India On Gaza Humanitarian Conflict : గాజాలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని భారత్ స్వాగతించింది. దీన్ని ఒక సానుకూల చర్యగా అభివర్ణించింది. ఇజ్రాయెల్-హమాస్ వివాదం ఫలితంగా ఏర్పడిన మానవతా సంక్షోభం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
'గాజాలో కొనసాగుతున్న ఘర్షణతో మేం తీవ్ర ఆందోళనకు గురవుతున్నాం. అక్కడ నెలకొన్న మానవతా సంక్షోభం చాలా తీవ్రమైంది. దీని వల్ల ఆ ప్రాంతంతో పాటు వెలుపల కూడా అస్థిరత పెరుగుతోంది' అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ సోమవారం జనరల్ అసెంబ్లీ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ యుద్ధం వల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ ఘర్షణలో బాధితులుగా మారారని తెలిపారు.
-
#WATCH | India's permanent representative to the United Nations Ruchira Kamboj says, "...As far as my country is concerned, India's position on the conflict has been clearly articulated on more than one occasion by our leadership. There are four key points here- One, the ongoing… pic.twitter.com/9FJI3Rbbgm
— ANI (@ANI) April 9, 2024
'మానవతా సాయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది'
ఇరు దేశాల(ఇజ్రాయెల్-పాలస్తీనా) మధ్య వివాదంపై భారత్ తన వైఖరిని ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేసిందని కాంబోజ్ నొక్కిచెప్పారు. సామాన్య పౌరులను బందీలుగా చేసుకోవడాన్ని ఏమాత్రం సమర్థించబోమని తేల్చి చెప్పారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్ దాడులు దిగ్భ్రాంతి కలిగించాయని, వాటిని భారత్ ఇప్పటికే తీవ్రంగా ఖండించినట్లు గుర్తుచేశారు.
అలాగే గాజాలో మానవతా సంక్షోభంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి అక్కడి ప్రజలకు మానవతా సాయాన్ని తక్షణమే పెంచాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ పాలస్తీనా ప్రజలకు సురక్షితమైన సరిహద్దులతో కూడిన స్వతంత్ర దేశం పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి భారత్ కట్టుబడి ఉందని కాంబోజ్ పునరుద్ఘాటించారు. ఆ దిశగా సామరస్యపూర్వక వాతావరణంలో అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
కాల్పుల విరమణకు మద్దతుగా 14 దేశాలు!
కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ యునైటెడ్ నేషన్స్ సెక్యురిటీ కౌన్సిల్(యూఎన్ఎస్సీ) మార్చి 25న తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి 14 దేశాలు మద్దతు తెలపగా అమెరికా మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంది. అలాగే వెంటనే బందీలను విడుదల చేయాలని తీర్మానంలో హమాస్‌ను డిమాండ్ చేసింది. గాజాలో ఆకలితో అలమటిస్తున్నవారికి మానవతా సాయం అందేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది యూఎన్ఎస్సీ. అంతకుముందు కాల్పుల విరమణను కోరుతూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాశ్వత సభ్యదేశాలైన రష్యా, చైనా తమ వీటో అధికారంతో తిరస్కరించాయి. దీనిపై ఐరాస సాధారణ సమావేశాల్లో వివిధ దేశాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.
సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి - 44 మంది మృతి- సైనికులే అధికం! - Israel Attack On Syria
ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- ఏడుగురు అధికారులు మృతి! - Israel Attack On Damascus