలం కావడం వంటివి వైఎస్సార్సీపీకి ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. మరోవైపు ప్రజలు అవకాశం ఇస్తే అనకాపల్లి జిల్లాను అభివృద్ధి బాటలో తీసుకెళ్లే దిశగా కృషి చేస్తానని సీఎం రమేష్‌ చెబుతున్నారు.

రాజంపేట బరిలో మాజీ సీఎం - అన్న ఎంపీ, తమ్ముడు ఎమ్మెల్యే! - Rajampet LOK SABHA ELECTIONS

Anakapalli Assembly constituency: అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా చూస్తే అనకాపల్లి శాసనసభ బరిలో జనసేన అభ్యర్థిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. గతంలో కొణతాల రాజకీయ జీవితంతో పాటు రైవాడ ఉద్యమం, ప్రజాప్రతినిధిగా చేసిన అభివృద్ధి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న దాడి వీరభద్రరావు, కొణతాల ఒకే తాటిపైకి వచ్చి పని చేయడం రాజకీయంగా కొత్త సమీకరణలకు ఊతమిచ్చింది. ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ను బదిలీ చేసిన వైఎస్సార్సీపీ రాజకీయ నేపథ్యం ఉన్న మలసాల భరత్‌ను బరిలోకి దింపింది. ప్రభుత్వ పథకాలే తనకు కలిసి వస్తాయన్నది వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్‌ అంచనా.

Pendurthi assembly constituency: జీవీఎంసీ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానం పెందుర్తి. ఇక్కడ జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం, కూటమి పార్టీల బలం ఆయనకు అనుకూల అంశం. టిక్కెట్టు కేటాయించక ముందు నుంచి ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునేలా చేసిన కార్యక్రమాలు రమేష్ బాబు విజయావకాశాలను మెరుగ్గా ఉంచాయి. వైఎస్సార్సీపీ నుంచి రెండోసారి అదీప్‌రాజ్ బరిలో నిలిచారు. అవినీతి ఆరోపణలు, సొంత పార్టీలోనే వ్యతిరేకతలు ఈయనకు ప్రతికూలంగా ఉన్నాయి.

ప్రకృతి అందాలకు నెలవు అమలాపురం - స్పీకర్​ బాలయోగి సేవలు చిరస్మరణీయం - Amalapuram LOK SABHA ELECTIONS

Narsipatnam Assembly constituency: ఏజెన్సీ ముఖద్వారంగా పిలిచే నర్సీపట్నం అసెంబ్లీ బరిలో తెలుగుదేశం నుంచి పదోసారి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీ చేస్తున్నారు. మంత్రిగా వివిధశాఖలు నిర్వహించిన ఈయన అనుభవం నర్సీపట్నం అభివృద్దికి తోడ్పడింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశానికి వీరవిధేయంగా ఈయన కుటుంబం ఉండడం అయ్యనపాత్రుడికి ఈ ప్రాంతంలో ప్రత్యేకతనే తెచ్చిపెట్టింది. కక్షసాధింపుగా జగన్ ఈ ఐదేళ్లలో అయ్యన్నపై ప్రవర్తించిన తీరును ఆయన స్థిరంగా ఎదుర్కొనేలా చేసింది ఇక్కడి ప్రజల మద్దతే.

పాలిటెక్నిక్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఏరియా ఆసుపత్రి, జాతీయ రహదారి అనుసంధాన రహదారి నిర్మాణం ఈయన హయాంలోనే జరగడం వంటివి కలిసొచ్చే అంశాలు. వైఎస్సార్సీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌ రెండోసారి బరిలో నిలిచారు. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌కు గణేష్‌ సోదరుడు. ఐదేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ చేయకపోవటం ఈయనకు ప్రతికూలాంశంగా ఉంది. నర్సీపట్నంలో వైద్యకళాశాల నిర్మాణం, ఏరియా ఆస్పత్రి విస్తరణ, నర్సీపట్నం పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ ఏర్పాటు చేయలేకపోవటంపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

గుంటూరు గడ్డ టీడీపీ అడ్డా - నేటికీ అడుగుపెట్టని వైఎస్సార్సీపీ - Guntur LOK SABHA ELECTIONS

Chodavaram Assembly constituency: చోడవరం నియోజకవర్గం అటు ఏజెన్సీకి ఇటు మైదాన ప్రాంతానికి దగ్గర ఉన్న ప్రాంతం. ఎమ్మెల్యేగా ఉన్న కరణం ధర్మశ్రీని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రంగంలోకి దించింది. తెలుగుదేశం తరఫున కేఎస్​ఎన్​ఎస్ రాజు పోటీ చేస్తున్నారు. శాసనసభ్యుడిగా అనుభవం ఉన్న రాజు ఈసారి ప్రచారంలోనూ ఓటర్ల అభిమానాన్ని పొందడంలో ముందంజలో ఉన్నారు. కూటమి పక్షాల ఐక్యత కూడా రాజుకి కలిసొచ్చే అంశం. రోడ్లు, చక్కెర కార్మాగారం అభివృద్ధి, రోడ్ల మరమ్మతులపై దృష్టిపెట్టని వైఎస్సార్సీపీ తీరును తన ప్రచారాస్త్రాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు.

Madugula Assembly constituency: అనకాపల్లి జిల్లాలోనే అతిచిన్న సెగ్మెంట్ మాడుగుల. అల్లూరి జిల్లాకు సరిహద్దు ప్రాంతం. ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బూడి ముత్యాలనాయుడును అనకాపల్లి లోక్‌సభకు బదిలీ చేసింది. ముత్యాలనాయుడు రెండో భార్య కుమార్తె అనురాధ ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సీటు ఆశించి భంగపడిన ముత్యాలనాయుడి పెద్ద భార్య కుమారుడు బూడి రవి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవటంతో వైఎస్సార్సీపీ ఓట్లు చీలేందుకు అవకాశం ఉంది. తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రంగంలోకి దిగారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న మాడుగులలో గత రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ గెలిచింది. ఐదేళ్లలో వైఎస్సార్సీపీ అక్రమాలపై టీడీపీ చేసిన పోరాటాలు ఇక్కడ బండారుకు కలిసొచ్చే అంశాలు.

సూపర్​ స్టార్​ను గెలిపించి ఓడించిన ఏలూరు - నేడు ఉత్కంఠ రేపుతున్న పోరు - ELURU LOK SABHA ELECTIONS

Elamanchili Assembly constituency: యలమంచిలి అసెంబ్లీ స్థానం బరిలో వైఎస్సార్సీపీ నుంచి ఉప్పలపాటి రమణమూర్తి రాజు పోటీ చేస్తున్నారు. ఐదేళ్లుగా విపరీతమైన భూ ఆక్రమణల ఆరోపణలే ఈయనకు ప్రతికూలాంశం. జనసేన నుంచి సుందరపు విజయ్‌కుమార్ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో పాడి రైతులకు సహకారం అందించకపోవటం, ఫార్మా సెజ్‌లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించలేకపోవడం తదితర అంశాలను ప్రచారస్త్రాలుగా చేసుకుని విజయ్‌కుమార్‌ ముందుకెళ్తున్నారు.

Payakaraopeta Assembly Constituency: పాయకరావుపేట నియోజకవర్గం బరిలో తెలుగుదేశం అభ్యర్థిగా వంగలపూడి అనిత పోటీ చేస్తున్నారు. ఇక్కడ గతంలో తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఆమె ముందుకు వెళ్తున్నారు. ప్రత్యర్థిగా వైఎస్సార్సీపీ కంబాల జోగులును బదిలీపై తెచ్చింది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన గొల్ల బాబూరావును రాజ్యసభకు పంపిన వైఎస్సార్సీపీ, శ్రీకాకుళం జిల్లా నుంచి జోగులును ఇక్కడికి తీసుకొచ్చింది. వలస నాయకుడిగా ముద్రపడిన ఈయనకు పార్టీ శ్రేణుల నుంచే వ్యతిరేకత ఉంది. ముమ్మర ప్రచారాలతో అనిత ప్రజల్లోకి వెళ్తున్నారు.

పౌరుషానికి ప్రతీక పల్నాడు గడ్డ - నర్సరావుపేట ఎవరి అడ్డా? - Narasaraopet LOK SABHA ELECTIONS

అనకాపల్లి జిల్లాలో ఏటికొప్పాక బొమ్మల పరిశ్రమకు చేయూత ఇవ్వాల్సి ఉంది. పూడిమడక ఫిషింగ్ జెట్టీ నిర్మాణం, నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చిన అనుసంధాన రోడ్ల విస్తరణ సమస్యలపై పాలకులు దృష్టి పెట్టలేదు. అయ్యన్నపాలెం వద్ద ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పూర్తికాకపోవటండం మరో ముఖ్యమైన సమస్య. ప్రధాన జలాశయాల మరమ్మతులు, ఆలయ, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ చర్యలు చేపట్టలేదు. వైఎస్సార్సీపీ పాలన తీరుతో విసిగిపోయిన ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈసారి అనకాపల్లి బెల్లం తీపి రుచి చూడబోయేది ఎవరో ప్రజలు ఎవరిని అందలం ఎక్కించనున్నారో అన్నది వచ్చే నెల 13న ప్రజలు ఇవ్వబోయే తీర్పుతో తేలిపోనుంది.

అంతుచిక్కని సింహపురి రాజకీయం - ఎవరిని వరించేనో విజయం - Nellore LOK SABHA ELECTIONS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.